సూర్యకాంతం మూవీ రివ్యూ

నటీనటులు: నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌, పెర్లిన్‌ బెసానియా, సుహాసిని, శివాజీ రాజా తదితరులు సంగీతం: మార్క్‌ కె రాబిన్‌ నిర్మాతలు: వై. సందీప్‌, వై. సృజన, [more]

Update: 2019-03-29 11:22 GMT

నటీనటులు: నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌, పెర్లిన్‌ బెసానియా, సుహాసిని, శివాజీ రాజా తదితరులు
సంగీతం: మార్క్‌ కె రాబిన్‌
నిర్మాతలు: వై. సందీప్‌, వై. సృజన, రామ్‌ నరేష్‌
దర్శకత్వం: ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి

మెగా డాటర్ హీరోయిన్ అవ్వడమే కాస్త వింత. అలాంటి హీరోయిన్ అప్పుడే మూడు సినిమాల్లో నటించడం అంటే గొప్పే. ఇండస్ట్రీలోని చాలామంది కొడుకులని హీరోలుగా చెయ్యాలనుకుంటారు కానీ కూతుళ్లని హీరోయిన్ గా చెయ్యాలని అనుకోరు. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిగ్ ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ నుండి హీరోలే కాదు.. ఒక హీరోయిన్ రావడం.. ఇక్కడ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకోవడం జరిగిపోయింది. మరి మెగా ఫ్యామిలీ నుండి నటుడు నాగబాబు కూతురు నిహారిక టీవీ షో నుండి వెండితెర మీద హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించడం… తాజాగా సూర్యకాంతంగా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగిపోయింది. కాకపోతే ఇప్పటివరకు ఓ మోస్తరు హీరోలతోనే నిహారిక నటించింది కానీ ఒక్క పెద్ద హీరోతో కూడా నటించలేదు. ఇక నిహారిక నటించిన సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ ఎక్కడా హిట్ అయిన దాఖలు లేవు. సినిమాలే కాకుండా నిహారిక వెబ్ సిరీస్ తోనూ ప్రేక్షకులకు చేరువైంది. మరి హీరోయిన్ గా ఓ అన్నంత హిట్ లేని నిహారిక సూర్యకాంతంగా ఇప్పుడైనా హిట్ అందుకుందా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ

సూర్యకాంతం(నిహారిక) పేరుకు తగ్గట్టే ఎవరికీ అర్ధం కాని ఓ వింత పాత్ర. తనకు నచ్చింది మాత్రమే చేస్తుంది. ఎవరి కోసం తను మారదు. ఎవరూ తనకోసం మారాలని అనుకోదు. తనకు తానే ముద్దు. తన తరువాతే ఎవరైనా. ఇలాంటి ఇంట్రస్ట్రింగ్ క్యారెక్టర్‌ని తొలిచూపులోనే చూసి ప్రేమిస్తాడు అమాయకపు అభి(రాహుల్ విజయ్). లవ్, కమిట్మెంట్, ఎమోషన్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండే సూర్యకాంతం.. అభి ప్రేమను వద్దంటూనే అట్రాక్ట్ అవుతుంది. అయితే అభి త‌న మ‌న‌సులో ఉన్న ప్రేమ‌ని బ‌య‌ట పెట్టాల‌నుకునేలోపే సూర్యకాంతం ఇంటి నుంచి మాయ‌మైపోతుంది. ఏడాది పాటు ఎదురు చూసినా తిరిగి రాదు. దాంతో అభి ఇంట్లో పెద్దలు కుదిర్చిన పూజ(పెర్లిన్‌)తో పెళ్లికి ఒప్పుకొంటాడు. కొన్ని రోజుల్లో అభికి నిశ్చితార్థం అన‌గా సూర్యకాంతం ప్రత్యక్షం అవుతుంది. కనబడకుండా పోయిన సూర్యకాంతం రావడమే కాదు ఈసారి అభిని ప్రేమిస్తున్నట్లు అభితో చెబుతుంది. మ‌రి సుర్యకాంతం ప్రేమని అభి ఒప్పుకుంటాడా? అసలు సూర్యకాంతం కనబడకుండిపోవడానికి కారణం? నిశ్చితార్ధము చేసుకోవాల్సిన పూజకి అభి ఎం చెప్తాడు? అటు పూజ‌.. ఇటు సూర్యకాంతం మ‌ధ్య అభి ఎలా న‌లిగిపోయాడు? ఆ ఇద్దరిలో ఎవ‌రు అభితో క‌లిసి జీవితాన్ని పంచుకున్నారు? అనేది తెర మీద చూడాల్సిందే.

నటీనటుల నటన

అభి, సూర్యకాంతం, పూజ‌ సినిమాకి మెయిన్ పిల్లర్స్. సూర్యకాంతంగా నిహారిక ఓకె ఓకె. నిహారిక నటనలో వీక్ అనే విషయం ఆమె నటించిన ప్రతి సినిమాలోనూ ప్రూవ్ అవుతూనే ఉంది. కాకపోతే నిహారిక కొంటె పిల్లగా క‌నిపించిన విధానం, మ‌న‌సులోని ప్రేమ‌ని బ‌య‌ట పెట్టేందుకు ప్రయ‌త్నించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఎమోషన్ సీన్లలో మునుపటి కంటే కాస్త బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె పాత్ర కోసం డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సెట్ కాలేదు. ఇక హీరో పాత్రలో రాహుల్ విజయ్ ఆకట్టుకున్నాడు. ఇద్దరమ్మాయిల మ‌ధ్య న‌లిగిపోతూ భావోద్వేగాలు పండించే అభి పాత్రతో రాహుల్ మెప్పిస్తాడు. లవ్ ఎమోషన్స్ సీన్స్‌ లో హావభావాలను పలికించగలిగాడు. ఇద్దరి హీరోయిన్స్ కంటే మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చాడు. పెర్లిన్‌ బెసానియా చేసిన పూజ పాత్రలో చాలా స్పష్టత కనిపిస్తుంటుంది. ఆమె నటన ఆకట్టుకునేలా ఉంది సూర్యకాంతం తల్లిగా నటించిన సుహాసిని కనిపించిన రెండు మూడు సీన్లలో సీనియారిటీ నిరూపించుకుంది. శివాజీ రాజా, మధుమణి తదితర నటులు పరిధిమేర నటించారు.

విశ్లేషణ

ఒక అబ్బాయి, అమ్మాయిని ప్రేమించడం.. ఆమెకి ప్రేమని తెలియజెప్పకుండా నలిగిపోతున్న టైంలో ఆ అమ్మాయి కనబడకుండా పోవడం, తర్వాత పేరెంట్స్ కోసం ఆ అబ్బాయి పెళ్లికి ఒప్పుకోవడం ఇలా చాలా సినిమాల్లో అంటే పాత కాలం సినిమాల నుండి చూసిన కథనే దర్శకుడు సూర్యకాంతం కోసం ఎంచుకున్నాడు. రొటీన్ కథతో సూర్యకాంతాన్ని ఫ్రెష్‌గా చూపించే ప్రయత్నంలో రొటీన్ ఫార్ములానే ఫాలో అయిపోయారు. రొటీన్ కథను డిఫరెంట్‌గా ప్రజెంట్ చేయాలనే ఆలోచన బాగుంది కానీ తెరకెక్కించిన విధానం కన్విన్సింగ్‌గా లేదు. కామెడీ జిమ్మిక్కులతో కథను నడిపిస్తూ తాను కన్ఫ్యూజ్ అవుతూనే ప్రేక్షకుల్నీ కన్ఫ్యూజన్‌లో పడేశారు. ఫస్ట్ హాఫ్ లో అక్కడ‌క్కడా సున్నిత‌మైన హాస్యం.. పాత్రల ప‌రిచ‌యానికే ప‌రిమిత‌మైంది త‌ప్ప పెద్దగా క‌థేమీ లేదు. నిహారిక పాత్ర చేసే హంగామా కొన్ని చోట్ల న‌వ్విస్తే, మరి కొన్ని చోట్ల చికాకు తెప్పిస్తుంది. ఆ పాత్ర డిజైన్ చేసిన విధాన‌మే అలా ఉంది. ఫస్టాఫ్ మొత్తాన్ని సాఫీగా లాగించిన దర్శకుడు సెకండాఫ్‌లో స్లో నరేషన్‌తో విసుగుతెప్పించారు. కాకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్ స‌న్నివేశాలు మాత్రం ఆస‌క్తిని రేకెత్తిస్తాయి. అక్కడ్నుంచే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. మూడు పాత్రల మ‌ధ్య సంఘ‌ర్షణని తెర‌పై చూపించిన విధానం బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్నిచోట్ల సూర్యకాంతం పాత్ర వ్యతిరేక ఛాయ‌ల‌తో సాగుతుంది. కానీ ఆమె ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయింది. ఎందుక‌లా వ్యవ‌హ‌రించిందనడానికి కార‌ణాల్ని మాత్రం బ‌లంగా చెప్పలేక‌పోయాడు ద‌ర్శకుడు. రిపీట్ సన్నివేశాలతో ప్రేక్షకుల సహనానికి పరీక్షపెట్టాడు. ఈ సినిమాకి సంగీతం అందించిన మార్క్ కె రాబిన్ మంచి పాట‌ల‌తో పాటు నేప‌థ్య సంగీతం బాగుంది. హరిజ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్: నిహారిక, రాహుల్, షెర్లిన్ పాత్రల డిజైన్, మ్యూజిక్, సెకండ్ హాఫ్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్: స్లో నేరేషన్, కామెడీ లేకపోవడం, ఎడిటింగ్, రొటీన్ కథ, ఫస్ట్ హాఫ్

రేటింగ్: 2.0 /5

Tags:    

Similar News