అక్కడ టీడీపీ ఒంట‌రైపోయిందే.. కోలుకోవ‌డం క‌ష్టమే ?

2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బ‌ల‌హీన ప‌డిందేనేది వాస్తవం. పార్టీకి ప‌ట్టున్న జిల్లాల్లోనూ టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది. కీల‌క నేత‌లు [more]

Update: 2021-06-21 06:30 GMT

2019 ఎన్నిక‌ల త‌ర్వాత రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ బ‌ల‌హీన ప‌డిందేనేది వాస్తవం. పార్టీకి ప‌ట్టున్న జిల్లాల్లోనూ టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోలేక పోయింది. కీల‌క నేత‌లు వైసీపీ హ‌వా ముందు నిల‌వలేక ఓడిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పుంజుకునేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ ప‌రిణామాలు ఇలా ఉంటే ప‌లు కీల‌క జిల్లాలు, కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ స‌ర్వనాశ‌నం అవ్వడంతో పాటు ఇప్పట్లో కోలుకునే ప‌రిస్థితి లేదు. ఇందుకు అనేకానేక కార‌ణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కేంద్రం ఏలూరులో టీడీపీ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది.

బడేటి బుజ్జి మరణంతో…?

గ‌త ఎన్నిక‌ల్లో ఏలూరు ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన ఇద్దరు కీల‌క నాయ‌కులు ఓడిపోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన బ‌డేటి కోట రామారావు అనారోగ్యం కార‌ణంగా 2019లో మృతి చెందారు. దీంతో ఇక్కడ టీడీపీలో నేత‌ల లేమి స్పష్టంగా క‌నిపిస్తోంది. బ‌డేటి సోద‌రుడు రాధాకృష్ణ ( చంటి) కి ఏలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు అప్పగించారు. అన్న సానుభూతితో మాత్రమే రాజ‌కీయంగా ముందుకు వెళ్లాల‌న్న ఆతృత చంటిలో ఉందే త‌ప్పా.. బుజ్జి అంత దూకుడు, ఛ‌రిష్మా ఆయ‌న‌లో లేక‌పోవ‌డంతో కేడ‌ర్‌తో కూడా మ‌మేకం కాలేక‌పోతున్నారు.

మాగంటి కుటుంబంలో…?

ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిని ఢీ కొట్టాలంటే చంటి దూకుడు పెంచాల్సి ఉంద‌న్నది టీడీపీ వాళ్ల అభిప్రాయం. ఇక‌, ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన‌.. మాగంటి బాబు.. గ‌త ఎన్నిక‌ల్లోనే పోటీకి విముఖ‌త చూపారు. త‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. ఆయ‌న చంద్రబాబుకు విన్నవించారు. ఈ క్రమంలో త‌న‌కుమారుడికి అవ‌కాశం ఇవ్వాల‌న్నారు. అయితే.. అప్పటి ప‌రిస్థితుల్లో పార్టీ అధినేత‌ చంద్రబాబు.. మాగంటి బాబుకు మాత్రమే అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, ఇప్పుడు మాగంటి కుటుంబంలో నెల‌కొన్న విషాదం.. ఆయ‌న ఇద్దరు కుమారులు మ‌ర‌ణించ‌డంతో ఏలూరు పార్లమెంటు స్థానంలోనూ నాయ‌కులు లేకుండా పోయారు.

బలమైన నేతలు లేక..?

పైగా మాగంటి బాబు ఇక‌, పూర్తిగా రాజ‌కీయాలకు దూర‌మైపోయిన‌ట్టే..! ఈ పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంలో రెండున్నర ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేస్తోన్న మాగంటి రాజ‌కీయాల‌కు దూరం కావ‌డం టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బే. చంద్రబాబు ఈ రెండు స్థానాల్లో స‌మ‌ర్థులు అయిన నేత‌ల కోసం యేడాది కాలంగా అన్వేష‌ణ చేస్తున్నా ఎవ్వరూ ముందుకు రావ‌డం లేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ప్రస్తుతం టీడీపీని న‌డిపించే బ‌ల‌మైన నేత‌ల‌ను కూడా వెత‌క‌లేక‌పోతే ఇక్కడ టీడీపీ భ‌విష్యత్తులో గెలుపు మాట అటుంచి.. క‌నీసం పోటీ ఇస్తుంద‌న్న ఆశ కూడా వ‌దులు కోవాల్సిందే.

Tags:    

Similar News