చిన్నమ్మా…నిన్ను మరువలేమమ్మా

మాజీ కేంద్రమంత్రి బిజెపి సీనియర్ నేత సుష్మ స్వరాజ్ (67) కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమెను చికిత్స కోసం ఎయిమ్స్ కి తరలించారు. చికిత్స [more]

Update: 2019-08-07 03:30 GMT

మాజీ కేంద్రమంత్రి బిజెపి సీనియర్ నేత సుష్మ స్వరాజ్ (67) కన్నుమూశారు. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆమెను చికిత్స కోసం ఎయిమ్స్ కి తరలించారు. చికిత్స పొందుతు ఉండగానే ఆమె మృతిచెందారు మరణానికి కొద్ది గంటలకు ముందే ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ ట్విట్టర్ లో కాశ్మీర్ అంశంపై తనదైన శైలిలో స్పందించారు సుష్మ. కాశ్మీర్ పై తాను జీవితకాలం ఎదురుచూసిన కోరికను మోడీ నెరవేర్చారని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు సుష్మా చివరి ట్వీట్ బిజెపి శ్రేణులను మరింత కన్నీరు పెట్టించింది. ఆమె పరిస్థితి విషమించినవెంటనే కేంద్రమంత్రులు, బిజెపి అగ్రనేతలు ఆసుపత్రికి చేరుకున్నారు. సుష్మాకు భర్త కుమార్తె వున్నారు. హర్యానా లోని అంబాలా సుష్మ స్వస్థలం. భర్త సుప్రీం కోర్టు న్యాయవాదిగా కొనసాగుతున్నారు. కొంతకాలం క్రితం ఆయన మిజోరాం గవర్నర్ గా కూడా సేవలు అందించారు. రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కెసిఆర్ దేశవ్యాప్తంగా నేతలంతా పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించి ఆమెకు ఆశ్రునివాళి అర్పించారు.

అతి చిన్నవయస్సులోనే …

భారతీయ సంప్రదాయ మహిళకు నిజమైన ప్రతిరూపంలా కనిపించే కట్టుబొట్టు వేషధారణ సుష్మ స్వరాజ్ సొంతం.పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా అందుకుని సుప్రీం కోర్ట్ న్యాయవాదిగా కూడా కొంతకాలం పనిచేశారు సుష్మా స్వరాజ్. పాతికేళ్ళ ప్రాయంలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు సుష్మా స్వరాజ్. 1970 లో మొదలైన ఆమె రాజకీయ ప్రస్థానం 2019 ఎన్నికలకు ముందు వరకు అప్రతిహతంగా సాగింది.అనారోగ్యం వెంటాడంతో మూత్రపిండాలమార్పిడి ఆపరేషన్ తరువాత రాజకీయాలకు స్వస్తి పలికారు సుష్మా స్వరాజ్. తొలి రోజుల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలే చేశారు సుష్మా స్వరాజ్. భారతీయ జనతాపార్టీలో, ఆర్ఎస్ఎస్ లో ఆమెకు వున్న పరిచయాలతో బిజెపి అధ్యక్ష బాధ్యతలు దక్కేవే. కానీ చట్టసభల్లో కొనసాగడం అక్కడ చర్చల్లో పాల్గొనడం అంటే ఇష్టపడే ఆమె పార్టీ బాధ్యతలను పార్లమెంట్లో అద్భుతంగా నిర్వర్తించేవారు. అటల్ బిహారీ వాజ్ పేయి, నరేంద్ర మోడీ ప్రభుత్వాల్లో పలు శాఖలు సమర్ధవంతంగా నిర్వర్తించారు సుష్మ. ఢిల్లీ ఐదవ ముఖ్యమంత్రిగా కూడా రాణించారు ఆమె. రెండు సార్లు రాజ్యసభకు, ఐదు సార్లు లోక్ సభ కు ఎన్నికై అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు సుష్మా స్వరాజ్. మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు ఆమె. ఇక 2009 నుంచి 2014 వరకు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షనేతగా అద్వితీయ వాక్పటిమతో కమలం వాయిస్ ను వినిపించి దేశవాసుల ప్రశంసలను పార్టీ అభినందనలు అందుకున్నారు ఆమె.

సోనియా కు చుక్కలు చూపించి …

యుపిఎ అధికారంలోకి వచ్చాకా సోనియాగాంధీ ప్రధాని కాకుండా అడ్డుపడిన వారిలో బిజెపి నుంచి సుష్మా స్వరాజ్ కూడా ఒకరు. విదేశీ వనిత అయిన సోనియా ప్రధాని అయితే తాను వెంటనే గుండు కొట్టించుకు తిరుగుతా అంటూ సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. అదేవిధంగా 1999 లో కర్ణాటకలోని బళ్ళారి నుంచి సోనియా పై పోటీకి దిగి ఆమెను ఉక్కిరి చేశారు. ఆ సందర్భంగానే ఆమెకు ప్రియ శిష్యుడుగా మారిన గాలి జనార్ధన రెడ్డి సహకరించడం ఆమెకు వివాదాలు కొనితెచ్చింది. గాలి సుష్మా చెప్పులు తొడగడం , సన్మానాలు బిజెపి లో సైతం విమర్శలకు తెరతీశాయి. విదేశాంగ మంత్రి హోదాలో సామాజికవేదికలైన ట్విట్టర్ లో ఎవరు సమస్య తన దృష్టికి తెచ్చినా స్పందించి వాటి పరిష్కారానికి ఆమె కృషిచేసిన తీరు అందరి మన్ననలు అందుకునేది. ఇందిరాగాంధీ తరువాత విదేశాంగ మంత్రిత్వ శాఖను చేపట్టిన రెండో మహిళ సుష్మా స్వరాజ్ కావడం విశేషం. మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి ముందు సుష్మా స్వరాజ్ పేరును సైతం కమలం అధిష్టానం పరిశీలించింది అంటే ఆమె సమర్ధత ఏ స్థాయిదో అద్ధం పడుతుంది. రాజకీయాల్లో మహిళలు రాణించడం అదీ వరుసగా విజయాలు అందుకోవడం భారత్ లాంటి దేశాల్లో అంత సులువు కాదు. కానీ పట్టుదలతో ఒక గృహిణి తనకు ఇష్టమైన రాజకీయాల్లో నాలుగున్నర దశాబ్దాలకు పైగా వివిధ హోదాల్లో ప్రతిభావంతంగా కొనసాగడం సుష్మ స్వరాజ్ కే సాధ్యం అనొచ్చు. జాతీయ రాజకీయాల్లో తనదైన చెరగని ముద్ర వేసిన సుష్మ స్వరాజ్ నిర్మించిన బాట నేటి తరం మహిళలకు స్ఫూర్తి, దీప్తి అనుసరణీయం.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ….

సుష్మాస్వరాజ్ తెలంగాణ ఉద్యమ సయమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచారు. తెలంగాణ ప్రజల సమస్యల పట్ల ఆమె తరచూ స్పందించేవారు. విభజన సమయంలోనూ చిన్నమ్మ తెలంగాణ పక్షాన నిలిచారు. అందుకే తెలంగాణ కల సాకారమయిందనడం కాదనలేని వాస్తవం. అందుకే తెలంగాణ ప్రజలు సుష్మాస్వరాజ్ ను చిన్మమ్మగా పిలుచుకుంటారు.

Tags:    

Similar News