రాజుగారు ఏం చేయదలచుకున్నారు?

వైసీపీకి 22 మంది ఎంపీలు గెలిచారన్న ఆనందం మిగల్చకుండా ఒకే ఒక్కడుగా ఆ పార్టీలో అలజడి రేపుతున్నారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన ఈ ఆరు [more]

Update: 2019-12-16 05:00 GMT

వైసీపీకి 22 మంది ఎంపీలు గెలిచారన్న ఆనందం మిగల్చకుండా ఒకే ఒక్కడుగా ఆ పార్టీలో అలజడి రేపుతున్నారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఆయన ఈ ఆరు నెలల కాలంలోనే ఆరితేరిపోయారు. వైసీపీ హై కమాండ్ కి తెలియకుండా కీలకమైన సబార్డినేట్ లెజిస్లేష‌న్ మెంబర్ రూల్స్ కమిటీ చైర్ ప‌ర్సన్ గా నియమితులయ్యారు. అది బీజేపీ పెద్దల మద్దతుతోనే దక్కిందన్నది అందరికీ తెలిసిందే. పత్రికల్లో ఆ వార్త చూసి అవునా అనుకోవాల్సివచ్చింది మరి వైసీపీ పెద్దలకు. ఇదిలా ఉండగా ఈ మధ్యన ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు విందు ఇస్తే అన్ని పార్టీల నుంచి 200 ఎంపీలకు పైగా హాజరుకావడం ఆయన హవా ఏంటన్నది చెప్పకనే చెబుతోంది. ప్రధాని సైతం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆగి రాజుగారు బాగున్నారా అనడం బట్టే ఆయన పలుకుబడి ఎలా వెలిగిపోతోందో తెలిసిపోతోంది కదా. ఇక రఘురామకృష్ణంరాజు ఇపుడు కూడా ఎక్కువగా పరాయి పార్టీ నాయకులతోనే చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం వైసీపీ నేతలకు చిర్రెత్తుకొస్తోందిట.

కుడి ఎడమలతో….

ఉన్నట్లుండి విశాఖలో హఠాత్తుగా ప్రత్యక్షం అయిన రఘురామకృష్ణంరాజు బీజేపీ, టీడీపీ నాయకులతో ప్రత్యక్షం కావడం విశేషంగానే చెప్పుకుంటున్నారు. ఆయన విశాఖకు ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఓ హొటల్లో బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, టీడీపీకి చెందిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడులతో కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. నిజంగా ఈ గ్రూప్ ఫోటో రాజకీయాల్లో సంచలనమే అవుతోంది. గంటా, అయ్యన్న అసలు కలవరు, అలాంటి వారిని పక్కన పెట్టుకున్నారు, అలాగే విజయవాడకు చెందిన కామినేని శ్రీనివాస్ మరో పక్కన ఉన్నారు. మరి ఈ నాయకులంతా ఏం చేసినట్లు, ఏం మాట్లాడుకున్నట్లు అన్నది విశాఖ రాజకీయాల్లో పెద్ద చర్చగానే ఉంది.

విజయసాయి ఉండగానే…?

ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ కి కుడిభుజంగా ఉండే రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖలో పర్యటిస్తున్న సమయంలోనే సరిగ్గా రఘురామకృష్ణంరాజు కూడా సిటీలో ప్రత్యక్షం అయ్యారు. ఓ వైపు వైసీపీ నేతలు, మంత్రి, ఎమ్మెల్యేలు అంతా విజయసాయిరెడ్డి వెంట తిరుగుతూంటే రఘురామకృష్ణంరాజు మాత్రం వైసీపీ వైపే చూడకుండా ఇతర పార్టీల నేతలతో భేటీలు వేయడం ఏ రకమైన సందేశం అని అంటున్నారు. పైగా జగన్ ని నిత్యం తిట్టే అయ్యన్నపాత్రుడు వంటి వారిని పక్కన పెట్టుకుని రఘురామకృష్ణంరాజు నవ్వులు చిందించడం వంటివి చూస్తే ఆయన తొందరలో ఏదైన శుభ వార్త సొంత పార్టీకి వినిపిస్తారా అన్న డౌట్లు పుట్టుకొస్తున్నాయి. అదే విధంగా మాజీ మంత్రి గంటా బీజేపీలోకి చేరుతారని ప్రచారం ఓ వైపు సాగుతున్న నేపధ్యం ఉంది. మరి ఇలా వీరంతా ఒక్క చోట కలవడం అంటే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో మార్పులకు బీజం పడుతోందా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి ఢిల్లీలోనే కాదు, విశాఖలోనూ పొలిటికల్ హీట్ పుట్టించడంలో మాత్రం రఘురామకృష్ణంరాజు బాగా సక్సెస్ అయ్యారని అంటున్నారు.

Tags:    

Similar News