స్టాలిన్ కు కొత్తరకం తలనొప్పులు తప్పవా?

తమిళనాడు ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ రాజకీయ పార్టీలు ఎవరి గేమ్ వారు ప్రారంభించారు. కూటమిలో ఉంటూనే దాని ప్రయోజనాలను గండికొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లోనూ రెండు [more]

Update: 2020-10-27 17:30 GMT

తమిళనాడు ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ రాజకీయ పార్టీలు ఎవరి గేమ్ వారు ప్రారంభించారు. కూటమిలో ఉంటూనే దాని ప్రయోజనాలను గండికొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లోనూ రెండు కూటములు ప్రధానంగా రేసులో ఉండనున్నాయి. ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు తమ కూటమిలో చోటు కల్పించాయి. ప్రాంతీయ పార్టీలు ఇచ్చే స్థానాలతోనే జాతీయ పార్టీలు సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

డీఎంకే రేసులో….

అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తే అధికార అన్నాడీఎంకే కంటే విపక్ష డీఎంకే బలంగా కన్పిస్తుంది. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండటం, కరుణానిధి మరణం ఈ పార్టీకి వచ్చే ఎన్నికల్లో కలసి వస్తుందని భావిస్తున్నారు. ముందస్తు సర్వేలు కూడా డీఎంకే కే ఎడ్జ్ ఉందని చెబుతున్నాయి. అయితే ఈసారి డీఎంకే కూటమిలోని పార్టీలకు తక్కువ సీట్లు ఇవ్వాలని నిర్ణయించింది. డీఎంకే గుర్తు మీద కాకుండా ఇతర గుర్తుల మీద పోటీ చేస్తే గత ఎన్నికల ఫలితాలు వస్తాయని డీఎంకే ఆందోళన చెందుతోంది.

తక్కువ స్థానాలు ఇచ్చి…..

అందుకే కాంగ్రెస్ కు గతంలో కన్నా తక్కువ స్థానాలను ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇది కాంగ్రెస్ కు మింగుడుపడటం లేదు. అందుకే కాంగ్రెస్ కొత్త ఎత్తులకు దిగిందంటున్నారు. అసలే కూటమిలోని పార్టీలకు సీట్లను సర్దుబాటు చేయలేక ఇబ్బంది పడుతున్న డీఎంకేకు మరింత అవస్థలు పెట్టేలా తమిళనాడు కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తుంది. మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ ను కూటమిలోకి కాంగ్రెస్ ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.

కమల్ కు ఆహ్వానం….

నిజానికి కూటమికి నేతృత్వం వహిస్తున్న డీఎంకే తమ కూటమిలో ఎవరిని చేర్చుకోవాలి? చేర్చుకోకూడదో? నిర్ణయించుకోవాలి. కానీ తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఆళగిరి మాత్రం కమల్ హాసన్ ను కూటమిలోకి ఆహ్వానించారు. కమల్ హాసన్ కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో సీట్ల సర్దుబాటు డీఎంకేకు సమస్యగా మారనుందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. తమిళనాడు లో లక్షల సం‌ఖ్యలో ఉన్న కమల్ అభిమానులు అండగా నిలిచి కూటమి విజయావకాశాలు మెరుగుపడతాయని అనుకున్నా, సీట్ల సర్దుబాటు డీఎంకేకు సమస్యగా మారనుంది. మరి కమల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News