శారదాపీఠానికి బడా పార్టీల క్యూ..?

విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి చెప్పుకుంటారు. బీచ్ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇక ఆధ్యాత్మికంగా చూడాలంటే పెందుర్తిలో ఉన్న శ్రీ శారదాపీఠం ఆశ్రమం గురించి కూడా చెప్పుకుంటారు. [more]

Update: 2021-02-22 11:00 GMT

విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి చెప్పుకుంటారు. బీచ్ గురించి కూడా మాట్లాడుకుంటారు. ఇక ఆధ్యాత్మికంగా చూడాలంటే పెందుర్తిలో ఉన్న శ్రీ శారదాపీఠం ఆశ్రమం గురించి కూడా చెప్పుకుంటారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీకి భక్తులు ఎక్కువ. అంతకు మించి రాజకీయ భక్తులు ఇంకా ఎక్కువ. స్వామీజీ కూడా మిగిలిన వారి మాదిరిగా కాకుండా రాజకీయాల మీద ఎప్పటికపుడు బాగానే స్పందిస్తారు. పైగా దేశవ్యాప్తంగా ఆయనకు రాజకీయ నేతలతో పరిచయాలు కూడా ఉన్నాయి.

అదే క్రెడిట్ గా….

పెందుర్తి శారదాపీఠానికి ఆధ్యాత్మిక పరిమళాలతో పాటు మరెంతో రాజకీయ ప్రాముఖ్యత కూడా ఉంది. ఇక్కడకు ఎందరో రాజకీయ పెద్దలు వచ్చి వెళ్తూంటారు. ఇక దివంగత ప్రధాని పీవీ నరసింహారావు లాంటి వారి నుంచి ఎందరో ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా ఈ పీఠాన్ని సందర్శించి స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. ఇక శారదాపీఠం రెండళ్ల నుంచి మరో విధంగా కూడా ప్రాచుర్యం పొందింది. అదేంటి అంటే తెలంగాణాలో కేసీయార్ ని రెండవమారు సీఎం చేయడానికి స్వామీజీ చేసిన రాజశ్యామల యాగం బాగా ఉపయోగపడిందని పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ గెలవడానికి ఆయన కోసం కూడా స్వరూపానందేంద్ర స్వామీజీ పీఠంలో రాజశ్యామల యాగం చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకుల చూపు ఈ పీఠం మీద పడింది అంటున్నారు.

స్టాలిన్ సతీమణి రాక ….

ఇక కొద్ది నెలలలో ఎన్నికలు జరగబోతున్న తమిళనాడులో డీఎంకే పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రావాలనుకుంటోంది. ఇప్పటికి రెండు తడవలుగా ఓడిన డీఎంకేకి ఇవే చివరి అవకాశంగా చెప్పుకుంటున్నారు. దాని కోసం స్టాలిన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇపుడు ఆయన ఆధ్యాత్మిక బాట కూడా పట్టారని అంటున్నారు. ఈ మధ్యనే స్టాలిన్ సతీమణి రహస్యంగా పీఠాన్ని సందర్శించి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది. స్టాలిన్ ఎన్నికల్లో గెలవాలని ఆ విధంగా ఆధ్యాత్మిక బలం తమకు దక్కాలని ఆమె కోరుకున్నట్లుగా తెలుస్తోంది.

అఖిలేష్ కూడానా….?

ఇదిలా ఉండగా మరో వైపు ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ దారుణంగా దెబ్బ తిని ఉంది. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా 2022లో జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని పరితపిస్తున్నారు. ఆయన కూడా శారదాపీఠం గురించి విన్నారని, తొందరలో స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సుల కోసం రావాలనుకుంటున్నారని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే స్వామీజీ కోసం ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అంతా క్యూ కడుతున్నారు. తమకు అధికార వైభోగం దక్కేలా ఏవైనా పూజలు చేయాలని కూడా గట్టిగా కోరుకుంటున్నారుట. ఈ పరిణామాలన్నీ చూస్తూంటే శారదాపీఠం రాజకీయంగా కూడా కీలకంగా దేశంలో మారుతోంది అని అర్ధమవుతోంది.

Tags:    

Similar News