టీడీపీలో వారికి మాత్రమే గ్రీన్ సిగ్నల్‌.. రీజన్ ఇదే?

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ న‌ష్టపోతోంది. పుంజుకునే ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఇదీ కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట‌. సోష‌ల్ మీడియాలోనూ ఇదే త‌ర‌హా వాద‌న‌లు క‌నిపిస్తున్నాయి. [more]

Update: 2021-05-30 13:30 GMT

ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ న‌ష్టపోతోంది. పుంజుకునే ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఇదీ కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట‌. సోష‌ల్ మీడియాలోనూ ఇదే త‌ర‌హా వాద‌న‌లు క‌నిపిస్తున్నాయి. అయితే.. దీనికి రీజ‌నేంటి? ఎందుకు ఇలా జ‌రుగుతోంది ? అంటే.. పార్టీలో కొంద‌రికి మాత్రమే వాక్ స్వాతంత్య్రం ఇచ్చార‌ని.. మిగిలిన వారి వాయిస్‌కు బ్రేకు వేశార‌ని తాజాగా ప్రచారం తెర‌మీదికి వ‌చ్చింది. నిజానికి గ‌డిచిన వారం రోజులుగా ఏపీ ప్రభుత్వంపై ప్రజ‌ల్లో ఒకింత ఆవేద‌న‌, ఆందోళ‌న నెల‌కొంది. క‌రోనా సేవ‌ల విష‌యంలోను, ఆక్సిజ‌న్ లేక మ‌ర‌ణిస్తున్నవారి విష‌యంలోనూ.. ప్రభుత్వం ఏమీ చేయ‌లేక పోతోంద‌నే బాధ ప్రజ‌ల్లో ఉంది.

కొందరికే అవకాశం…?

దీంతో క‌రోనా వ‌స్తే.. మ‌ర‌ణ‌మే శ‌ర‌ణ్యమా ? అని ప్రతి ఒక్కరూ చ‌ర్చించుకుంటున్నారు. ఈ స‌మ‌యంలో ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి దాడి చేయాల‌ని.. టీడీపీ సీనియ‌ర్లు చెబుతున్నారు. కానీ, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఈ ఛాన్స్ కొంద‌రికే ఇచ్చార‌ని .. త‌మ‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వలేద‌ని.. యువ నాయ‌కులు, మ‌హిళా నేత‌లు సైతం పేర్కొంటున్నారు. దీనికి రీజ‌న్ తెలియ‌డం లేద‌ని కూడా వారు పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామం ప్రస్తుతం తీవ్రస్తాయికి చేరుతోంది. “మేం కూడా పార్టీలో రెండు ద‌శాబ్దాలుగా ఉన్నాం. అనేక విష‌యాల్లో మాట్లాడాం. కానీ, ఇప్పుడు మాత్రం మేం మాట్లాడ‌తామంటే.. ఆగండి అని చెబుతున్నారు. ఇలా ఎందుకు చెబుతున్నారో .. అర్ధం కావ‌డం లేదు“ అని విజ‌య‌వాడ‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలు.. వాపోయారు.

డామినేట్ చేయని వారినే?

ఇక‌, టీడీపీ ఎమ్మెల్సీలు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అయితే.. వృద్ధ నేత‌లు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని వారు మాత్రం మీడియా ముందుకు వ‌స్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కారుపై విమ‌ర్శలు సంధిస్తున్నారు. దీనికి రీజ‌నేంటి ? అనేది కూడా ఆస‌క్తిగా మారింది. ప్రస్తుతం లోకేష్ ను డామినేట్ చేయ‌ని వారిని మాత్రమే మాట్లాడేందుకు అనుమ‌తి ఇస్తున్నార‌నే ప్రచారం సాగుతోంది. ప్ర‌స్తుతం ఉన్న యువ‌త‌, మ‌హిళా నేత‌ల‌కు అవ‌కాశం ఇస్తే.. లోకేష్‌ను డామినేట్ చేస్తార‌ని.. చంద్రబాబు భావిస్తున్నట్టు ఒక వ‌ర్గం పేర్కొంటోంది.

లోకేష్ కోసమేనా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. లోకేష్ కీల‌క పాత్ర పోషించ‌డం ఖాయంగా క‌నిపిస్తున్న నేప‌థ్యంలో.. యువ‌త త‌న మాట వినాలంటే.. ఇప్పటి నుంచి వారికి అవ‌కాశం ఇవ్వరాద‌ని.. ఎన్నిక‌ల స‌మయంలో మాత్రమే ఇవ్వడం ద్వారా.. లోకేష్ కు వాల్యూ పెంచే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారట‌. దీంతో ఇప్పుడు టీడీపీ త‌ర‌ఫున ఆ న‌లుగురు మాత్రమే మాట్లాడుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే పార్టీ ఏ తీరాల‌కు పోతుందో ? చూడాలి.

Tags:    

Similar News