టీడీపీ ఘర్ వాపసీ… ?

ఆర్ఎస్ఎస్ కనిపెట్టిన పేరు ఘర్ వాపసీ. ఇతర మతాలలో చేరిన వారిని తమ మతంలోకి ఆకట్టుకునేందుకు సొంత ఇంటికి రండి అంటూ ఆప్యాయంగా ఇచ్చే పిలుపు ఇది. [more]

Update: 2021-09-16 08:00 GMT

ఆర్ఎస్ఎస్ కనిపెట్టిన పేరు ఘర్ వాపసీ. ఇతర మతాలలో చేరిన వారిని తమ మతంలోకి ఆకట్టుకునేందుకు సొంత ఇంటికి రండి అంటూ ఆప్యాయంగా ఇచ్చే పిలుపు ఇది. ఇది కొంతవరకూ సంఘానికి మేలు చేసింది. ఆర్ఎస్ఎస్ కి అలా ఆదరణ లభించింది. అంతే కాదేదీ రాజకీయాలకు అతీతం అన్నట్లుగా దీన్ని ఇపుడు రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాయి. ఘర్ వాపసీ పేరిట తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించుకునే ప్రయత్నం అయితే దేశాన ప్రతీ చోటా గట్టిగానే సాగుతోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీ దాకా, టీడీపీ నుంచి వైసీపీ దాకా ఈ పిలుపుతో అచ్చమైన రాజకీయాలే చేస్తున్నాయి. ఇపుడు విపక్షంలో చేరి సోలి సొక్కిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం చకోర పక్షిగా ఎదురుచూస్తోంది. ఈ నేపధ్యంలో టీడీపీ ఘర్ వాపసీ పిలుపు అందుకుంటోంది.

ఉత్తరాంధ్ర నుంచే…?

టీడీపీకి పట్టుకొమ్మ ఉత్తరాంధ్రా జిల్లాలు. ఈ జిల్లాల నుంచే పూర్వ వైభవం తీసుకురావాలని టీడీపీ ప్రయాస పడుతోంది. అందుకోసం తమను పార్టీని కాదని వైసీపీలో చేరిన తమ్ముళ్ళను సైకిలెక్కించేందుకు పసుపు పార్టీ విశ్వ ప్రయత్నమే చేస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కీలకమైన నేతలు టీడీపీని వీడి ఫ్యాన్ నీడకు చేరారు. ఎన్నికల ముందు వైసీపీ పవర్ లోకి వస్తుందని తెలిసిన తరువాత నాడే చాలా మంది నేతలు కండువా మార్చారు. ఇలా నేతలు అంతా వెళ్ళిపోవడం వల్ల టీడీపీ బాగా వీక్ అయిపోయింది. ఆ ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల నుంచి లోకల్ బాడీ ఎన్నికల దాకా పెను ప్రభావమే చూపించాయి. దాంతో తమ నేతలను వెనక్కి పిలవాలని టీడీపీ గట్టి నిర్ణయమే తీసుకుంది.

దారి తప్పిన తమ్ముడు…

తమ పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా వారు దారి తప్పినట్లేనని టీడీపీ అంటోంది. అలాంటి వారిని తిరిగి పార్టీలోకి తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదని కూడా చెబుతోంది. అధికార వైసీపీలో చేరి ఏ రకమైన పదవులు దక్కక కనీసం గుర్తింపునకు నోచుకోని తమ్ముళ్ళను తాము అక్కున చేర్చుకుంటామని టీడీపీ నేతలు చెబుతున్నారు. వారి కనుక రావాలనుకుంటే మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతామని కూడా చెబుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీని వీడి వెళ్ళిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలను ఘర్ వాపసీ ద్వారా తిరిగి పార్టీలోకి తెస్తామని తెలుగుదేశం నేతలు నిబ్బరంగా చెబుతున్నారు. వారికి టీడీపీలో ఉంటేనే గుర్తింపు గౌరవం అని కూడా అంటున్నారు.

అది ప్లస్సేనా…?

నిజానికి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఒక కర్మాగారంగా ఎపుడూ చెబుతారు. తమ పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోతే వందమందిని తయారుచేస్తామని కూడా ఆర్భాటంగా అంటారు. కానీ ఇపుడు ఘర్ వాపసీ పిలుపు ఎందుకు ఇవ్వాల్సి వస్తోంది అన్నదే చర్చ. అయితే కాలం మారింది. టీడీపీ కూడా గతంలో మాదిరిగా లేదు. ఒక నాయకుడు తయారు కావాలి అంటే చాలా టైమ్ పడుతుంది. ఎన్నికకూ ఎన్నికలు మధ్య ఉన్న అయిదేళ్ల వ్యవధిలో గట్టి నాయకులు రావడం అంటే కష్టమే. ఇక వైసీపీ టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో టీడీపీలో బలమైన నేతలు కూడా జారుతున్న వాతావరణం ఉంది. దాంతో గట్టిగా రెండున్నరేళ్ళు కూడా సమయం లేని వేళ సార్వత్రిక ఎన్నికల కోసం సరంజామా రెడీ చేసుకోవాలంటే పాత నాయకులే బెస్ట్ అని టీడీపీ నిర్ణయానికి వచ్చిందట. పైగా వివిధ సామజిక వర్గాల నాయకులను చేర్చుకుంటే టీడీపీ మళ్ళీ పూర్వస్థితికి వస్తుందని, గెలుపు ఆశలు ఉంటాయని కూడా భావిస్తోందిట. మరి చూడాలి టీడీపీ ఘర్ వాపసీ సక్సెస్ అవుతుందో లేదో.

Tags:    

Similar News