రివ్యూ: సాహో
టైటిల్: సాహో నటీనటులు: ప‌్రభాస్, శ్రద్ధాకపూర్, జాకీష్రాప్, నీల్‌నితిన్ ముఖేష్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, అరుణ్ విజయ్, ప్రకాశ్ బల్దేవ్, ఎవ్లిన్ శర్మ, సుప్రీత్, చుంకీ పాండే, [more]
టైటిల్: సాహో నటీనటులు: ప‌్రభాస్, శ్రద్ధాకపూర్, జాకీష్రాప్, నీల్‌నితిన్ ముఖేష్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, అరుణ్ విజయ్, ప్రకాశ్ బల్దేవ్, ఎవ్లిన్ శర్మ, సుప్రీత్, చుంకీ పాండే, [more]
టైటిల్: సాహో
నటీనటులు: ప‌్రభాస్, శ్రద్ధాకపూర్, జాకీష్రాప్, నీల్‌నితిన్ ముఖేష్, వెన్నెల కిషోర్, మురళీశర్మ, అరుణ్ విజయ్, ప్రకాశ్ బల్దేవ్, ఎవ్లిన్ శర్మ, సుప్రీత్, చుంకీ పాండే, మందిరా బేడీ, మహేష్ మంజ్రేకర్, టిను ఆనంద్
జానర్: యాక్షన్ థ్రిల్లర్
ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్
విజువల్ ఎఫెక్ట్స్: కమల్ కణ్ణన్
నృత్యాలు: రాజు సుందరం
యాక్షన్: కెన్నీ బెట్స్, పెంగ్‌జాంగ్, బాబ్ బ్రౌన్, స్టన్ సిల్వ, రామ్‌లక్ష్మణ్, దిలీప్ సుబ్రహ్మణ్యం, స్టెఫాన్ రిచ్టార్
సినిమాటోగ్రఫీ: మది
ఎడిటింగ్: శ్రీకరప్రసాద్
నేపథ్య సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు: ప‌్రమోద్ – వంశీ
కథ,దర్శకత్వం: సుజీత్
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రన్ టైం: 172 నిమిషాలు
రిలీజ్ డేట్: 30 ఆగస్టు, 2019
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులంతా ఎదురుచూశారు. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఎలా పెరిగిపోయిందో చూస్తున్నాం. బాహుబలి స్టార్‌డమ్‌ను కంటిన్యూ చేసేలా ప్రభాస్ రూ.350 కోట్లతో భారీ రిస్క్ చేసి మరీ సాహో సినిమా చేశాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా తెరపై రాని యాక్షన్ కథతో తెరకెక్కిన సాహోలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటించింది. యూట్యూబ్ స్టార్ నుంచి రన్ రాజా రన్ సినిమాతో హిట్ కొట్టిన 25 ఏళ్ల కుర్ర డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. రూ. 333 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్‌తో సాహో రిలీజ్‌కు ముందే సంచలనం రేపింది. టీజర్, ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డులకు లెక్కేలేదు. ప్రభాస్‌కు అత్యంత సన్నిహితులు అయిన వంశీ – ప్రమోద్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మళయాళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. దేశం అంతా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాహో ఫీవర్‌తో ఊగిపోతోంది. శుక్రవారం రిలీజ్ అయిన సాహో ఎలాంటి టాక్ తెచ్చుకుందో తెలుగుపోస్ట్ సమీక్షలో చూద్దాం.
స్టోరీ …
సాహో కథ వాజీ సిటీలోని ఇంటర్నేషనల్ మాఫియా ముఠా నేపథ్యంలో సాగుతుంది. ముంబైలో రూ.2 వేల కోట్ల భారీ చోరీ జరుగుతుంది. ఈ చోరీ కేసు ఇన్వెస్ట్‌గేషన్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా అశోక చక్రవర్తి (ప్రభాస్) అపాయింట్ అవుతాడు. అతడి టీంలో అమృతా నాయర్ (శ్రద్ధాకపూర్) స్పెషల్ క్రైం బ్రాంచ్ ఆఫీసర్‌గా ఉంటుంది. వెన్నెల కిషోర్, మురళీశర్మ కూడా అశోక చక్రవర్తి టీంలోనే ఉంటాడు. అదే టైంలో దుబాయ్‌లో ఉంటూ ఇంటర్నేషనల్ మాఫియా లీడర్లకు రాజుగా ఉన్న రాయ్ (జాకీష్రాఫ్) 20 ఏళ్ల తర్వాత ఇండియాలో తన కొడుకు కోసం అడుగు పెట్టిన వెంటనే హత్యకు గురవుతాడు. ఈ చోరీ కేసు నడుస్తుండగానే అశోక్, అమృత ప్రేమలో పడడం అశోక్ గురించి అమృతకు ఓ షాకింగ్ న్యూస్ తెలియడం జరుగుతుంది.
ట్విస్టులతో….
దుబాయ్ మాఫియా టీంకు నాయకుడు అవ్వాలని చుంకీపాండే కలలు కంటుంటాడు. అయితే ఆ ప్లేస్‌ను రాయ్ వారసుడు అరుణ్ విజయ్‌కు అప్పగిస్తారు. రూ. 2 వేల కోట్లతో స్టార్ట్ అయిన కథ కాస్తా చివరకు 2 లక్షల కోట్లకు సంబంధించిందిగా మారుతుంది. ఇదిలా ఉంటే సిద్దార్థరామ్ సాహో (ప్రభాస్)కు రాయ్‌కు ఉన్న లింకేంటి ? రాయ్‌ను ఎవరు హత్య చేశారు ? ఈ చోరీ కేసు ఏమైంది ? మాఫియా ముఠాకు నాయకత్వం వహించాలనుకున్న చుంకీ ఏమయ్యాడు ? సాహోకు అశోక చక్రవర్తికి ఉన్న సంబంధం ఏంటి ? అసలు సాహోలో ఎవరు విలన్లు ? ఎవరు అసలైన హీరోలు ? అన్న చిక్కుముడులు, ట్విస్టులతో నడిచే కథనమే ఈ సినిమా.
సాహో ఎనలైజింగ్……
కథ పరంగా చూస్తే సాహో లైన్ చాలా చిన్నదే. రూ. 2 లక్షల కోట్ల అమౌంట్ రాబరీ… దానికి 2 లక్షల కోట్లకు లింకు ఉండడం… దాని కోసం ఓ మాఫియా ముఠా ప్రయత్నాలు.. చివరకు హీరో వాళ్లను అంతమొందించే కాన్సెఫ్టే. దానికి గ్రాండియర్ లుక్, స్టైలీష్ టచ్ మాత్రమే ఇచ్చారు. ఇక సినిమా ఫస్టాఫ్ అంచనాలు అందుకోలేదు. ట్రైలర్లో చూపించిన టాకీపార్ట్స్ సన్నివేశాలే వచ్చేస్తాయి. ప్రభాస్ ఎంట్రీతో థియేటర్లు దద్దరిల్లినా ఆ తర్వాత మెయిన్ కథలోకి వెళ్లేందుకు దర్శకుడు గంట టైం వేస్ట్ చేశాడు. వెన్నెల కిషోర్ ఒకటి రెండు కామోడీ సన్నివేశాలు పెట్టినా డైలాగుల్లో పంచ్ లేకపోవడంతో అవి పేలలేదు. ఫస్టాఫ్‌లోనే రెండు పాటలు వచ్చేస్తాయి.
సెకండ్ హాఫ్ నుంచి….
కథకు సంబంధించిన పాత్రల పరిచయం, హీరోయిన్‌తో హీరో లవ్ ట్రాక్‌తో ఇంటర్వెల్ వరకు కథను సోసోగా నడిపించాడు. పాత్రల పరిచయంతో పాటు కథను నడిపించడంలో దర్శకుడి అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్టుగా కనపడింది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అందరి మైండ్ బ్లాక్ చేసింది. దీంతో సెకండాఫ్‌పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతాయి. సెకండాఫ్‌లో వచ్చే బ్యాడ్ బాయ్ సాంగ్ అదిరిపోతుంది. అక్కడ నుంచి కథనం ట్రాక్ ఎక్కి పరుగులు పెడుతుంది. సెకండాఫ్‌లో వచ్చే విజువల్స్, ట్విస్టులు బాగున్నాయి. సెకండాఫ్‌లో దర్శకుడు చిక్కుముడులు విప్పడంతో అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హీరోలుగా ఉన్న వారు విలన్లు అయితే…. అప్పటి వరకు విలన్లుగా ఉన్న వారు హీరోలు అవ్వడం ట్విస్టింగ్‌గా ఉంది.
థ్రిల్లింగ్ కోసం…..
సెకండాఫ్ క్లైమాక్స్‌కు ముందు వచ్చే ట్విస్టులతోనే ప్రేక్షకుడు బాగా థ్రిల్ ఫీలవుతాడు అనుకుంటే చివర్లో వచ్చే సాహో ట్విస్ట్ కూడా మరింత థ్రిల్ ఇచ్చింది. సుజీత్ కథనం కంటే ప్రతి సీన్లోనూ సినిమాకు గ్రాండ్ లుక్ ఇవ్వడంలోనూ, హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సినిమాగా తీయాలన్న తాపత్రయంతో ఉన్నట్టే ఎక్కువుగా కనిపించింది. అందుకే కథ, కథనాల కంటే అదనపు హంగుల డామినేషన్ ఎక్కువైపోయింది. యాక్షన్ ప్రియులను మాత్రం నూటికి రెండొందల శాతం మెప్పించాడు.
నటీనటుల ఫెర్ఫార్మెన్స్ ..
బాహుబలి తర్వాత సాహో కోసం ప్రభాస్ ఏకంగా రెండు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. సుదీర్ఘంగా కష్టపడడం వల్లో ఏమోగాని ప్రభాస్‌లో పాత చార్మింగ్ కాస్త తగ్గింది. సినిమాను మాత్రం ప్రభాస్ పూర్తిగా వన్ మ్యాన్ షోగా మార్చాడు. ఇక హీరోయిన్ శ్రద్ధాకపూర్ క్రైం బ్రాంచ్ ఆఫీసర్‌గా అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. యాక్షన్ సీక్వెల్స్‌లోనూ ఇరగదీసింది. వెన్నెల కిషోర్ ప్రభాస్ టీంలో ఉండే పోలీస్‌గా చేశాడు. ఇక మురళీశర్మది కూడా పోలీస్ క్యారెక్టరే. బాలీవుడ్‌కు చెందిన చుంకీపాండే ప్రధాన విలన్‌గా మెప్పించాడు. జాకీష్రాప్, నీల్ నితిన్, మందిరాబేడీ, కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ ఈ భారీ తారాగణం అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. వీరందరికి మంచి సీన్లలో నటించే ఛాన్స్ వచ్చింది. ప్రభాస్, వెన్నెల కిషోర్‌ను వదిలేస్తే ఎక్కువ మంది హిందీ నటులే ఉన్నారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్…..
టెక్నికల్‌గా చూస్తే సినిమాటోగ్రఫీకి మంచి మార్కులు వేయాలి. ప్రతి సీన్లోనూ నిర్మాతలు పెట్టిన ఖర్చు తెరపై కనపడేలా చేశాడు. కొన్ని సీన్లలో విజువల్ ఎఫెక్ట్స్‌ను చాలా నేచురల్‌గా చూపించడంలోనే అతడి పనితనం కనపడింది. ఇక ఆర్ట్ వర్క్ సినిమా స్థాయి ఏంటో చాటి చెప్పింది. శ్రీకరప్రసాద్ ఎడిటింగ్ ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను ట్రిమ్ చేయాలనిపించేలా ఉన్నా సెంకడాఫ్‌లో మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సమాంతర స్క్రీన్ ప్లేతో కథ నడుస్తున్నప్పుడు ఎక్కువ షాట్స్‌ను ఎడిట్ చేసినప్పుడు అతడి సీనియార్టీ చెప్పకనే చెప్పింది. రన్ టైం 172 నిమిషాలు కావడంతో ఫస్టాఫ్‌లో 10 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత స్పీడ్‌గా మూవ్ అయ్యేది. ఈ సినిమాకు ఐదుగురు సంగీత దర్శకులు మ్యూజిక్ ఇవ్వడంతో పాటలు ఎలా ఉన్నా వాటిని తెరపై పిక్చరైజేషన్ చేయడం బాగుంది. ఇక జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాను బాగా ఎలివేట్ చేసింది. యూవీ క్రియేషన్స్ రూ.350 కోట్లతో సినిమా తీసినట్టు పదే పదే చెప్పినా అంత ఖర్చు చేశారా ? అన్నది మాత్రం సందేహమే.
సుజీత్ డైరెక్షన్ టేకింగ్….
దర్శకుడు సుజీత్‌ను ఈ సినిమా టేకింగ్ విషయంలో కొన్నిసార్లు మెచ్చుకోవాల్సి ఉన్నా… కేవలం ఒక్క సినిమాను మాత్రమే డైరెక్ట్ చేసిన అతడి అనుభవ రాహిత్యం మాత్రం స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో కథలోకి వెళ్లేందుకు టైం కిల్ చేయడం… పాత్రల పరిచయంలో గందరగోళం కనపడింది. కేవలం యాక్షన్ బేస్ చేసుకుని సాహో తెరకెక్కించిన సుజీత్ కీలకమైన ఎమోషన్, రొమాంటిక్ ట్రాక్, కామెడీ విషయంలో తేలిపోయాడు. వీటిపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదనిపించింది. పాన్ ఇండియా సినిమా కావడం, చాలా చోట్ల ఇంగ్లీష్, చైనా, అరబిక్, హిందీ, ఇంగ్లీష్ వాడడంతో ప్రేక్షకులకు ఇబ్బంది తప్పలేదు.
సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు రివీల్ చేసిన తీరు… చాలా మంది నటులను టాకిల్ చేయడం ప్రశంసనీయం.
ప్లస్ పాయింట్స్ (+) :
– ఇంటర్వెల్ బ్యాంగ్
– సినిమాటోగ్రఫీ.. కళ్ళు చెదిరే విజువల్స్
– నేపథ్య సంగీతం
– సెకండాఫ్
– ట్విస్టులు
మైనస్ పాయింట్స్ (-) :
– ప‌్లాట్ నెరేషన్
– ఆకట్టుకోని లవ్ ట్రాక్
– డైలాగుల్లో మిస్ అయిన పంచ్
– తెలుగు నేటివిటీకి దూరం ఉన్నట్టు ఉండడం
– కామెడీ, ఎమోషన్లు వీక్
ఫైనల్‌గా…
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రభాస్ సాహో సినిమాలో యాక్షన్‌కు సాహో అనాల్సిందే. అయితే బలహీనమైన కథ, తడబడిన సుజీత్ టేకింగ్, ఎమోషన్లు, కామెడీ మిస్ అవ్వడం మైనస్. యాక్షన్ ప్రియులకు సాహో నవరసాలు ఉన్న విందు భోజనం అయితే… అన్ని వర్గాల ప్రేక్షకులను సాహో అనిపిస్తుందా ? లేదా ? అన్నది మాత్రం చూడాలి. బాహుబలి, కేజీఎఫ్ రేంజ్ సినిమా అయితే సాహో ఖచ్చితంగా కాదు. దర్శకుడు సుజీత్ హాలీవుడ్ యాక్షన్ సినిమాల ప్రభావంతో ఆ రేంజులో ఓ యాక్షన్ సినిమాగా సాహోను మార్చేశాడు.
రేటింగ్ : 3 / 5