పాతమిత్రులపై పగ తీర్చుకుంటున్నారా …?

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరు అందరికి తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వైసీపీని ముప్పు తిప్పలు పెట్టేవారు కోడెల. అధికారపక్షం [more]

Update: 2019-08-16 00:30 GMT

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరు అందరికి తెలిసిందే. చంద్రబాబు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ వైసీపీని ముప్పు తిప్పలు పెట్టేవారు కోడెల. అధికారపక్షం విమర్శలు, ఆరోపణల దాడి ఎలా ఉన్నప్పటికి స్పీకర్ ను ఎదుర్కోవడం నాటి విపక్షానికి సాధ్యమయ్యేది కాదు. ఇక పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అయితే స్పీకర్ కి ఫిర్యాదు చేసినా ఐదేళ్ళ పాలన పూర్తి అయినా కూడా కోడెల చర్య తీసుకున్నది లేదు. కనీసం విచారణ సైతం చేపట్టిందే లేదు. ఇలా అడుగడుగునా అవమానాలను ఎదుర్కొన్న వైసిపికి అధికారంలోకి వచ్చాక గతంలో జరిగిన దానికి బదులు తీర్చుకునే అవకాశం దొరికింది. గతంలో తాము పడిన వేదన అంతా చంద్రబాబు కి రుచి చూపించాలని దానికి తగిన వ్యక్తి స్పీకర్ కావాలని లెక్కేసే తెలుగుదేశం పార్టీ లో సుదీర్ఘ కాలం పనిచేసిన తమ్మినేని సీతారాం ను జగన్ ఎంపిక చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.

చెలరేగుతున్న తమ్మినేని …

జగన్ అంచనాలను ఏమాత్రం వమ్ముచేయడంలేదు స్పీకర్ తమ్మినేని సీతారాం. వాస్తవానికి స్పీకర్ అనే వారు తక్కువ మాత్రమే మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడిస్తారు. దీనికి భిన్నం తమ్మినేని. సహజంగా మంచి వక్త అయిన తమ్మినేని రాజకీయాలకు అతీతమైన స్థానం లో ఉంటున్నా తన నోటికి తాళం వేయడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. తన సుదీర్ఘ ఉపన్యాసాలు, సూచనలతో అసెంబ్లీలో విపక్షానికి చుక్కలు చూపించేస్తున్నారు. ఇది కేవలం శాసనసభ వరకే కాకుండా తన నియోజకవర్గంలో పూర్తి రాజకీయ వేత్తగా అవతారం దాల్చి కోడెల కు తానేమి తక్కువ కాదని నిరూపిస్తున్నారు.

కలవరపడుతున్న బాబు …

తమ్మినేని సీతారాం చేస్తున్న ఘాటు వ్యాఖ్యలు చంద్రబాబు ను సైతం కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఓరినాయనో ఇదేమి భాష ఇదేమి అటాక్ ఆయన స్పీకరా? మరేదేనేనా అనే రీతిలో ఇంటాబయటా విపక్ష నేత వాపోతున్నారు. అది చూసి వైసిపి శ్రేణులు సంబరపడిపోతున్నాయి. ఇప్పుడు తెలిసిందా మీకు అప్పుడు గుర్తుకు రాలేదా అంటూ ఎదురుదాడి తో టిడిపి ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమ్మినేని సీతారాం మాస్ మహారాజ్ గా తన నియోజకవర్గంలో చెలరేగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలా లేకపోతే ఆయన క్యాడర్ కి దగ్గర కాలేరని మరో పక్క సొంత పార్టీ లో సమర్ధింపులు వినవస్తున్నాయి. మొత్తానికి తమ్మినేని సీతారాం నీవు నేర్పిన విద్య యే నీరజాక్షా అంటూ తన పాత టిడిపి మిత్రులకు చుక్కలు చూపించేయడం గమనార్హం.

Tags:    

Similar News