రణరంగం మూవీ రివ్యూ

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌; సంగీతం: ప్రశాంత్‌ పిళ్లై నటీనటులు: శర్వానంద్‌, కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సుబ్బరాజు తదితరులు సినిమాటోగ్రఫీ: దివాకర్ మని ఎడిటింగ్: [more]

Update: 2019-08-15 12:05 GMT

బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌; సంగీతం: ప్రశాంత్‌ పిళ్లై
నటీనటులు: శర్వానంద్‌, కల్యాణి ప్రియదర్శన్‌, కాజల్‌, మురళీ శర్మ, బ్రహ్మాజీ, సుబ్బరాజు తదితరులు
సినిమాటోగ్రఫీ: దివాకర్ మని
ఎడిటింగ్: నవీన్ నూలి
మ్యూజిక్ డైరెక్టర్: ప్రశాంత్ పిళ్ళై
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
దర్శకుడు: సుధీర్‌వర్మ

మహానుభావుడుతో హిట్ కొట్టిన శర్వానంద్ పడి పడి లేచే మనసుతో యావరేజ్ హిట్ కొట్టాడు. ప్రేమ కథ చిత్రాలతో హిట్ కొడుతున్న శర్వానంద్ కి మాస్ చిత్రాల విషయంలో ఎప్పుడూ అగ్ని పరీక్షే ఎదురవుతుంది. మాస్ అంటూ తీసిన చిత్రాలన్నీ ప్లాప్ అవడంతో.. మధ్య మధ్యలో కాస్త రూటు మార్చి ప్రేమ కథ చిత్రాలకు చేరువవుతున్న శర్వానంద్ మధ్య మధ్యలో మాస్ సినిమాలు చేస్తూ అదృష్టాన్ని పరిక్షించుకుంటున్నాడు. పడి పడి లేచే మనసు తర్వాత సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ రణరంగం సినిమా చేసాడు. యంగ్ హీరోలలో కాస్త మర్కెట్ ఉన్న హీరో శర్వానంద్. నాని తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న హీరో శర్వాని. మరి సుధీర్ వర్మ కాస్త డౌన్ ఫాల్ లో ఉన్నప్పటికీ.. శర్వా క్రేజ్ తో రణరంగం సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదట్లో అంచనాలు లేని రణరంగం పోస్టర్, టీజర్, ట్రైలర్ విడుదలయ్యాక మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది. గ్లామర్ గర్ల్ కాజల్ ఈ సినిమాలో నటించడం, డిఫ్రెంట్ లుక్ లో శర్వానంద్ డాన్ గా నటించడం, మరో క్యూట్ అండ్ ట్రెడిషనల్ గర్ల్ కళ్యాణి కూడా వన్ అఫ్ ద హీరోయిన్ గా నటించడం సినిమా మీద క్రేజ్ ని పెంచాయి. మరి శర్వానంద్ గ్యాంగ్ స్టార్ గా నటించిన రణరంగం సినిమా హిట్ అయ్యిందా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

విశాఖపట్నానికి చెందిన దేవ (శర్వానంద్) తన ముగ్గురు స్నేహితులతో (రాజా చెంబోలు, ఆదర్శ్ బాలకృష్ణ, సుదర్శన్) కలిసి బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుంటారు. 1995లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్న రోజులవి. బ్లాక్‌లో లిక్కర్‌కు బోలెడంత గిరాకీ. బ్లాక్ టికెట్స్ అమ్మేకన్నా.. బ్లాక్ లో మందు అమ్మితే బాగా సంపాదించొచ్చని… దేవ తన మిత్రులతో లిక్కర్ వ్యాపారం మొదలుపెడతాడు. చూస్తుండగానే ఎదిగిపోతాడు. క్ర‌మంగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టి – విశాఖ‌ప‌ట్నంలో తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతాడు. ఇదే క్రమంలో లోకల్ ఎమ్మెల్యే సింహాచలం (మురళీశర్మ)కు శత్రువుగా మారతాడు. తనకు ఆదాయం పెరగడంతోపాటు శత్రువులు కూడా పెరుగుతుంటారు. వారి వల్ల దేవ స్నేహితులకు అపాయం ఏర్పడుతుంది. తనవారిని కాపాడుకోవడానికి శత్రువుల కంటే బలవంతుడిగా, ధనవంతుడిగా మారే ప్రయత్నం చేస్తాడు దేవ.అదే టైం లో గీత (కళ్యాణి ప్రియదర్శన్)ను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు దేవ. పాప పుట్టిన తరవాత ఈ గొడవలన్నింటినీ వదిలేసి అందరికీ దూరంగా స్పెయిన్ వెళ్ళిపోతాడు. దేవ స్పెయిన్ వెళ్లడానికి కారణం ఏంటి? గీతను పెళ్లిచేసుకున్న తరవాత ఏం జరిగింది? దేవాకు అసలు శత్రువు ఎవరు? ఆ ప్రయాణంలో దేవా ఎదుర్కొన్న ఆటుపోట్లు, వెన్నుపోట్లు ఏంటి? అనేది తెలియాలంటే రణరన్గమ్ చూడాల్సిందే.

నటీనటుల నటన:

శ‌ర్వా పాత్రలో రెండు షేడ్స్ ఉన్నాయి. త‌న‌లోని న‌టుడికి ప‌ని ప‌డింది. ఆ ప‌రీక్షలో శ‌ర్వా కూడా పాస‌య్యాడు. లగ్జరీ కారులో నుంచి స్టైల్‌గా నిలబడి ముఖంపై ఒకవైపు లైటింగ్, మరోవైపు చీకటిలో శర్వా లుక్ అదిరిపోయింది. బ్లాక్ టికెట్లు అమ్ముకునే ఓ అవారా.. ప్రేమికుడిగా శ‌ర్వా న‌ట‌న న‌చ్చుతుంది. 25 ఏళ్ల హుషారైన కుర్రాడిగా ఆయన నటించిన లవ్‌ ట్రాక్‌ బాగా నచ్చుతుంది. 45 ఏళ్ల వయసు వ్యక్తి పాత్రలోనూ చక్కగా ఒదిగిపోయాడు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో శర్వా నటన అద్భుతం. స్పెయిన్‌లో గ్యాంగ్ స్టర్‌గా శర్వా నటన హుందాగా అనిపించింది. ఇక గీత పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ చక్కగా సరిపోయింది. తన చిలిపి మాటలు భలే ఉన్నాయి. కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కాజల్ తెరకెక్కించిన ఒకే ఒక్క పాటను కూడా వృథా చేశారు. ఇక ఎమ్మెల్యే పాత్రలో నటించిన మురళీ శర్మ తన నటనలోని రెండో కోణాన్ని చూపించాడు. అద్భుతంగా నటించాడు. రాజా చెంబోలు, ఆదర్శ్ బాలకృష్ణ, సుదర్శన్, మహేష్, బ్రహ్మాజి, అజయ్, నర్రా శ్రీను తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేషణ:

రణరంగం సినిమాకి గాడ్ ఫాద‌ర్ స్ఫూర్తి అని ముందే అర్థమైపోతుంది. చాల సినిమాల్లో చూసినట్టే.. ఓ అనాథ మాఫియా డాన్‌గా ఎదగడమే ఈ సినిమా కథ సారాంశం. స్పెయిన్ లో ఇప్ప‌టి శ‌ర్వాని చూపిస్తూ… క‌థ మొద‌లెట్టారు. టేకాఫే స్లో పేజ్‌తో మొద‌లైంది. ఫ్లాష్‌బ్యాక్‌ను, ప్రస్తుత కథను ముక్కలు ముక్కలుగా చేసి చూపించడం ప్రేక్షకులను కాస్త గందరగోళంలోకి పడేస్తుంది. అటు ఫ్లాష్‌బ్యాక్‌ను, ఇటు జరుగుతున్న కథను సంపూర్ణంగా ప్రేక్షకుడు ఆస్వాదించలేకపోతాడు. అంటే జరిగిపోయిన కాలానికి. పాస్ట్, ప్రెజెంట్‌ను ట్విస్ట్ చేస్తూ కథను నడిపించారు. ఫస్టాఫ్ ఆసక్తికరంగానే సాగింది. కాకపోతే అక్కడక్కడా కథనం కాస్త నెమ్మదించింది. ఇంటర్వెల్ బ్యాంగ్. దేవాపై ఎటాక్ జరుగుతుంది. అయితే, సెకండాఫ్ ప్రారంభమైన తరవాత ప్రేక్షకుడు నీరసించిపోతాడు. ఎందుకంటే సెకండాఫ్‌లో కథనం మరింత నెమ్మదిగా సాగింది. ఒకరినొకరు చంపుకోవడాలు, ఎస్కేపులు తప్ప సెకండాఫ్‌లో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు. ఈ కథను ఇలానే ముగిస్తారేమో అనుకుంటున్న దశలో ఓ ఊహించని ట్విస్ట్‌ వచ్చి పడుతుంది. కానీ దాని వల్ల ఈ కథకు వచ్చే అదనపు ప్రయోజం ఏమీ కనిపించదు. అయితే ఫస్ట్ హాఫ్ లో సుద‌ర్శ‌న్ కామెడీ కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ల‌వ్ స్టోరీ కాస్త స్లో ఫేజ్‌లో సాగినా… బాగున్నాయి అనిపించే సీన్స్ అవే. ల‌వ్ స్టోరీతో పాటు, సుద‌ర్శ‌న్ పాత్ర ఎప్పుడైతే ఎండ్ అయ్యిందో, అప్పటి నుంచీ.. సినిమాలో కామెడీ అంటూ లేకుండా పోయింది. ఇక సినిమాలో పెద్ద హీరోయిన్ కాజల్ ని ఎందుకు తీసుకున్నారో ఎవరికీ అర్ధం కాదు. దర్శకుడు సుధీర్ వర్మ మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు. అసలు ఈ సినిమా తో సుధీర్ వర్మ ఏం చెప్పాలనుకున్నాడో అతనికే క్లారిటీ లేదనిపిస్తుంది.

సాంకేతికంగా…

ప్రశాంత్ పిళ్ళై పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు సాగింది.దివాకర్ మణి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు మరో హైలైట్. స్పెయిన్ అందాలను ఎంత బాగా చూపించారో.. 1980ల కాలాన్ని గుర్తుకుతెచ్చేలా విశాఖపట్నాన్ని కూడా అంతే బాగా చిత్రీకరించారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాటోగ్రాఫర్ స్టామినాను చెబుతాయి. ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే…. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ప్లస్ పాయింట్స్: శర్వానంద్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఫస్ట్ హాఫ్, సినిమాటోగ్రఫీ
నెగెటివ్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, కామెడీ, ఎమోషనల్ కంటెంట్

రేటింగ్: 2 .25/5

Tags:    

Similar News