వేళయింది… అదే ఆలస్యం

తమిళ రాజకీయాల్లో వచ్చే ఏడాది అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. తమిళనాడులో శాసనసభ ఎన్నికల్లో 2021లో జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ అసెంబ్లీ [more]

Update: 2019-12-06 17:30 GMT

తమిళ రాజకీయాల్లో వచ్చే ఏడాది అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. తమిళనాడులో శాసనసభ ఎన్నికల్లో 2021లో జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటి నుంచే అన్ని పార్టీలూ అసెంబ్లీ ఎన్నిలకు సిద్దమయిపోతున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చెమటోడుస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో విజయంతో డీఎంకే పట్టలేని ఆనందంతో ఉంది. విక్రంవాడి, నాంగునేరి ఉప ఎన్నికల్లో విజయంతో అన్నాడీఎంకే ఫుల్లు జోష్ మీద ఉంది. అయితే వీరి ఆనందం మీద నీళ్లు జల్లుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటనకు వేళయింది.

రెండేళ్ల క్రితమే ప్రకటించినా….

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని 2017లో నే ప్రకటంచారు. అయితే ఇప్పటి వరకూ ఆయన పార్టీని ప్రకటించలేదు. అయితే తన పార్టీ ప్రకటించకపోయినా గత రెండేళ్లుగా పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కోటిన్నర సభ్యత్వాలు ఇప్పటికే దాటాయి. తమిళనాడులో రజనీకాంత్ వీరాభిమానులు లక్షల్లో ఉండటంతో ఆయన రాజకీయ పార్టీ ప్రకటన కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే మరికొద్ది నెలల్లోనే రజనీకాంత్ పార్టీని ప్రకటించే అవకాశముంది. వచ్చే ఏడాది రజనీకాంత్ పార్టీ ప్రకటన ఉంటుందని గాంధీ పెరవై అధ్యక్షుడు తమిళరువి మణియన్ తెలిపారు. రజనీని కలసి వచ్చిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు.

నాన్ లోకల్ వివాదం….

అయితే తమిళనాడులో రజనీకాంత్ కు లక్షల సంఖ్యలో అభిమానులున్నప్పటికీ ఆయనపై నాన్ లోకల్ అని ముద్ర ఉంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన వెంటనే రాజకీయ పార్టీలతో పాటు తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ముఖ్యులు కూడా రజనీ పై ఎదురుదాడికి దిగారు. రజనీకాంత్ తమిళనాడుకు చెందిన వాడు కాదని, మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగిన రజనీకాంత్ తమిళనాడును ఎలా శాసిస్తారని కొందరు ప్రశ్నించారు. అయితే దీనిపై రజనీకాంత్ ఎలాంటి కామెంట్స్ చేయకుండా సంయమనం పాటించారు.

అందుకే కమల్ తో జర్నీ…..

ఇక ఏడాదిన్నర మాత్రమే ఎన్నికలకు గడువు ఉండటంతో రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేయడం తప్పనిసరి. అయితే నాన్ లోకల్ వివాదం మరోసారి తలెత్తకుండా ఆయన ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే కమల్ హాసన్ ను కలుపుకోవాలని నిర్ణయించుకున్నారంటున్నారు. కమల్ హాసన్ పక్కా తమిళుడు. ఇప్పటికే ఆయన మక్కల్ నీది మయ్యమ్ పార్టీని పెట్టి లోక్ సభ, శాసనసభ ఉప ఎన్నికల్లో ఒక్క సీటును సాధించలేకపోయారు. సినీరంగంలో మిత్రుడైన కమల్ ను రాజకీయంగా కలుపుకుని వెళితే నాన్ లోకల్ సమస్య తలెత్తదని రజనీకాంత్ భావించారంటున్నారు. ఈ ఇద్దరు కలసి పోటీ చేస్తే విజయానికి తిరుగుండదని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద రజనీకాంత్ పార్టీ ప్రకటనకు వేళయిందనే చెప్పాలి.

Tags:    

Similar News