ఏపీ టీడీపీపై తెలంగాణ ఎఫెక్ట్ ప‌డుతోందా..?

ఏపీలో అధికారం కోల్పోయినా.. టీడీపీ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగానే ఉంది. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జమే క‌నుక‌.. ఇప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకునే ప‌రిస్థితి ఉంది. [more]

Update: 2021-06-22 05:00 GMT

ఏపీలో అధికారం కోల్పోయినా.. టీడీపీ ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగానే ఉంది. ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జమే క‌నుక‌.. ఇప్పుడు కాక‌పోయినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పుంజుకునే ప‌రిస్థితి ఉంది. ఇది.. నిన్న మొన్నటి వ‌ర‌కు ఉన్న అంచ‌నా. అయితే.. రాను రాను.. ఏపీ టీడీపీపై తెలంగాణ టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాల ప్రభావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి ఈ ప‌రిస్థితి ఇలా.. రెండు మూడు రాష్ట్రాల్లో విస్తరించిన పార్టీలపై ఇటీవ‌ల కాలంలో క‌నిపిస్తూనే ఉంది.

ప్రాంతీయ పార్టీల్లో….?

రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీల‌కు.. ఏదైనా ఒక రాష్ట్రంలో ఎదురు దెబ్బత‌గిలితే.. ఆ ప్రభావం మిగిలిన రాష్ట్రాల్లోని పార్టీ నేత‌ల‌పై క‌నిపిస్తోంది. ఇదే త‌ర‌హాలో.. ఇప్పుడు తెలంగాణ‌లో టీడీపీ ఎదుర్కొంటున్న ఎదురు దెబ్బలు ఏపీలో పార్టీపై ప‌డుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. తెలంగాణ‌లోనూ పుంజుకునేందుకు కుదిరితే అధికారంలోకి కూడా వ‌చ్చేందుకు చంద్రబాబు ప్ర‌య‌త్నించారు. అయితే.. త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో చంద్రబాబు పూర్తిగా ఏపీలో సెటిల్ అయిపోవ‌డం.. తెలంగాణ పార్టీపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించ‌క‌పోవ‌డంతో పార్టీ క‌కావిక‌లం అయిపోయింది.

ఒక్కొక్కరూ వెళ్లిపోతుండటంతో…?

ఇటీవ‌ల కాలంగా పార్టీ నేత‌లు ఒక్కొక్కరుగా బై చెబుతున్నారు. అధికార పార్టీలో చేరిపోతున్నారు. ఇక‌, ఇప్పుడు టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. ర‌మ‌ణ కూడా మారిపోతున్నార‌ని తెలుస్తోంది. అంటే.. చంద్రబాబు ఇలాంటి నేత‌ల విష‌యంలో చేతులు ఎత్తేశార‌ని.. పార్టీని కాపాడుకోలేక పోతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. దీంతో ఏపీలో నేత‌లు కూడా టీడీపీ పై ఒక‌విధ‌మైన ఆందోళ‌న‌తో ఉన్నారు. తెలంగాణ‌లో ఇప్పటికీ పార్టీ ప‌ట్ల కొన్ని వ‌ర్గాల్లో సానుభూతి ఉంది. బ‌ల‌మైన కేడ‌ర్ ఉన్నా … నాయ‌కులు లేక‌పోవ‌డం మైన‌స్‌. దీంతో నాయ‌కులు ఒక్కొక్కరు బ‌య‌ట‌కు వెళ్లిపోతుండ‌డంతో పార్టీ బ‌తుకుతుంద‌న్న ఆశ‌లు పోయాయి. ఇదే ప‌రిస్థితి ఏపీలోనూ వ‌స్తుందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

సీనియర్లు మాత్రం….?

కానీ, ఏపీలో అంత ప‌రిస్థితి రాద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. కానీ, ప్రభావం మాత్రం ఉంటుంద‌ని.. చంద్రబాబు ఇమేజ్‌కు ఇది పెను విఘాతంగా మారుతుంద‌ని.. ఆయ‌న తెలంగాణ‌లోనూ టీడీపీని బ‌లోపేతంచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు. కానీ, ఇప్పటి వ‌ర‌కు తెలంగాణ టీడీపీలో జ‌రుగుతున్న ప‌రిణామాలపై అటు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ కానీ.. పెద‌వి విప్పక‌పోవ‌డంతో ఏపీలో నేత‌లు త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News