పక్కా ప్లాన్ తోనే వస్తున్నాడటగా?

వస్తాడా లేదా అని రాజకీయ పండింతులు ఎప్పటికప్పుడు చేసిన విశ్లేషణలకు తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ చెక్ పెట్టేశారు. రాజకీయ అరంగేట్రానికి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ [more]

Update: 2020-12-10 18:29 GMT

వస్తాడా లేదా అని రాజకీయ పండింతులు ఎప్పటికప్పుడు చేసిన విశ్లేషణలకు తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ చెక్ పెట్టేశారు. రాజకీయ అరంగేట్రానికి మొత్తానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తమిళ రాజకీయాలను మార్చేందుకే తాను బయలుదేరినట్లు ప్రకటించేశాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. జయలలిత మరణం తరువాత తమిళనాట రాజకీయ శూన్యత తన తోనే భర్తీ అవుతుందని రజని కాంత్ లెక్కలు వేసుకుని పక్కా ప్లాన్ తోనే ఎంట్రీ ఇస్తున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం అవుతున్నాయి. చాలా కాలంగా ఆయన పొలిటికల్ అరంగేట్రానికి తలైవా అభిమానులు ఎదురుచూస్తునేవున్నారు. ఆయనపై అభిమానులే కాదు కేంద్రంలోని బిజెపి వత్తిడి కూడా గట్టిగానే ఉంది.

ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత ల తరహాలో ?

తమిళనాడు రాజకీయాలకు సినిమా రంగానికి విడతీయరని బంధం దశాబ్దాలుగా ఉంది. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అందుకే రజని కాంత్ మిత్రుడు కమల్ హాసన్ రాజకీయ అరంగేట్రం జయ మరణం తరువాత ఆలస్యం చేయకుండా చేసేసారు. పార్టీ నిర్మాణం అంటే అంత ఈజీ కాదు కొంత రాజకీయ శూన్యత ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న అన్నా డిఎంకె, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే లు క్షేత్ర స్థాయిలో పటిష్టంగా ఉన్నాయి. ఇక చిన్నమ్మ శశికళ జైలు జీవితం ముగించుకుని దినకరన్ సహకారంతో జయ సెంటిమెంట్ ను తనకు అనుకూలంగా మార్చుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సీన్ లోకి రానున్నారు. ఇన్ని ప్రతికూల అంశాల నడుమ కేవలం అభిమానుల అండతో రజని కాంత్ రాజకీయ అడుగులు విజయం వైపు ఎంతవరకు ప్రయాణిస్తాయన్నది ఆసక్తికరం.

ప్రజా రాజ్యం, అనుభవాలు …

తమిళ రాజకీయాలకు కొద్దిగా దగ్గరగానే తెలుగు రాజకీయాలు నడిచాయి. తెలుగు సినీ ధ్రువతారగా నిలిచిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి చరిత్ర సృష్ట్టించారు. అయితే ఆయన అల్లుడు పార్టీని కబ్జా చేయడంతో చివరిదశలో రోడ్డున పడ్డారు. కానీ అయన స్థాపించిన టిడిపి పార్టీ నాలుగు దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో తనదైన ప్రస్థానం సాగిస్తుంది. ఎన్టీఆర్ స్పూర్తితో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. బలమైన సామాజికవర్గం అండ కూడా చిరంజీవి కి ఉన్నప్పటికీ అదే బలహీనత గా మారి నాటి ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్ – తెలుగుదేశం చేతుల్లో నలిగి పోయారు. 18 సీట్లకే పరిమితం అవ్వడంతో పార్టీ భారాన్ని ఎక్కువకాలం మోయలేమని గ్రహించి కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభకు వెళ్ళి కేంద్రమంత్రి తో సరిపెట్టుకుని తిరిగి సినిమాల్లో బిజీ అయిపోయారు.

జనసేన అదో కొత్త ట్రెండ్ …

తన అన్న మెగాస్టార్ చిరంజీవికి చేదు అనుభవాలు ఎదురై పార్టీని క్లోజ్ చేయడం తమ్ముడు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు. తన పవర్ స్టార్ ఇమేజ్ తో లక్షలాదిమంది అభిమానుల దీవెనలతో జనసేన పార్టీని ఆయన 2014 లో ప్రకటించేశారు. నిజానికి ఆ సమయంలో రాష్ట్ర విభజనతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్ లో అన్ని పార్టీలపై ప్రజలు విసిగి వేసారి పోయారు. పవన్ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఉంటె ఆయన చిరంజీవిని మించి సీట్లు దక్కించుకునే అవకాశాలను చేజేతులా వృధా చేసుకున్నారు. ఆత్మహత్యాసదృశ్యంగా పార్టీ పెట్టి కూడా బిజెపి, టిడిపి లకు మద్దత్తు ప్రకటించి పోటీ చేయకుండా మిన్నకున్నారు. నాడు పవన్ వైసిపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగారు కానీ తన పై ప్రజల్లో విశ్వసనీయతను పోయేందుకు గట్టి పునాది వేసుకున్నారు. కట్ చేస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి -బిజెపి లకు దూరం జరిగిన పవన్ పోటీ లోకి దిగారు. వామపక్షాలు, బీఎస్పీ పార్టీలతో కలిసి మళ్ళీ వైసిపి కి పవర్ దక్కకుండా ఉండే ఎత్తుగడలు అనుసరించారు తప్ప తన పార్టీ భవిష్యత్తు కోసం క్షేత్ర స్థాయిలో నిర్మాణం పూర్తిగా చేపట్టలేదు. దాంతో కేవలం ఒక్కసీటు కె జనసేన పరిమితం కావడం కాదు పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు. ఇక్కడితో పవన్ ఆగలేదు. ఎన్నికలు పూర్తి అయ్యి ఆరునెలలు కాకుండా తన మిత్రులను ఉన్నఫళంగా వదిలేసి బిజెపి తో పొత్తు అని ప్రకటించి మరింత గందరగోళ రాజకీయాలకు తనకు తానె తెరతీశారు. అలా ఆ నిర్ణయం తీసుకోవడం సినీ జీవితం లోకి రీ ఎంట్రీ ఇవ్వడం చక చక జరిగిపోయాయి. తనకు వ్యాపారాలు లేనందున భుక్తికోసం సినిమాలు తప్పవని సేవ కోసం రాజకీయం చేస్తానంటూ భాష్యం చెబుతున్నారు పవన్. ఇప్పుడు ఆయన ప్రయాణం వచ్చే రోజుల్లో ఎలా ఉండబోతుందన్న చర్చ తెలుగు రాజకీయాల్లో నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంది.

రజనీ స్టెప్స్ చెబుతున్నది ఇదే …

రాజకీయాల్లోకి రావడానికి రజని కాంత్ సైతం అనేక గందరగోళ ఎపిసోడ్స్ కి తెరతీశారు. ప్రజారాజ్యం స్థాపనకు ముందు చిరంజీవి అభిమాన సంఘాలు చేసిన షో లే తమిళనాట రజనీ ఫ్యాన్స్ చేస్తూ వచ్చారు. తలైవా రావాలి రావాలి రాజకీయాల్లోకి అంటూ ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతూ వచ్చారు. వారి కోరికలపై భిన్నమైన వ్యాఖ్యలతో రజనీ అందరిని గందరగోళ పరిచేవారు. తనకు ఆసక్తి లేదని ఒకసారి. కింగ్ కన్నా కింగ్ మేకర్ గా ఉంటానంటూ పలు రకాల వ్యాఖ్యలు చేసేవారు. దాంతో అభిమానుల సంగతి పక్కన పెడితే తమిళుల హృదయాలను సూపర్ స్టార్ ఎంతవరకు గెలవగలడన్నది చూడాలి. ఎదో ఒకరోజు ఆయన పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న సంకేతాలు అనేక సినీమాల్లో రజని కాంత్ ఇచ్చేవారు. అయితే బాబా వంటి చిత్రాల్లో రాజకీయాలకన్నా ఆధ్యాత్మిక బాటే తన రూట్ అనే సందేశాలు రజనీ అంతరంగాన్ని ఆవిష్కరించడం క్లిష్టంగా మార్చేశాయి. మొత్తానికి అంతా ఎదురుచూసిన ఘట్టానికి తలైవా తెరతీశారు. ఇప్పుడు ఆయన ఈ కొత్త రాజకీయ సినిమా హిట్టవుతుందా లేదా అన్నది తమిళనాడు రాజకీయాలవరకే కాదు దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తించాయి.

Tags:    

Similar News