పవార్ తో పెట్టుకుంటే…?

శరద్ పవార్… సీనియర్ నేత. ఆయనకు రాజకీయాల్లో మరో పేరు జిత్తుల మారి. తనకు రాజకీయ పాఠాలు నేర్పిన నేతనే పక్కన పెట్టి పార్టీని చీల్చిన ఘనత [more]

Update: 2019-11-26 17:30 GMT

శరద్ పవార్… సీనియర్ నేత. ఆయనకు రాజకీయాల్లో మరో పేరు జిత్తుల మారి. తనకు రాజకీయ పాఠాలు నేర్పిన నేతనే పక్కన పెట్టి పార్టీని చీల్చిన ఘనత శరద్ పవార్ ది. ఇప్పుడు శరద్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్రబిందువుగా మారారు. శివసేన పూర్తిగా శరద్ పవార్ వ్యూహాలపైనే ఆధారపడి ఉంది. శరద్ పవార్ చెప్పినట్లుగానే శివసేన ప్రతి అడుగు వేస్తుంది. ఆయన చెప్పిన వ్యూహాన్ని అమలు చేస్తుంది. నిన్న జరిగిన మహా పరేడ్ కూడా శరద్ పవార్ ఆలోచనే.

మరాఠా రాజకీయాలను…

శరద్ పవార్ కు మరాఠా యోధుడిగా పేరుంది. ఆయన 27 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి 38 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కాగలిగారు. సోనియాగాంధీ విదేశీయతను సయితం ప్రశ్నించిన తొలి నేత శరద్ పవార్. అలాంటి సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ కు శరద్ పవార్ దగ్గరయ్యారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని మరాఠా రాజకీయాల్లో అనేక సార్లు మలుపులు తిప్పిన నేతగా పేరుగాంచారు. అటువంటి శరద్ పవార్ బీజేపీకి షాకిచ్చి అజిత్ పవార్ ను తిరిగి వెనక్కు రప్పించగలిగారు. గేమ్ ప్లాన్ లో సక్సెస్ అయ్యారు.

కుటుంబంలో విభేదాలు లేవని….

అజిత్ పవార్ ఎన్నికలకు ముందు కొంత అసహనం ప్రదర్శించారు. వెంటనే శరద్ పవార్ ఆయన ఇంటికి వెళ్లి మరీ మాట్లాడి వచ్చారు. తమ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని అప్పట్లో శరద్ పవార్ ప్రకటించారు. ఇప్పుడు మాత్రం కుటుంబంలో విభేధాలంటున్నారు. నిజానికి శరద్ పవార్ సీరియస్ గా శివసేన, కాంగ్రెస్ లతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ప్రధాని నరేంద్ర మోదీని ఆ సమయంలో కలవరు. మహారాష్ట్ర ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కలిసేవారు. శరద్ పవార్ మోదీని కలవడం ఎన్సీపీలోనూ తప్పుడు సంకేతాలు వెళ్లాయనే చెప్పాలి. అందుకే అజిత్ పవార్ బీజేపీ వెంట వెళ్లారంటున్నారు.

చివరి నిమిషంలో…..

79 ఏళ్ల వయస్సులోనూ శరద్ పవార్ మరాఠా రాజకీయాలను శాసించాలనుకుంటారు. అయితే శరద్ పవార్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఎవరికీ అర్థం కాదు. లాస్ట్ మినిట్ వరకూ ఎలాంటి వ్యూహం రచిస్తారన్నది సొంత పార్టీ నేతలకు అంతుచిక్కదు. పైకి కూటమి వైపు గట్టిగా నిలబడినట్లు కన్పించి అజిత్ పవార్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలను తిరిగి తన గూటికి రప్పించుకోగలిగారు. అజిత్ పవార్ ను కట్టడి చేయడంలో శరద్ పవార్ విజయం సాధించారు. అజిత్ పవార్ చేత రాజీనామా చేయించడం కూడా శరద్ పవార్ రాజకీయ అనుభవానికి ఒక నిదర్శనం. బీజేపీనీ మానసికంగా దెబ్బ కొట్టారు శరద్ పవార్. అందుకే ఫడ్నవిస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బీజేపీ బలపరీక్షకు ముందే వెనక్కు తగ్గింది.

Tags:    

Similar News