టీడీపీ సానుభూతి గేమ్‌.. అక్కడ పోటీకి దూర‌మేనా..?

రాజ‌కీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం మ‌రొక‌టి ఉండ‌దు. ఎక్కడ సానుభూతి ఉంటుందో అక్కడ నేత‌లు వాలిపోతుంటారు కూడా. ఇప్పుడు.. టీడీపీ వ్యూహం కూడా అదేవిధంగా ఉంద‌ని అంటున్నారు [more]

Update: 2021-07-06 06:30 GMT

రాజ‌కీయాల్లో సానుభూతిని మించిన అస్త్రం మ‌రొక‌టి ఉండ‌దు. ఎక్కడ సానుభూతి ఉంటుందో అక్కడ నేత‌లు వాలిపోతుంటారు కూడా. ఇప్పుడు.. టీడీపీ వ్యూహం కూడా అదేవిధంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పటికే ఒక ఉపఎన్నిక‌లో పోటీ చేసి చేతులు కాల్చుకున్న టీడీపీ.. ఈ త‌ప్పు జ‌ర‌గ‌కుండా చూసుకునేందుకు, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌పై పైచేయిసాధించేందుకు సానుభూతిని అస్త్రంగా మ‌లుచుకోవాల‌ని నిర్ణయించుకున్నట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిజానికి టీడీపీ పునాదులు కూడా సానుభూతిపైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. పార్టీ అధినేత చంద్రబాబు సానుభూతిని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం తెలిసిందే.

దూరంగా ఉండాలని…

విష‌యంలోకి వెళ్తే.. క‌డ‌ప జిల్లాలోని బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి త్వర‌లోనే ఉప ఎన్నిక రానుంది. ఇక్కడ నుంచి గెలిచిన జీ. వెంక‌ట సుబ్బయ్య హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. నిజానికి సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డం.. వైసీపీ ఇక్కడ బ‌లంగా ఉండ‌డంతో.. గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసింది. అయితే.. బ‌ద్వేల్‌లో ఎమ్మెల్యే హ‌ఠాన్మర‌ణంతో ఇక్కడ త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక నిర్వహించ‌నున్నారు. ఈ ఎన్నిక‌ల‌కు టీడీపీ దూరంగా ఉండాల‌ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనికి రెండు కీల‌క కార‌ణాలు ఉన్నాయి. ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి.. ఓబులాపురం రాజ‌శేఖ‌ర్‌.. పార్టీకి దూరంగా ఉన్నారు.

స్థానిక ఎన్నికల్లోనూ….

దీంతో ఇక్కడ పార్టీ పుంజుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అదేస‌మ‌యంలో ఇక్కడ నుంచి పోటీకి ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ కూడా యాక్టివ్‌గా లేరు. తిరుప‌తి ఉప ఎన్నిక‌లో టీడీపీకి ఎదురైన ఘోర ప‌రాభ‌వం త‌ర్వాత‌.. జ‌గ‌న్ దూకుడును చూస్తున్న వారు పోటీ చేసి జేబులు ఖాళీ చేసుకోవ‌డం ఎందుకులే అని నిర్లిప్తంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇటీవల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో బ‌ద్వేల్ లో పోరుమామిళ్ల మేజ‌ర్ పంచాయ‌తిని గెలుచుకోవ‌డం మిన‌హా టీడీపీ ఎక్కడా ప్రభావం చూప‌లేదు. దీంతో ఇప్పుడు మ‌రో రెండున్నరేళ్ల కోసం..ఇక్కడ సాహ‌సం చేయ‌డం క‌న్నా.. ఇక్కడ పోటీకి దూరంగా ఉండి.. సానుభూతిని ఖాతాలో వేసుకుంటే మంచిద‌ని.. టీడీపీలో నేత‌లు నిర్ణయానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

అందుకే పోటీకి…..

క‌డ‌ప వంటి కీల‌క‌మైన జిల్లాలో టీడీపీ ఎద‌గాల‌ని ప్రయ‌త్నించినా.. అది సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు సానుభూతిని అస్త్రంగా చేసుకుని.. వెంక‌ట‌సుబ్బయ్య ప్రజా వైద్యుడ‌ని.. ఆయ‌న మ‌ర‌ణం త‌మ‌ను కూడా క‌లిచి వేసింద‌ని.. ఇలాంటి చోట పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణయించామ‌ని ప్రజ‌ల‌కు వివ‌రించే ప్లాన్‌లో టీడీపీ ఉంది. టీడీపీ ఎంత మంచి నిర్ణయం తీసుకుంది! అనే భావ‌న‌ను ప్రజ‌ల్లోకి తీసుకువెళ్లి.. సానుభూతిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయ‌త్నించ‌నున్నారు. ప్రస్తుతానికి టీడీపీ వ్యూహం అయితే.. ఇదే. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News