సిట్టూ కాదు… గుట్టూ లేదు… అంతా సెటిల్మెంట్లే ?
విశాఖ ఎందుకో అమాయకంగా కనిపిస్తోంది. ఇక్కడ సాగరం కూడా ప్రశాంతం. పరిసరాలు సైతం అద్భుతం. ఇక్కడ లోకల్ గా నోరున్న వారు ఎవరూ లేరు. విశాఖ సిటీ [more]
;
విశాఖ ఎందుకో అమాయకంగా కనిపిస్తోంది. ఇక్కడ సాగరం కూడా ప్రశాంతం. పరిసరాలు సైతం అద్భుతం. ఇక్కడ లోకల్ గా నోరున్న వారు ఎవరూ లేరు. విశాఖ సిటీ [more]
విశాఖ ఎందుకో అమాయకంగా కనిపిస్తోంది. ఇక్కడ సాగరం కూడా ప్రశాంతం. పరిసరాలు సైతం అద్భుతం. ఇక్కడ లోకల్ గా నోరున్న వారు ఎవరూ లేరు. విశాఖ సిటీ చూసుకుంటే నూటికి అరవై శాతం పైగా నాన్ లోకల్. ఎక్కడ నుంచో వచ్చి విశాఖలో స్థిరపడిన వారే. దాంతో బయటవారు వచ్చి ఇక్కడ ఎంపీలు అయినా ఎమ్మెల్యేలు అయినా కూడా ఎవరికీ ఫికర్ లేదు. మరో వైపు చూస్తే విశాఖ బెస్ట్ సిటీగా ఉంది. ఇక్కడ భూములు బంగారం. ఎటువంటి సీజన్ లో అయినా కూడా రేట్లు ఆకాశాన్నే అంటుతాయి. దాంతో పాలకులు పార్టీలు ఏవైనా ఎవరైనా కూడా భూదందా మాత్రం బ్రహ్మాండంగా ఇక్కడ ఆరు కాలాలూ సాగిపోతూనే ఉంటుంది.
కొండను తవ్వారా..?
విశాఖ భూములకు ఏనాడో రెక్కలు వచ్చాయి. ఉమ్మడి ఏపీలో మెల్లగా మొదలైన ఈ భూబాగోతం విభజన ఏపీలో తారస్థాయికి చేరుకుంది. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో కబ్జాదారుల కన్ను ఒక్కసారిగా ఇక్కడ పడిపోయింది. వేలాదిగా ఎకరాలను చాప చుట్టేశారు. రికార్డులు అన్నీ తారు మారు చేసేసి హుదూద్ తుఫాన్ లో వాటికి కాకెత్తుకుని పోయిందని కట్టు కధలు బాగా చెప్పారు. మొత్తానికి నాడు విపక్షాలు గోల చేసిన మీదట చంద్రబాబు సర్కార్ సిట్ ని ఏర్పాటు చేశారు. ఆ దర్యాప్తు ఏం చేశారో, నివేదిక ఏమైందో తెలియదు కానీ సిట్ పేరిట హడావుడి మాత్రం అలా చప్పున చల్లారిపోయింది.
అంతా డిటో…?
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక పాత సిట్ తో పనేంటి అంటూ తామూ కొత్తగా ఒక విచారణ కమిషన్ ని వేశారు. అది నివేదికను ఇచ్చిందో లేదో కూడా తెలియదు. కానీ విశాఖలో ఎన్ని భూములు ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి అన్నది మాత్రం పక్కాగా అధికార పార్టీ నేతలకు తెలిసిపోయింది అంటున్నారు. దాంతో దందాలు మరింతగా పెరిగాయని కూడా విమర్శలు ఉన్నాయి. భూముల పేరిట సెటిల్మెంట్స్ చేస్తూ కొత్త గ్యాంగులు కూడా పుట్టుకువచ్చాయి. మొత్తానికి చూస్తే గత ఏడేళ్ళుగా విశాఖలోని కీలకమైన స్థలాలలో భూములు ఎన్ని పేర్లు మారాయో ఎందరి చేతులు మారాయో ఆ సర్వేశ్వరుడికే ఎరుక అంటున్నారు.
ఖాళీగా ఉంటే అంతే ..?
విశాఖలో ఉద్యోగం చేసిన ఉన్నతాధికారులు తమకూ ఒక స్థలం ఉండాలని ముచ్చట పడి కొనుక్కుంటారు. అలాగే ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసిన వారు కూడా భూములు కొనుక్కుని సంపదను పెంచుకోవాలని చూస్తారు. అలా ఖాళీగా ఎకరాలకు ఎకరాల స్థలాలు ఉన్నాయి. వాటి పత్రాలను రాత్రికి రాత్రి మార్చేసి జనాలను ఏమార్చేసి అమ్మేస్తున్న గ్యాంగులు కూడా విశాఖలోనే కనిపిస్తున్నాయి. ఎన్నారైలు ఈ విధంగా తమ భూములు గోల్ మాల్ అయ్యాయని ఇస్తున్న ఫిర్యాదులతో పోలీస్ స్టేషన్లలో గుట్టల కొద్దీ ఫిర్యాదులు ఉన్నాయి. గత టీడీపీ టైమ్ లో ఒక ఎమ్మెల్యే దగ్గరి బంధువు భూములకే ఈ విధంగా సెటిల్మెంట్స్ గ్యాంగ్స్ సెట్ చేసి అమ్మేసాయి. ఇపుడు కూడా పలుకుబడి కలిగిన పెద్దల మద్దతుతో భూ దందా సవ్యంగా సాఫీగా చేసుకుంటూ పోతున్నారు. మొత్తానికి ప్రభుత్వ భూములకు ఏనాడో దిక్కు లేకుండా పోయింది. ఇపుడు ప్రైవేట్ భూములు కూడా రెక్కలు కట్టుకుని ఎగిరిపోవడంతో సామాన్యులు బెదిరిపోతున్నారు.