తలైవాను అడ్డుకుంటుంది వారేనా?

తమిళనాట రాజకీయ శూన్యత ఉందని అందరూ అంగీకరించే విషయమే. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత సరైనోడు లేడని తమిళులు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ స్పేస్ ను [more]

Update: 2020-03-02 18:29 GMT

తమిళనాట రాజకీయ శూన్యత ఉందని అందరూ అంగీకరించే విషయమే. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత సరైనోడు లేడని తమిళులు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ స్పేస్ ను ఆక్రమించుకునేందుకు ఇప్పటికే ఎన్నికల కదన రంగంలోకి దిగిన కమల్ హాసన్ తొలిదశలోనే చేతులెత్తేశారు. ఇక అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలే ఇప్పటికీ నువ్వా? నేనా? అన్నట్లు పోరాడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ వస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది.

అదిగో…ఇదిగో నంటూ….

అయితే ఎప్పటికప్పుడు ముహూర్తం అదిగో ఇదిగో అని ఊరించడం తప్ప ఇప్పటి వరకూ రజనీకాంత్ తన పార్టీని ప్రకటించలేదు. అయితే అలాగని తాను పార్టీ పెట్టనని కూడా చెప్పడం లేదు. గత కొంతకాలంగా రజనీ పార్టీ వస్తుందనే అంటున్నారు. ఆయన సోదరుడు సత్యనారాయణ సయితం పలుమార్లు మీడియాకు లీకులు కూడా ఇచ్చారు. డిసెంబరులో పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పినా అది రజనీ నోట నుంచి వెలువడలేదు.

ఎన్నికలు సమయం దగ్గరపడుతున్నా….

రాజకీయ పార్టీ అంటే ఆషామాషీ కాదు. బలమైన క్యాడర్ ఉండాలి. అందుకు ముందు నుంచి కసరత్తు చేయాలి. కానీ రజనీకాంత్ ఆ దిశగా ఆలోచన చేయడం లేదంటున్నారు. తమిళనాడు ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. 2021 లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రజనీకాంత్ ఇప్పటి వరకూ పార్టీ ప్రకటించకపోవడంపై ఆయనపై వత్తిడి ఉందన్న ప్రచారమూ ఉంది.

వత్తిడి వల్లనేనా?

రజనీకాంత్ స్థానికేతరుడని ఇప్పటికే తమిళనాడులో కొన్ని పార్టీలు ధ్వజమెత్తుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడితే తమ ఓటు బ్యాంకు గండి పడుతుందని, విజయావకాశాలు దెబ్బతింటాయనే పార్టీల్లో డీఎంకే ముందుంది. ఇక బీజేపీ కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుంది కాని, కొత్త పార్టీ పెట్టాలని మాత్రం కోరుకోవడం లేదు. దీంతో రాజకీయంగా రజనీకాంత్ పై వత్తిళ్లు ప్రారంభమయ్యాయని, అందుకే రజనీకాంత్ రాజకీయ ప్రకటన ఆలస్యమవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంతకీ రజనీకాంత్ పై పార్టీ పెట్టవద్దంటూ వత్తిడి తెచ్చేదెవరనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News