పయ్యావులకు ఈ సారి లక్ కలిసొస్తుందా?

పయ్యావుల కేశవ్…టీడీపీలో సీనియర్ నాయకుడు. మంచి వాక్చాతుర్యంతో ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టే కేశవ్‌కు రాజకీయాల్లో పెద్దగా లక్ లేదనే చెప్పొచ్చు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, [more]

Update: 2021-06-05 03:30 GMT

పయ్యావుల కేశవ్…టీడీపీలో సీనియర్ నాయకుడు. మంచి వాక్చాతుర్యంతో ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టే కేశవ్‌కు రాజకీయాల్లో పెద్దగా లక్ లేదనే చెప్పొచ్చు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన, ఆయనకు మంత్రి కల నెరవేరలేదు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పయ్యావుల కేశవ్ 1994 ఎన్నికల్లో అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ద‌య‌తో తొలిసారి టిక్కెట్ ద‌క్కించుకున్న కేశ‌వ్ అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నా సరే పయ్యావుల కేశవ్ తొలిసారి గెలవడంతో మంత్రి పదవి దక్కలేదు. 1999 ఎన్నికలోచ్చేసరికి టీడీపీ అధికారంలోకి వచ్చింది గానీ, పయ్యావుల కేశవ్ ఓటమి పాలయ్యారు. ఇది కేశ‌వ్ జీవితంలో తొలి దుర‌దృష్టం.

అన్నీ దురదృష్టాలే…?

2004 ఎన్నికల్లో పయ్యావుల కేశవ్ మరొకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ దురదృష్టం ఏంటంటే టీడీపీ అధికారం కోల్పోయింది. 2009 ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. పయ్యావుల కేశవ్ గెలిస్తే, టీడీపీ అధికారంలోకి రాలేదు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్రభంజ‌నాన్ని త‌ట్టుకుని కూడా రెండు సార్లు కేశ‌వ్ గెలిచినా ప్రతిప‌క్ష పాత్రకే ప‌రిమితం అయ్యారు. అయితే 2014 ఎన్నికల్లో కేశవ్‌ని మరోసారి దురదృష్టం వెంటాడింది. ఉరవకొండ నుంచి స్వల్ప మెజారిటీతో పయ్యావుల కేశవ్ ఓటమి పాలయ్యారు. కానీ టీడీపీ మాత్రం అధికారంలోకి వచ్చింది. ఇది పయ్యావుల కేశవ్ జీవితంలో రెండో దుర‌దృష్టం.

ఎమ్మెల్సీ ఇచ్చినా…?

అయితే సీనియర్ నాయకుడుగా ఉండటంతో చంద్రబాబు, పయ్యావుల కేశవ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. మంత్రి పదవి మాత్రం ఇవ్వలేదు. 2017 కేబినెట్ మార్పుల్లో ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్నా రాలేదు. 2019 ఎన్నికల్లో పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. పయ్యావుల కేశవ్ నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ మాత్రం అధికారం కోల్పోయింది. ఈ విధంగా కేశవ్‌కు ఏ మాత్రం లక్ కలిసి రాలేదు. ప్రస్తుతం పి‌ఏసీ ఛైర్మన్‌గా ఉన్న పయ్యావుల కేశవ్, రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్‌గా ఉండటం లేదు. చంద్రబాబు ఎంతో న‌మ్మకంతో కేబినెట్ ర్యాంకు ఉన్న ప‌ద‌వి కేశ‌వ్‌కు ఇచ్చినా ఆయ‌న ఎంత మాత్రం పార్టీ త‌రపున బ‌ల‌మైన వాయిస్ వినిపించ‌డం లేదు.

ఈసారైనా?

చంద్రబాబుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు నిత్యం వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. కానీ పయ్యావుల కేశవ్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఏదో అసెంబ్లీ సమావేశాలకు, పార్టీ మీటింగులకు అప్పుడప్పుడు హాజరవుతున్నారు తప్ప, మిగతా సమయాల్లో పార్టీ కోసం కష్టపడిన సందర్భాలు లేవు. వరుసగా లక్ కలిసిరాకపోవడంతోనే పయ్యావుల కేశవ్ సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం, పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి దక్కించుకోవడం జరుగతాయో లేదో..?

Tags:    

Similar News