సీనియర్లకు ఇక సీన్ ఛేంజ్ అవుతుందట.. ?

టీడీపీలో ఇపుడు పెద్ద చర్చ జరుగుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వారికి ఇకపైన చోటు లేదా అంటే అదే నిజం అని కూడా అంటున్నారు. సీనియర్లు [more]

Update: 2021-09-04 00:30 GMT

టీడీపీలో ఇపుడు పెద్ద చర్చ జరుగుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వారికి ఇకపైన చోటు లేదా అంటే అదే నిజం అని కూడా అంటున్నారు. సీనియర్లు ఎన్ని సార్లు అయినా పోటీకి రెడీ అనే అంటారు. ఇది రాజకీయం. ఎవరూ కావాలని కుర్చీ వద్దు అనుకోరు. అలా చంద్రబాబు సీనియర్లకు పదే పదే టికెట్లు ఇచ్చారు. జనాలు కూడా చూసిన ముఖాలకే ఓట్లేస్తూ వచ్చారు. అయితే వైసీపీ ఎంట్రీతో ఏపీలో కొత్త రాజకీయం స్టార్ట్ అయింది. వైసీపీలో కొత్త వారు యువత పెద్ద ఎత్తున వచ్చారు. ముక్కూ ముఖం తెలియని వారు కూడా అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. మరి టీడీపీలో చూస్తే సీన్ రివర్స్ గా ఉంది.

కొత్త రక్తంతో…

పల్లకిని మోసిన వారు బోయీలుగానే ఎప్పటికీ ఉండిపోయారు. టీడీపీ నాలుగు దశాబ్దాల చరిత్ర చూస్తే ఎపుడో ఎన్టీయార్ తప్ప కొత్తదనాన్ని ప్రోత్సహించిన సందర్భం అయితే చంద్రబాబు జమానాలో లేదు. ఆయన 1999లో తటస్థులకు టికెట్లు కొన్ని ఇచ్చారు. కానీ వారు ఎవరూ సరిగ్గా రాణించలేకపోయారు. అదే సమయంలో ఒక తటస్థుడిని మంత్రిగా చేసి కేసీయార్ సీటుకు ఎసరు పెట్టిన పాపానికి ఏకంగా తెలంగాణానే టీడీపీ వదులుకోవాల్సి వచ్చింది. దాంతో చంద్రబాబు ఈ రిస్క్ కి ఎపుడు రెడీ కారు అంటారు. కానీ ఇపుడు వైసీపీ పుణ్యమాని అనివార్యంగా ఉంది. మరి దాంతో సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో గట్టి ఝలక్ తగలడం ఖామేనంటున్నారు.

హీరోలాగానేనా…?

ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత, నోరున్న నాయకుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. దాంతో ఆయనే సాహసించి అధినాయకత్వాన్ని ధిక్కరించారని అంటున్నారు. ఇక బుచ్చయ్యచౌదరి మౌనంగా ఉన్నా ఆయనకు దక్కేది ఏదీ లేదు. అందుకే ఆయన తెగించి బయటకు వచ్చి హీరోగా మారాలి అనుకుంటున్నారు అన్నదే విశ్లేషణ. ఆయన వారసుడికి టికెట్ ఇవ్వడానికి కూడా టీడీపీ హై కమాండ్ ససేమిరా అనడంతో ఆయన తిరుగుబాటు జెండాను ఎగరేశారు అని చెబుతున్నారు. సరే గోరంట్లకు దీనికి మించి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఆయన బాబుని ఎదిరించడం ద్వారా టీడీపీలో సీనియర్ల పుట్టె మునిగిపోతోంది అని గోరంట్ల బయట ప్రపంచానికి చెప్పేశారు.

వాళ్ళే సేఫ్…

అయితే అందరు సీనియర్లకు టీడీపీ ఝలక్ ఇస్తుందా అంటే కాదు అనే చెప్పాలి. కొంతమంది కీలకమైన సీనియర్ల వారసులకు టికెట్ ఇవ్వడం ద్వారా స్వాంతన కలిగిస్తుంది. అలాగని మొత్తానికి మొత్తం 175 నియోజకవర్గాలలో ఇలాగే ఇచ్చుకుంటూ పోతే ఆ కొన్ని కుటుంబాలే ఎపుడూ ఏలుతాయి. కాబట్టి ఒక పది శాతం మాత్రమే అలాంటి సర్దుబాట్లు ఉంటాయట. మిగిలినవి మాత్రం పూర్తిగా కొత్త రక్తానికే పంచుతారుట. ఇక టీడీపీలో ఈసారి టికెట్ల పంపిణీలో పూర్తిగా లోకేష్ జోక్యం ఉంటుంది అంటున్నారు. దాంతోనే సీనియర్లకు దెబ్బ పడిపోతోంది అని చెబుతున్నారు. మొత్తానికి శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే అనంతపురం దాకా ఈసారి సీనియర్లు పోటీకి దూరంగా ఉండాల్సిందే అన్న సందేశం చేరిపోతోంది. ఈ స్థితిలో పార్టీకి రాజీనామా చేసి హీరోలు అవుతారా. రాజీపడి జీరోలుగా ఉంటారా అన్నది ఎవరికి వాళ్ళే తేల్చుకోవాలి. కానీ వయసు మళ్ళిన వాళ్ళకు కూడా గోరంట్ల కొత్త ధైర్యం మాత్రం నూరిపోశాడు అనే చెప్పాలి.

Tags:    

Similar News