ముందు చూపుతోనే షా…?
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయ అరంగ్రేటం చేయనున్నారా….? త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారా…? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా….? ఈ [more]
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయ అరంగ్రేటం చేయనున్నారా….? త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారా…? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా….? ఈ [more]
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయ అరంగ్రేటం చేయనున్నారా….? త్వరలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారా…? బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారా….? ఈ మేరకు కాషాయ పార్టీ కసరత్తు చేస్తుందా…..? అన్న ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో
మమతా బెనర్జీని ఢీ కొనేందుకు దాదా గా పేరుగాంచిన గంగూలీని తెరపైకి తీసుకువస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వాదనను అటు గంగూలీ, ఇటు బీజేపీ వర్గాలు ఖండించడం లేదు. అలాగని తోసిపుచ్చడం లేదు. దీంతో దాదా రాజకీయ అరంగ్రేటం ఖాయమన్న వాదనకు బలం చేకూరుస్తోంది.
బీసీసీఐ పదవి చేపట్టడం….
అత్యంత కీలకమైన బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీ చేపట్టడమే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అధికార పార్టీ పెద్దల ఆశీస్సులు లేకుంటే బీసీసీఐ చీఫ్ పదవిని చేపట్టడం అసాధ్యం. గతంలో మాధవరావు సింధియా వంటి కాంగ్రెస్ సీనియర్ నేత శరద్ పవార్ వంటి రాజకీయ దిగ్గజం ఈ పదవులు చేపట్టారు. కమలం పార్టీ ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టక ఆ పార్టీకి చెందిన అనురాగ్ ఠాకూర్ బీసీసీఐ చక్రం తిప్పారు. తాజాగా ఆయన ఆర్థిక శాఖ సహాయమంత్రిగా కొనసాగుతున్నారు. అధికార పార్టీలో ఠాకూర్ కీలక నేతగా కొనసాగుతున్నారు.
షా రంగంలోకి దిగి….
వాస్తవానికి అనురాగ్ ఠాకూర్ మళ్లీ ఈ పదవి చేపట్టాల్సి ఉంది. అయితే ప్రధాని మోడీ ఆత్మ గా పేరుగాంచిన పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కపిల్ దేవ్ తరువాత భారత్ క్రికెట్ లో గంగూలీ కే కెప్టెన్ గా మంచి పేరుంది . బెంగాల్లో ఆయనకు మంచి పేరు ప్రతిష్టలున్నాయి. ఇప్పటికీ చురుగ్గా, క్రియాశీలకంగా వ్యవహరించే గంగూలీని పార్టీలోకి చేర్చుకుంటే మేలు జరుగుతుందన్న ఉద్దేశ్యంతో అమిత్ షా రంగంలోకి దిగి చక్రం తిప్పారు. వాస్తవానికి ఒక క్రికెటర్ బీసీసీఐ చీఫ్ పదవి చేపట్టడం అరదు. 1954లో మాజీ క్రికెటర్ అయిన విజయనగరం మహారాజు విజయానంద గజపతి రాజు బీసీసీఐ చీఫ్ గా పగ్గాలు చేపట్టారు. ఆ తరువాత ఆ పదవిని చేపట్టిన ఘనత గంగూలీయే కావడం విశేషం.
ఆ పేరంటేనే క్రేజ్……
1972 జులై 8న కోల్ కతాలోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించిన గంగూలీ అంటే బెంగాలీలకు ఓ క్రేజ్. సారధిగా ఇప్పటికీ మంచి గుర్తింపు గౌరవం ఉంది. గంగూలీకి ఒక్క బెంగాల్ లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. వీటన్నింటిని దృష్టిలో
పెట్టుకునే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆయనకు గాలం వేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు పక్కకు తప్పుకుని గంగూలీకి మార్గం సుగమం చేశారు. అమిత్ షా కుమారుడు జయ్ షా కీలకమైన కార్యదర్శి పదవికి ఎన్నికయ్యారు. అరుణ్ ధమాల్ కొత్త కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. బీసీసీఐ మాజీ చీఫ్ ప్రస్తుత కేంద్ర ఆర్గిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడే అరుణ్ ధమాల్ కావడం విశేషం.
మమత కోసమేనా?
ఇక రాజకీయం విషయానికి వస్తే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాషాయ పార్టీకి కంట్లో నలుసుగా మారారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల వరకు ఆమె ప్రధాని మోడీపై నేరుగా విమర్శలు సంధించారు. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఆమె పేరు ప్రచారంలోకి వచ్చింది. కాంగ్రెస్ తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమెకు కలకత్తా కాళి అని బెంగాల్ బెబ్బులి అని పేరుంది. సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించిన సీపీఎంను దెబ్బతీయడంతో మమత పేరు జాతీయ స్థాయిలో మార్మోగి పోయింది. బెంగాల్ రాజకీయాల్లో పాతుకుపోయింది. ఈ సారి ఆమెను ఎలాగైనా రైటర్స్ బిల్డింగ్ లోకి ప్రవేశించనీయ కుండా అడ్డుకోవాలన్నది కమలనాధుల కోరిక. రైటర్స్ బిల్డింగ్ కు రాష్ట్ర సచివాలయంగా పేరుంది. ఇటీవల లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాషాయపార్టీకి మంచి ఊపునిచ్చింది. మొత్తం 42 స్థానాలకు గాను 18 స్థానాలు గెలుచుకుని మమతకు సవాల్ విసిరింది. మరో మూడు స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో గంగూలీ వంటి నాయకుడిని ముందుకు తెస్తే మమతకు దెబ్బతీయవచ్చన్నది కమలం పార్టీ అంచనా. బీసీసీఐ చీఫ్ గా గంగూలీ పదవీ కాలం ఏడాది మాత్రమే. అనంతరం ఆయన రాజకీయ అరంగ్రేటం చేసే అవకాశం ఉంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సైతం గంగూలీ రాకను స్వాగతించడం భవిష్యత్ పరిణామాలకు సూచికగా పేర్కొనవచ్చు.
–ఎడిటోరియల్ డెస్క్