రాజుగారి గది 3 మూవీ రివ్యూ

నటీనటులు: అశ్విన్, అవికా గోర్, అలీ, ఊర్వశి,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభ్స్ శీను, జబర్దస్త్ శీను తదితరులు. మ్యూజిక్ డైరెక్టర్: సాబీర్ సినిమాటోగ్రఫీ: చోట కె [more]

Update: 2019-10-18 09:05 GMT

నటీనటులు: అశ్విన్, అవికా గోర్, అలీ, ఊర్వశి,అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభ్స్ శీను, జబర్దస్త్ శీను తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్: సాబీర్
సినిమాటోగ్రఫీ: చోట కె నాయుడు
ఎడిటర్: గౌతమ్ రాజు
ప్రొడ్యూసర్: కళ్యాణ్ చక్రవర్తి
డైరెక్టర్: ఓం కార్

టివి ఛానల్స్ లో స్పెషల్ షోస్ తో తెగ ఫేమస్ అయిన ఓం కార్ దర్శకుడిగా రాజుగారి గది సీరీస్ తో వరస హిట్స్ కొడుతున్నాడు. రాజుగారి గది ని తన తమ్ముడు అశ్విన్ హీరోగా తెరకెక్కించి కామెడీ హిట్ కొట్టిన ఓం కార్.. ఆ సినిమాలో మనిషి అవయవాలతో వ్యాపారం చేసే డాక్టర్స్ ని గుట్టు బయటపెట్టడానికి గాను హాస్యాన్ని వాడుకున్నాడు దర్శకుడు ఓం కార్. ఇక రాజుగారి గది 2 టైం కి స్టార్స్ ని నమ్ముకున్నాడు. నాగార్జున, సమంత లను కీలక పాత్రలుగా చేసి ఎమోషనల్ హర్రర్ మూవీగా తెరకెక్కించి అదరగొట్టాడు. ఇక తాజాగా రాజుగారి గది సీక్వెల్ గా రాజుగారి గది 3 ని కూడా డైరెక్ట్ చేసాడు. ఈసారి కోలీవుడ్‌లో సక్సెస్‌ అయిన దిల్లుకు దుడ్డు 2 సినిమా లైన్‌ను తీసుకొని తనదైన స్టైల్‌లో ట్రీట్‌మెంట్‌ రాసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. మళ్లీ తన తమ్ముడు అశ్విన్ నే హీరోగా అవికా గోర్ ని హీరోయిన్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు ఓం కార్. మరి హర్రర్ కామెడీగా ఈ సినిమా ఉండబోతుందా? లేదంటే… ఎమోషనల్ హర్రర్ గా ఈ సినిమా ఉండబోతుందా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

వందలఏళ్ల క్రితం ప్రయోగించిన ఓ మంత్ర శక్తి అనుకోకుండా మాయ (అవికా గోర్‌) అనే అమ్మాయికి రక్షణగా ఉంటుంది. ఆ అమ్మాయి వెంట ఎవరు పడినా.. ప్రేమిస్తున్నానని చెప్పినా వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే ఇవన్ని మలయాళ మాంత్రికుడైన తన తండ్రి గరుడ పిళ్లై (అజయ్‌ ఘోష్‌) చేయిస్తున్నాడని భావిస్తుంది మాయ. అదే సమయంలో ఓ ప్రమాదం నుంచి తనను కాపాడిన అశ్విన్‌ (అశ్విన్‌ బాబు) అనే అబ్బాయిని ఇష్టపడుతుంది మాయ. అశ్విన్‌ కూడా మాయను ఇష్టపడతాడు. కానీ తన పరిస్థితి గురించి తెలిసిన మాయ తరువాత మాట్లాడదాం అని చెప్పి కేరళ వెళ్లిపోతుంది. మాయ కోసం కేరళ వెళ్లిన అశ్విన్‌కు మాయకు రక్షణగా ఉన్న శక్తి గరుడ పిళ్లై ప్రయోగించినది కాదని తెలుస్తుంది. మరి ఆ శక్తి ఏంటి..? ఎవరు ప్రయోగించారు..? ఆ శక్తిని అంతం చేసి.. అశ్విన్‌, మాయలు ఎలా ఒక్కటయ్యారు? అన్నదే మిగతా కథ.

నటీనటుల నటన:

రాజుగారు గది 1, 2 లలో అశ్విన్ మెయిన్ లీడ్ అయినా.. ఆ సినిమాల్లో ఒకటి కామెడీ, మరొకటి నాగ్, సమంతల కారణం గా హిట్ అయ్యాయి. ఇక ఆ సినిమాలో అశ్విన్ సైడ్ కేరెక్టర్స్ మాత్రమే చేసాడు. అశ్విన్ కి ఇది హీరోగా మొదటి సినిమా అనే చెప్పాలి. అశ్విన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కామెడీతో పాటు లవ్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ గా మాత్రం అశ్విన్ ఇంకా పరిణతి చూపించాల్సి ఉంది. ఒకప్పటి చిన్నారి పెళ్లికూతురుగా పరిచయమైన అవికా ఈ సినిమాతో గ్లామర్ గా రీ ఎంట్రీ ఇచ్చింది.అవికా తనకు అలవాటైన పాత్రలో ఒదిగిపోయింది. ఫస్ట్ హాఫ్‌ అంతా హుందాగా కనిపించిన ఈ భామ… క్లైమాక్స్‌లో తన లుక్‌, పెర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చింది. అలీ చాలా రోజుల తరువాత ఈ సినిమాలో ఫుల్‌ లెంగ్త్‌ రోల్ చేశాడు. తనదైన మేనరిజమ్స్‌, డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నాడు. అజయ్‌ ఘోష్‌, ఊర్వశీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. బ్రహ్మాజీ, శివశంకర్‌ మాస్టర్‌, హరితేజ, ప్రభాస్‌ శ్రీను తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

రాజుగారి గది సినిమాని కామెడీతో నడిపించేసిన దర్శకుడు… రాజుగారి గది 2 కొచ్చేసరికి ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇక హారర్‌ కామెడీలకు కథే కీలకం. మొదటి పార్ట్శ్ కి కథే కీలకం అయితే ఓంకార్ రాజుగారి గది 3 ని మాత్రం అసలు కథే లేకుండా తెరకెక్కించాడేమో అనిపిస్తుంది. ఈ సినిమా కోసంఎక్కువగా హార్రర్ కామెడీనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాకు కేరళను బ్యాక్ గ్రౌండ్‌గా ఎంచుకోవడం.. అక్కడ మంత్ర తంత్రాలు క్షుద్రశక్తులను ఈ సినిమా కోసం ఎంచుకున్నాడు. ఒక రాజు గారు తన కూతురు‌ను వేధిస్తున్న ఒక బ్రిటిష్ అధికారిని మట్టుపెట్టుడానికి ఒక యక్షణి దెయ్యాన్ని ప్రయోగిస్తాడు. ఆ తర్వాత దాన్ని ఒక మహల్‌ (రాజు గారి గది)లో బంధిస్తాడు ఆ రాజు. ఆ దెయ్యానికి ప్రస్తుత కాలానికి లింకు పెట్టి ఈ కథను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు ఓంకార్. దెయ్యాలతో కామెడీ చేయించడం కొంచెం అతిగా ఉంది. కానీ కథలో భాగంగా వచ్చే కామెడీలో అది కలిసిపోయింది. ఫస్ట్ హాఫ్‌ అంతా కాలనీ జనాలను అశ్విన్‌, అతని మామ (అలీ) కలిసి ఇబ్బంది పెట్టడం, హీరో హీరోయిన్ల మధ్య లవ్‌ స్టోరికి పరిమితం చేసిన దర్శకుడు అసలు కథను మొదలు పెట్టలేదు. ఇంటర్వెల్‌ బ్లాక్‌ సమయానికి కథ కాస్త గాడిలో పడ్డట్టుగా అనిపించినా తరువాత కూడా సెకండ్ హాఫ్ లో ఆసక్తికర సన్నివేశాలు లేకపోవటంతో కథనం సాధాసీదాగా అనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కామెడీ సీన్స్‌ కొద్ది సేపు బాగానే అనిపించినా తరువాత మరీ సాగదీసిన ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక క్లైమాక్స్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది అన్నట్టుగా ఉంది. రాజుగారి గది, గది 2 సినిమాల్లో ఉన్న ఫీల్ ఏదో రాజు గారి గది 3 లో మిస్ అయ్యిందనే చెప్పాలి.

సాంకేతికంగా…

రాజుగారి గది సినిమాకి మెయిన్ మైనస్ మ్యూజిక్. ఈ సినిమాలో ఒక్క పాట కూడా గుర్తుండి పోయేలా లేదు. ఇక నేపథ్యం సంగీతం కూడా ఓకె ఆనే స్థాయిలోనే ఉంది. సినిమాటోగ్రాఫర్ చోటాకే నాయుడు సినిమాని నిలబెట్టడానికి నానా ప్రయత్నాలు చేసాడు. ఇక ఎడిటింగ్ గురించి కూడా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. చాలా సన్నివేశాలకు కత్తెర వెయ్యాల్సింది. అన్నిటిని అలా ప్రేక్షకుల మీదకి వదిలేసాడనిపిస్తుంది ఎడిటర్. నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్: కామెడీ, నిర్మాణ విలువలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్: రొటిన్ స్టోరీ, మ్యూజిక్, లవ్ ట్రాక్

రేటింగ్:2.25/5

Tags:    

Similar News