స్పీకర్ గారు..ఫుల్ సైలెంట్ అయ్యారు ?

తమ్మినేని సీతారాం. ఆయనలోని రాజకీయ నాయకుడు స్పీకర్ కుర్చీలో కూర్చున్నా ఎక్కడా మౌనంగా ఉండనీయలేదు. గత పదమూడు నెలలుగా ఆయన వైసీపీ కీలక నాయకుడి మాదిరిగానే టీడీపీ [more]

Update: 2020-08-11 13:30 GMT

తమ్మినేని సీతారాం. ఆయనలోని రాజకీయ నాయకుడు స్పీకర్ కుర్చీలో కూర్చున్నా ఎక్కడా మౌనంగా ఉండనీయలేదు. గత పదమూడు నెలలుగా ఆయన వైసీపీ కీలక నాయకుడి మాదిరిగానే టీడీపీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుని గట్టిగా టార్గెట్ చేస్తూ వచ్చారు. జగన్ని ఎంతగానో పొగిడారు. మూడు రాజధానుల విషయంలో అయితే ఆయన ప్రభుత్వానికి అందరి కంటే ఎక్కువగా బాసటగా నిలిచి విపక్షాన్ని చీల్చిచెండాడారు. ఓ దశలో కోర్టు తీర్పుల మీద కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇవన్నీ గతం అనుకుంటే ఇపుడు మాత్రం తమ్మినేని సీతారాం పూర్తిగా శాంతమూర్తి అయిపోయారు. ఆయన చడీ చప్పుడూ ఎక్కడా లేకుండా ఉంది.

అందుకేనా …?

మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం వస్తుందని తమ్మినేని సీతారాం గట్టిగా నమ్మారు, ఓ సందర్భంలో అయితే ఆయన సతీసమేతంగా జగన్ ని స్వయంగా కలసి తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్లుగా ప్రచారం జరిగింది. పెద్దాయన ఆయాస‌పడి ఈ వయసులో ఇంతలా పదవి కోరితే జగన్ కాదంటారా. తప్పకుండా ఆయనకు చాన్స్ ఇస్తారని అంతా భావించారు. తమ్మినేని సీతారాం కూడా అదే నమ్మకం మీద ఉన్నారని చెబుతారు. పైగా శ్రీకాకుళం జిల్లాలో గత కొన్నేళ్ళుగా టీడీపీ వల్ల నిర్లక్ష్యానికి గురి అయిన కాళింగ సామాజికవర్గానికి చెందిన నేతగా తమ్మినేని ఉన్నారు. అన్ని సమీకరణలు సరిపోయారు అనుకున్నారు. కానీ జగన్ జూనియర్ అయిన సీదర్ అప్పలరాజుకు మంత్రిపదవి ఇచ్చారు.

జిల్లా దాకా వచ్చి ……

మంత్రివర్గ విస్తరణ రెండేళ్ళ వరకూ అసలు లేదంటే ఏమో అనుకోవచ్చు. కానీ అనూహ్యంగా ఏడాది వ్యవధిలో రెండు పదవులు ఖాళీ అయ్యాయి. రెండూ కూడా బీసీలకు చెందినవే. పైగా తాను స్పీకర్ హోదాను సైతం పక్కన పెట్టి ప్రభుత్వానికి రక్షణగా విరుచుకుపడుతున్న సంగతిని కూడా ఒక అర్హతగా భావించిన తమ్మినేని సీతారాం ఇక అమాత్య పదవి ఖాయమని అనుకున్నారు. నిండు అసెంబ్లీలో కూడా అచ్చెన్నాయుడు అంత సరదా ఉంటే మంత్రి పదవి తీసుకోండి, స్పీకర్ గా రాజకీయాలు చేయమాకండి అంటే అలాగే తప్పకుండా అవుతాను అచ్చెన్నాయుడు అంటూ తమ్మినేని స్పీకర్ స్థానం నుంచే చెప్పడం ద్వారా నాడు సభలో ఉన్న జగన్ కి కావాలనే హింట్ ఇచ్చారు. మరి ఇన్ని చేసినా కూడా మంత్రి పదవి రాలేదన్న బాధ తమ్మినేనిలో ఉందిట. అది కూడా తన జిల్లా దాకా పదవి వచ్చి కూడా తనను పక్కన పెట్టడం పట్ల పెద్దాయన తెగ ఫీల్ అవుతున్నారని టాక్.

ఇక ఇంతేనా …?

తమ్మినేని సీతారాం వయసు ఇపుడు ఏడు పదులు దాటింది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని క్లారిటీగా చెప్పేశారు. ఆయన తనయుడు తమ్మినేని నాగ్ చిరంజీవిని ఆముదాలవలస వైసీపీ ఇంచార్జిగా చేశారు. తన తరువాత టికెట్ కొడుక్కి ఇవ్వాలన్నది తమ్మినేని ఆశ. ఈ లోగా తాను మంత్రి అయితే పొలిటికల్ గా పట్టు పెంచుకోవచ్చునని భావించారు. కానీ జగన్ మంత్రి పదవి ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే ధర్మాన సోదరులకు సన్నిహితంగా ఉండే సీదరి అప్పలరాజుకు పట్టం కట్టడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు తారు మారు అయ్యాయని కూడా పెద్దయన కలత చెందుతున్నట్లుగా భోగట్టా. అందుకే ఆనాడు నిండు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందితేనే రచ్చ రచ్చ చేసిన తమ్మినేని సీతారాం ఇపుడు గవర్నర్ సంతకం చేసి చట్టంగా వచ్చినా కూడా కనీసంగా కామెంట్ చేయకపోవడం పట్ల పార్టీలోనే చర్చ సాగుతోంది. మరి జగన్ స్పీకర్ చేత మాట పలికించాలంటే ఈసారి విస్తరణలోనైనా పదవి ఇస్తానని హామీ ఇవ్వాలేమో.

Tags:    

Similar News