తమ్ముళ్లకు టీడీపీ హెచ్చరిక…?

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు జమానాలో మాత్రం కాంగ్రెస్ కల్చర్ బాగానే వచ్చేసింది. ఎందుకంటే చంద్రబాబుది కూడా ముప్పయి శాతం [more]

Update: 2021-08-09 09:30 GMT

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు జమానాలో మాత్రం కాంగ్రెస్ కల్చర్ బాగానే వచ్చేసింది. ఎందుకంటే చంద్రబాబుది కూడా ముప్పయి శాతం కాంగ్రెస్ రక్తం కాబట్టి. ఇక టీడీపీలో అయారాం గయారాం అంటూ వచ్చే వారూ పోయేవారు చంద్రబాబు పాతికేళ్ల అధ్యక్ష ప్రస్థానంలో చాలా మంది ఉన్నారు. ఇక 2019 ఎన్నికల తరువాత కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్ళినా కూడా ఆ పార్టీ నుంచి పెద్దగా యాక్షన్ లేదు. కానీ విశాఖ కార్పోరేషన్ లో కొందరు టీడీపీ కార్పోరేటర్లు దారి తప్పారంటూ తాజాగా ఆ పార్టీ కొరడా ఝలిపించడం మాత్రం విశేష పరిణామంగానే చెప్పుకోవాలి.

షోకాజ్ తోనే సరా..?

ముగ్గురు టీడీపీ కార్పోరేటర్లు పార్టీ లైన్ దాటారు అంటూ విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు తాజాగా వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సరైన జవాబు చెప్పకపోతే పార్టీ నుంచి ఏకంగా బహిష్కరిస్తామని కూడా హెచ్చరించారు. అలా నోటీసులు అందుకున్న వారిలో కాకి గోవిందరెడ్డి, లేళ్ల కోటేశ్వరరావు, పూర్ణిమ అనే కార్పోరేటర్లు ఉన్నారు. మరి వీరు వైసీపీని తెగ పొగుడుతున్నారు. వారితో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. అధికార పార్టీతో ఉంటేనే తమ పనులు అవుతాయని నమ్మి అలా తెలివిగా నడచుకుంటున్నారు. ఇపుడు టీడీపీ కొరడా ఝలిపిస్తే వీరు వెన‌క్కు తగ్గుతారా అన్నది చూడాలి.

ఇంకా ఉన్నారుటగా…?

ఈ మధ్యన జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీ 30 వార్డుల దాకా గెలుచుకుంది. అందులో పది శాతం అంటే ముగ్గురు కార్పోరేటర్లు తోక జాడించారు. కానీ ఇంకా మరో పది మంది దాకా వైసీపీ వైపు చూస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. అందుకే ముగ్గురి మీద కఠిన చర్యలు తీసుకుంటే పోయే వారు ఆగుతారు అన్నదేదో టీడీపీ పెద్దల ఎత్తుగడగా ఉందని అంటున్నారు. కానీ ఈ రోజున ఎంపీలు, ఎమెల్యేలు కూడా పార్టీని వీడిపోతున్న వేళ మిగిలిన వారు ఈ షోకాజ్ నోటీసులకు ఆగుతారా అన్నది కూడా చూడాలి. పైగా అయిదేళ్ళ పాటు తమ వార్డులలో పనులు కావాలన్నది వారి వాదన. మొత్తానికి టీడీపీ పెద్దలు ధైర్యం చేశారని, కొందరి మీద అయినా యాక్షన్ ఉంటుందని చెబుతున్నారు.

వీరే దిక్కుగా ?

ఇక ఎంత కాదనుకున్నా విశాఖ సిటీలో టీడీపీ బలంగా ఉంది. అటువంటి చోట కార్పోరేటర్లు తోక జాడిస్తే రానున్న రోజులలో జరిగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవనే ఈ రకంగా యాక్షన్ కి దిగారు అంటున్నారు. అయితే టీడీపీ గెలుస్తుందని ఆశ ఉంటే వారు పార్టీలోనే ఉంటారు తప్ప ఇలా హెచ్చరికలు పంపించినా ఆగుతారా అని సొంత పార్టీలోనే వేదాంతం వల్లిస్తున్న వారూ ఉన్నారు. టీడీపీ యాక్షన్ తీసుకోవాలి అంటే ముందు పెద్ద నాయకులు, ఎమ్మెల్యేల మీద తీసుకుని తమ దాకా వస్తే బాగుంటుంది అంటున్నారు కొందరు. ఏది ఏమైనా విశాఖ టీడీపీలో రాజకీయ తుఫాన్ ని క్రియేట్ చేసిన ఘనత మాత్రం అచ్చంగా వైసీపీదే అంటున్నారు.

Tags:    

Similar News