టీడీపీ నుంచి కాదు.. వైసీపీ నుంచే వ‌ల‌స‌లు….?

రాష్ట్రంలో 2019లో అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. టీడీపీ నుంచి నేత‌లు.. అధికార వైసీపీ వైపు మొగ్గు చూపిన విష‌యం తెలిసిందే. సీనియ‌ర్లు, జూనియ‌ర్లు.. భారీ సంఖ్యలో టీడీపీని [more]

Update: 2021-06-28 14:30 GMT

రాష్ట్రంలో 2019లో అధికారం కోల్పోయిన త‌ర్వాత‌.. టీడీపీ నుంచి నేత‌లు.. అధికార వైసీపీ వైపు మొగ్గు చూపిన విష‌యం తెలిసిందే. సీనియ‌ర్లు, జూనియ‌ర్లు.. భారీ సంఖ్యలో టీడీపీని విడిచి పెట్టారు. ఇక‌, టీడీపీ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు.. కూడా న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మ‌ద్దతుగా మారారు. ఇది ఇప్పటి వ‌ర‌కు తెలిసిందే. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన నేత‌లు కూడా ఓడిపోయారు. వైసీపీ వాళ్లు రెండేళ్లుగా త్వర‌లోనే టీడీపీ ఖాళీ అవుతుంద‌ని చెపుతూనే ఉన్నారు. అయితే.. టీడీపీ నేత‌లు ఆస‌క్తి క‌ర ప్రచారం చేస్తున్నారు. మా పార్టీ నుంచే ఇప్పటి వ‌రకు వ‌ల‌స‌లు ఉన్నాయ‌ని.. కానీ, త్వర‌లోనే వైసీపీ నుంచి కూడా వ‌ల‌స‌లు ఉంటాయ‌ని వారు అంటున్నారు.

అసంతృప్త నేతలు….

ఇక‌, ఇదే విష‌యాన్ని టీడీపీ అనుకూల మీడియా కూడా ప్రచారం చేస్తోంది. మ‌రి దీనిలో నిజ‌మెంత ? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ప్రస్తుతం వైసీపీలో చాలా మంది నేత‌లు.. ప‌నిలేకుండా ఖాళీగా ఉన్నార‌నేది వాస్తవం. గతంలో చంద్రబాబు పాల‌న సాగిన‌ప్పుడు ఓడిపోయిన నేత‌ల‌కు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. వారికి కాంట్రాక్టులు, ఇత‌ర ప‌నులు అప్పగించ‌డం ద్వారా సంతృప్తి ప‌రిచారు. కానీ, ఇప్పుడు వైసీపీలో ఆ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఓడిపోయిన వారు..సీనియ‌ర్లు అసంతృప్తితో ఉన్నారు. అంతెందుకు గెలిచిన వాళ్లలోనే చాలా మందికి ప్రయార్టీ లేద‌న్నదీ వాస్తవ‌మే..!

వీరంతా టీడీపీలో చేరతారా?

దీనికితోడు..గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంత మందిని పోటీ నుంచి స్వయంగా జ‌గ‌నే త‌ప్పించారు. వీరికి ప‌ద‌వులు ఇస్తామ‌ని.. పార్టీలో గుర్తింపు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వ‌ర‌కు చాలా మందిని ప‌క్కన పెట్టారు. ఇలాంటి వారు కూడా రుస‌రుస లాడుతున్న విష‌యం వాస్తవ‌మే. అయితే.. వీరంతా వైసీపీని వ‌దిలేస్తారా ? అనేది మాత్రం సందేహ‌మే. ఎందుకంటే.. టీడీపీలో నాయ‌క‌త్వ లోపం స్పష్టంగా క‌నిపిస్తోంది. చంద్రబాబు త‌ర్వాత ఎవ‌రు పార్టీని లీడ్ చేస్తారు? అనే విష‌యంలో క్లారిటీ లేదు.

బూమ్ కోసమేనా?

ఇక‌, లోకేష్‌పై ఇప్పుడున్న టీడీపీ నేత‌ల‌కే న‌మ్మకం లేదు. దీంతో వైసీపీలో అసంతృప్తి సెగ‌లు కక్కుతున్న నేత‌లు బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్థితి ఏర్పడింది. వారికి ఇష్టమైనా, క‌ష్టమైనా పార్టీలో ఉంటే క‌నీసం అధికార పార్టీలో ఉన్నామ‌ని చెప్పుకునేందుకు అయినా వీలుంటుంది. సో.. దీనిని బ‌ట్టి వైసీపీ నుంచి నేత‌ల వ‌ల‌స‌లు ఉంటాయ‌నే ప్రచారం కేవ‌లం బూమ్ కోస‌మే త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నదే వాస్త‌వం.

Tags:    

Similar News