పుట్టా కోపం ఎవరిపై ?

చస్తే రాజీనామా చేయను పొమ్మని మంకు పట్టు పట్టిన ఆయన చివరికి తనపదవికి గోవిందా కొట్టేశారు. ఆయనే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రపంచంలోనే హిందువుల పవిత్రంగా భావించే [more]

Update: 2019-06-20 18:29 GMT

చస్తే రాజీనామా చేయను పొమ్మని మంకు పట్టు పట్టిన ఆయన చివరికి తనపదవికి గోవిందా కొట్టేశారు. ఆయనే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రపంచంలోనే హిందువుల పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మెన్ గా టిడిపి నియమించి ఏడాది దాటింది. ఆయన ఆ పదవిలో రెండేళ్లు అధికారం లో ఉండేలా జీవో జారీ చేసింది. అంటే ఏడాది తరువాత జరిగే ఎన్నికల్లో సైతం తామే అధికారంలోకి తప్పకుండా వస్తామని భావించే పాలకమండలి ని ఏర్పాటు చేసేసింది. ఇక పుట్టా పేరు ప్రచారంలోకి వచ్చింది మొదలు ఆయనపై పెద్ద ఎత్తునే వివాదం చెలరేగింది. క్రైస్తవ మత ప్రోత్సహకుడు ఇదిగో అంటూ విమర్శలు చెలరేగాయి. ఇక పాయకరావు పేట ఎమ్యెల్యే అనిత క్రైస్తవ మతం లోనే కొనసాగుతున్నా అంటూ ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆమె టిటిడి పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే రాజీనామా చేసేలా చేసింది. ఇలా టిటిడి పాలకమండలి ఏర్పాటు ఆరంభంలోనే అనేక తప్పులను అధికారపార్టీ చేసేసింది.

పాలనలోనూ వివాదాలే …

గత సర్కార్ లో ఆర్దికమంత్రిగా వున్న యనమల రామకృష్ణుడు కి స్వయంగా వియ్యంకుడు కావడంతో పుట్టా సుధాకర్ యాదవ్ బాధ్యతలు చేపట్టాకా ఆయనకు ఎదురు చెప్పేవారే లేకుండా పోయారు. దాంతో ఆయన తీసుకున్న నిర్ణయాల పై వివాదాలు చుట్టూ ముడుతూ ఉండటం రొటీన్ అయిపోయాయి. ఎన్నికల సమయంలో టిటిడి బంగారం వ్యవహారం సైతం పెద్ద రచ్చకు దారితీసింది. ఇక సర్కార్ మారింది. రాష్ట్రమంతా నామినేటెడ్ పదవుల్లో వున్న వారు హుందాగా తమ పదవులకు రాజీనామా చేసి నమస్కారం పెట్టి వెళ్లిపోతున్నారు. కానీ అత్యంత కీలకమైన టిటిడి పాలకమండలి మాత్రం పదవులు పట్టుకునే వేలాడుతుంది. దానికి కారణం ఆ సీటు పవర్ అలాంటిది మరి. దేశ విదేశాల్లో వున్న ప్రముఖులనుంచి ప్రధాని, ముఖ్యమంత్రులు సుప్రీం, హై కోర్ట్ న్యాయమూర్తులు, గవర్నర్ లు డబ్బున్న మారాజులు అందరు సాగిలపడేది శ్రీనివాసుడి ముందే. వారి కి దర్శన ప్రసాదాలు మర్యాదలు చేయడంతో బాటు ఊహించని పరిచయాలు ఏర్పడతాయి. దాంతో అపరకుబేరులు సైతం తిరుమల తిరుపతి పాలకమండలి లో వుండాలని కోరుకుంటారు. రెండేళ్ళు అని రాసిచ్చిన పదవి ఏడాదిలో వదిలేయాలంటే ఎంతైనా కష్టమే. అందుకే పుట్టా సుధాకర్ యాదవ్ నే రాజీనామా చేయను ప్రభుత్వమే రద్దు చేసుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అవమానం తట్టుకోలేక ….

గత ఏప్రిల్ 28న పుట్టా సుధాకర యాదవ్ ఏర్పాటు చేసిన పాలకమండలి సమావేశం హాట్ హాట్ గా నడిచింది. సభ్యులు అధికారులపై చెలరేగడంతో ఆగ్రహంతో వారంతా వెళ్లిపోయారు. అప్పటికే పోలింగ్ పూర్తి అయింది కానీ ఎన్నికల ఫలితాలు వెలువడలేదు. అయితే ఏపీలో వైసిపికి అధికారం ఖాయమన్న సంకేతాలు బలంగా ఉండటంతో పుట్టా సుధాకర్ యాదవ్ ను లెక్క చేయకుండా టిటిడి అధికారులు వెళ్లిపోయారు. ఇలా జరగడం పాలకమండళ్ల చరిత్రలోనే ఒక రికార్డ్. దాంతో ఈ వ్యవహారాన్ని తీవ్ర అవమానంగా భావించిన పుట్టా సుధాకర్ యాదవ్ కొత్త సర్కార్ కొలువు తీరినా తాను పదవి వీడేది లేదని భీష్మించారు. సెంటిమెంట్ గా రాజీనామా చేయలేనని వ్యాఖ్యానించారు. దాంతో టిటిడి వివాదం నడుస్తూనే వుంది. ఇదిలా ఉండగా వైఎస్ జగన్ టిటిడి పాలకమండలి కొత్త ఛైర్మెన్ గా మాజీ ఎంపి వైవి సుబ్బారెడ్డి పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పాలకమండలి పదవుల గోల రసపట్టులో పడింది.

ప్లాన్ ఎ, ప్లాన్ బి సిద్ధం చేసిన వైసిపి ….

పుట్టా సుధాకర్ యాదవ్ తెగేదాకా లాగుతూ ఉండటంతో వైసిపి రెండు వ్యూహాలను ఆయన రాజీనామా చేసేలా అమలుచేయడానికి సిద్ధం అయ్యింది. అందులో ప్లాన్ ఎ లో భాగంగా పుట్టా స్విమ్స్ లో అవినీతికి పాల్పడి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం పై విచారణ జరిపించి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నిర్ధారిస్తూ ఇచ్చిన నివేదిక పక్కన పెట్టుకుంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తిరుమల వచ్చిన సందర్భంలో పాలకమండలిని రద్దు చేసి పారేస్తామని ప్రకటించడం ప్లాన్ బి గా యాక్షన్ లో పెట్టేసింది. మొత్తానికి నలువైపులా ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో ఆయన చేసేది లేక తన పదవికి రాజీనామా చేసేసారు. ఆయనతో పాటు డొక్కా జగన్నాధం కూడా రాజీనామా చేయగా, గౌతు శ్యాం సుందర్ శివాజీ, స్వప్న ముంగిత్వర్, వేనాటి రామచంద్ర రెడ్డి మాత్రం రాజీనామాలు సమర్పించలేదు. మరి జగన్ సర్కార్ యాక్షన్ ఇప్పుడు వీరిపై ఎలా వుండబోతుందో. ఇంకోవైపు వైవి సుబ్బారెడ్డి పగ్గాలు చేపట్టేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఆయన వెనుక బోర్డు సభ్యులు అయ్యేందుకు వైసిపి ఆశావహుల జాబితా పెద్దగానే వుంది. వీరిలో జగన్ ఎవర్ని కరుణిస్తారా చూడాలి.

Tags:    

Similar News