తమ్మినేనికి తన్నుకువస్తోందా..?

తమ్మినేని సీతారాం దూకుడు మీద ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన వయసు డెబ్బైలో రాజకీయం నాలుగు పదులల్లోకి చేరినా కూడా ఆ డైనమిక్ నేచర్ ఎక్కడికీ పోలేదు. [more]

Update: 2020-12-09 09:30 GMT

తమ్మినేని సీతారాం దూకుడు మీద ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన వయసు డెబ్బైలో రాజకీయం నాలుగు పదులల్లోకి చేరినా కూడా ఆ డైనమిక్ నేచర్ ఎక్కడికీ పోలేదు. ఎన్టీయార్ పిలుపుతో రాజకీయ రంగప్రవేశం చేసి తొలి ప్రయత్నంలోనే నాటి ఉద్దండ పిండం బొడ్డేపల్లి రాజగోపాలనాయుడుని ఓడించి రికార్డ్ సృష్టించారు. ఇక ఆయన నాటి నుంచి ఆముదాలవలసకు అసలైన నాయకుడిగా మారి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా పనిచేశారు తమ్మినేని సీతారాం. ఎన్టీయార్ హయాంలో సిక్కోలు రాజకీయాల్లో చక్రం తిప్పిన తమ్మినేని సీతారాం1995 ఎపిసోడ్ లో చంద్రబాబు వెంట ఉన్నారు. దానికి ప్రతిఫలంగా మంత్రి పదవిని కూడా పొందారు.

అలా తేడా కొట్టిందిగా …..

అయితే సిక్కోలు రాజకీయాల్లో కింజరాపు ఎర్రన్నాయుడుకు బాబు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తమ్మినేని సీతారాంని క్రమంగా దూరం పెట్టారు. ఇక సామాజిక సమీకరణపరంగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు మెజారిటీగా ఉన్న వెలమల డామినేషన్ ఎక్కువగా ఉంది. దాని వల్ల కూడా తమ్మినేనికి టీడీపీలో పొసిగింది కాదు. మొత్తానికి ఆయన ప్రజారాజ్యం నుంచి వైసీపీలోకి మారి స్పీకర్ పదవితో మళ్ళీ బాబుకు ఎదురు నిలిచారు. ఇపుడు బాబు అధ్యక్షా అని ఆయన్ని అనాల్సివస్తోంది.

ఉడత ఊపులేనా…?

బాబు రాజకీయాన్ని దగ్గరుండి చూసిన తమ్మినేని సీతారాం ఆయనవన్నీ ఉడత ఊపులేనంటున్నారు. బాబుకు ఎవరూ బెదిరిపోయే సీనే లేదని కూడా తేల్చేస్తున్నారు. చంద్రబాబు అటు తమ్మినేని సీతారాం ఇటు స్పీకర్ గా ఉండడంతో ఏపీ శాసనసభలో సరికొత్త సన్నివేశాలు ఆవిష్కరణ అవుతున్నాయి. బాబుకు ఆయనంటే పడదు, ఇక తమ్మినేనికి గతం గుర్తుకువస్తోంది. దాంతో ప్రస్తుత హోదాలు, వ్యవహారాలూ కూడా పక్కన పెట్టి ఇద్దరూ ఢీ కొడుతున్నారని అంటున్నారు. అచ్చెన్నాయుడుతో కలసి ఏకంగా స్పీకర్ మీద పేపర్స్ విసరడం ద్వారా చంద్రబాబు రచ్చకు కారణమయ్యారు. అదే సమయంలో స్పీకర్ ని తన వేలు పెట్టి బెదిరిస్తూంటే తమ్మినేని సీతారాం కూడా అంతే ధీటుగా రియాక్ట్ కావడం అసెంబ్లీ చరిత్రలో కొత్త పర్వమే మరి.

జగన్ కంటే కూడా…

గత అసెంబ్లీలోని ఒక్కసారి చూస్తే ప్రతిపక్ష నేత జగన్ కి నాటి స్పీకర్ దివంగత కోడెల శివ ప్రసాదరావు మైక్ పెద్దగా ఇచ్చేవారు కాదు. దాని కోసం జగన్ పోరాటం చేసేవారు. అయితే టీడీపీ వారి డైరెక్షన్ లో స్పీకర్ నాడు నడచుకునేవారు అంటారు. అంతే తప్ప జగన్ మీద ప్రత్యేకంగా కోడెలకు ఏ విధమైన వ్యక్తిగత వైరం లేదు అన్నది తెలిసిందే. దాంతో పాటు జగన్ కూడా తనను స్పీకర్ గా ఎన్నుకున్నారు అని పదే పదే కోడెల చెప్పేవారు. ఇక ఇపుడు చూస్తే అందుకు పూర్తి విరుద్ధమైన సీన్లు ఉన్నాయి. బాబుకు ఎటూ అధికార పక్షం మాట్లాడడానికి అడ్డంకులు పెడుతుంది. అదే సమయంలో ఏకంగా స్పీకర్ తమ్మినేని సీతారాం బాబుకు ఎదురు వస్తున్నారు. బాబు సైతం దూకుడు చూపిస్తూంటే తమ్మినేనికి గతం గుర్తుకు వచ్చి కోపం తన్నుకువస్తోంది అంటున్నారు. మొత్తానికి తమ్మినేని సీతారాంకి మంత్రి పదవి జగన్ ఇవ్వకపోయినా విలువైన స్పీకర్ పదవిలో కూర్చోబెట్టడంతో ఆయన ఫ్లాష్ బ్యాక్ కధలకు ఇపుడు బాకీలు చెల్లిస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయ‌ట.

Tags:    

Similar News