తమ్మినేని అలా హిట్ అయ్యారుగా ?

ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వారు. రాజకీయ యోధుడిగానే ఆయన్ని చూడాలి. స్పీకర్ [more]

Update: 2020-12-04 08:00 GMT

ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన వారు. రాజకీయ యోధుడిగానే ఆయన్ని చూడాలి. స్పీకర్ అంటే అందరూ మాట్లాడరు అనుకుంటారు కానీ తమ్మినేనిని చూస్తే మాత్రం ఆ పదవికి అదే పేరు కరెక్ట్ అనుకుంటారు. అలా గలగలా మాట్లాడడమే కాదు, ప్రత్యర్ధులను గడగడలాడించే నైపుణ్యం కూడా తమ్మినేని సీతారాం సొంతం. ఆయన స్పీకర్ గా ఉన్నా కూడా ఎక్కడా తగ్గడంలేదు, అసలు సైలెంట్ కావడంలేదు.

జాతీయ స్థాయిలోనే……

జగన్ సర్కార్ గత ఏడాదిన్నర కాలంగా కోర్టుల చేతిలో ఇబ్బందులు పడుతోంది. అనేక చట్టాలు అమలు కాకుండా బ్రేక్ పడుతోంది. దాంతో ఏపీలో న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య అతి పెద్ద అగాధం ఏర్పడింది అని అంతా భావిస్తున్నరు. దానికి తగినట్లుగా తమ్మినేని సీతారాం లాంటి వారు కూడా కోర్టుల జోక్యం మీద గతంలో మీడియా ముందే అసహనం వ్యక్తం చేశారు. ఇపుడు తగిన సమయం వచ్చింది. అది కూడా అఖిల భారత స్పీకర్ల సదస్సులో. దాంతో జాతీయ స్థాయిలోనే తన గొంతు వినిపించి రాజ్యాంగ స్పూర్తిని ఇలాంటివి విఘాతం అంటూ కోర్టుల మీద మరోమారు తమ్మినేని తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.

అనూహ్య మద్దతు…

ఇక తమ్మినేని సీతారాం అభిప్రాయాలకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు కూడా మద్దతు ఇచ్చినట్లుగానే తన ప్రసంగం చేయడం విశేషం. ఆయన కూడా కోర్టు తీర్పుల గురించి మాట్లాడుతూ శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ జొరబడడం మంచిది కాదు అని స్పష్టం చేశారు. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థగా రాజ్యాంగంలో కొన్ని పరిధులు అధికారాలు కట్టబెట్టిందని కూడా వెంకయ్యనాయుడు అన్నారు. అందువల్ల అందరూ దాన్ని అనుసరించాలని కూడా సూచించారు. ఈ విధంగా తమ్మినేని సీతారాం ధాటీ ప్రసంగానికి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా జతగా మారి టీడీపీకి దాని అనుకూల మీడియాకు మింగుడుపడడంలేదని అంటున్నారు. ఇక వైసీపీ రెబెల్ ఎంపీ రఘు రామ క్రిష్ణం రాజు అయితే ఏపీలో మాత్రం నూటికి నూరు శాతం జగన్ సర్కార్ దే తప్పు. రాజ్యాంగాన్ని ధిక్కరించింది జగనేనని ఆయన్ని ఉపరాష్ట్రపతి మందలించి ఉండాల్సింది అని తన రెబెల్ వాదననే వినిపించారు.

జగన్ మెప్పు దక్కేనా..?

తమ్మినేని సీతారాం సిక్కోలులో ఉన్నా, విజయవాడలో ఉన్నా కూడా ప్రభుత్వ వాదనను గట్టిగానే వినిపిస్తారు. స్పీకర్ గా ఆయన తటస్థ వైఖరిని అసలు పాటించరు. ఇపుడు స్పీకర్ల సదస్సులో ఆయన చేసిన ప్రసంగం, జగన్ సర్కార్ ని వెనకేసుకువచ్చిన తీరు కచ్చితంగా మార్కులు పెంచేవే. ఆయన పట్ల జగన్ కి మంచి అభిప్రాయం అయితే చాలానే ఉంది. ఇపుడు అది మరింతగా పెరిగింది అంటున్నారు. అయితే జగన్ మెప్పు ఎంత పొందినా తమ్మినేనికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది మాత్రం అనుచరులకు అనుమానంగానే ఉందిట. ఏది ఏమైనా 2024 నాటికి తన కుమారుడు, రాజకీయ వారసుడు తమ్మినేని నాగ్ కి ఆముదాలవలస టికెట్ అయినా జగన్ ఇచ్చి తీరుతారన్న నమ్మకం మాత్రం తమ్మినేనికి ఉందిట. అందుకే ఆయన వీలు దొరికినపుడల్ల సర్కార్ వాదనను అలా వినిపిస్తున్నారు. ఇపుడు అది జాతీయ స్థాయిలో కూడా తమ్మినేని సీతారాంకి హిట్ అందించింది.

Tags:    

Similar News