విసిగిపోయారు… తలైవాకు తలాక్ చెప్పేస్తున్నారు

తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రజనీకాంత్ మద్దతు కోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటు బీజేపీ అటు కమల్ హాసన్ తమకు మద్దతు తెలపాలని రజనీకాంత్ [more]

Update: 2021-01-27 18:29 GMT

తమిళనాడు రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. రజనీకాంత్ మద్దతు కోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటు బీజేపీ అటు కమల్ హాసన్ తమకు మద్దతు తెలపాలని రజనీకాంత్ ను కోరుతున్నాయి. అయితే ఆయన మాత్రం ప్రస్తుతం ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని మరోసారి స్పష‌్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను నమ్ముకున్న నేతలు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకునే పనిలో పడ్డారు.

రానని చెప్పడంతో…..

రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదన్నది స్పష్టమైంది. అయితే గత మూడు సంవత్సరాలుగా ఆశలు పెట్టుకున్న ఆయన అభిమానులు ఇప్పుడు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. రజనీకాంత్ 2017లో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అంతటితో ఊరుకోలేదు. పార్టీ ప్రకటనకు ముందు సభ్యత్వాల సేకరణకు, క్షేత్రస్థాయిలో క్యాడర్ ను పెంపొందించుకునేందుకు ఆయన రజనీ మక్కల్ మండ్రం ను స్థాపించారు.

అన్ని జిల్లాలకు…..

తమిళనాడులోని అన్ని జిల్లాలకు రజనీకాంత్ రజనీ మక్కల్ మండ్రంకు కార్యదర్శులను నియమించారు. వారంతా మూడు సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నారు. తాము ఏదో ఒకస్థానం నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. సభ్యత్వాలను కూడా కోట్లలో చేర్పించారు. కానీ ఇప్పుడు రజనీకాంత్ ప్రకటనతో వారంతా నిరాశకు లోనయ్యారు. తమ భవిష‌్యత్ ఏంటన్న బెంగ పట్టుకుంది. ఇప్పటి వరకూ తాము పడ్డ కష్టానికి ఫలితం లేదని వాపోతున్నారు.

మూడేళ్ల కష్టం….

ఈ నేపథ్యంలో రజనీ మక్కల్ మండ్రంకు చెందిన పలువురు జిల్లా కార్యదర్శులు డీఎంకేలో చేరడం విశేషం. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఇక రారని నిర్ణయించుకున్న తర్వాతనే వారు డీఎంకేలో చేరారు. వారి దారిలో మరికొంత మంది నేతలు కూడా ఉన్నారు. రజనీకాంత్ మాత్రం ఇవేమీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. తాము వారికి చెప్పే వచ్చామని రజనీ మక్కల్ మండ్ర నేతలు చెబుతున్నారు. మొత్తం మీద తలైవా తేల్చి చెప్పడంతోనే ఆయన అభిమానులు రాజకీయంగా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

Tags:    

Similar News