టీడీపీకి ఇక్కడ నేతలే లేరటగా?

కృష్ణా జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నూజివీడులో ప్రధాన ప్రతిప‌క్షం దీనావ‌స్థలో ఉంది. జిల్లాలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోల్చుకుంటే.. ఇక్కడ ప్రతిప‌క్ష నేత‌లు నిద్రపోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి [more]

Update: 2021-06-01 14:30 GMT

కృష్ణా జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నూజివీడులో ప్రధాన ప్రతిప‌క్షం దీనావ‌స్థలో ఉంది. జిల్లాలోని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌తో పోల్చుకుంటే.. ఇక్కడ ప్రతిప‌క్ష నేత‌లు నిద్రపోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. టీడీపీకి ఒక‌ప్పుడు కంచుకోట‌గా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త రెండు ద‌శాబ్దాలుగా పార్టీకి స‌రైన నాథుడే లేకుండా పోయాడు. అప్పుడెప్పుడో సీనియ‌ర్ నేత కోట‌గిరి హ‌నుమంత‌రావు వ‌రుస విజ‌యాలు సాధించ‌డం మిన‌హా త‌ర్వాత నూజివీడులో టీడీపీని ఇక్కడ ముందుండి న‌డిపించే నేత పార్టీకి దొర‌క‌ని ప‌రిస్థితి. 2009లో ప్రజారాజ్యం వ‌ల‌స నేత చిన్నం రామ‌కోట‌య్య పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నా ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఎలాంటి ఉప‌యోగం లేదు స‌రిక‌దా ? 2014 ఎన్నిక‌ల నాటికే ఆయ‌న పార్టీ మారిపోయారు.

అనారోగ్య కారణాలతో…?

ఇక్కడ టీడీపీ వ‌రుస‌గా రెండు సార్లు ఓట‌మి పాలైంది. మ‌రోవైపు కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన మేకా ప్రతాప్ అప్పారావు.. వైసీపీలోకి చేరి .. 2014, 2019 ఎన్నిక‌ల్లో వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. ఇక‌, ఈ రెండు ఎన్నిక‌ల్లోనూ ముద్దర‌బోయిన వెంక‌టేశ్వర‌రావు టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన‌ప్పటికీ.. గ‌ట్టిపోటీ ఇచ్చినా.. గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి చూస్తే.. ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు.. అనారోగ్యం కార‌ణంగా అంత యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. కుల స‌మీక‌ర‌ణ‌ల్లో మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌ల ప‌ల్లకీలో ఉండ‌డం మిన‌హా ఆయ‌న చేసేదేం లేదు.

పార్టీ కార్యక్రమాల నిర్వహణకు..?

ఈ స‌మయంలో టీడీపీ పుంజుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. ఎమ్మెల్యే కుమారుడు చంటినాయ‌న క‌నుస‌న్నల్లో కార్యక్రమాలు న‌డుస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రతాప్ తిరిగి పోటీ చేసే అవ‌కాశాలు కూడా లేవు. వైసీపీలో ఉన్న ఈ నాయ‌క‌త్వ లేమిని క్యాష్ చేసుకుని టీడీపీ పుంజుకునేందుకు అనేక అవ‌కాశాలు ఉన్నప్పటికీ.. ఎవ‌రికివారు సైలెంట్ అవుతున్నారు. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తామోలేదో.. అనే దిగులు కూడా వీరిలో క‌నిపిస్తోంది. వీట‌న్నింటికీ తోడు.. పార్టీ కార్యక్రమాల నిర్వహ‌ణ‌కు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టడం ఎందుకు దండ‌గ అన్న నాయ‌క‌త్వం పార్టీ నేత‌ల్లో ఉంది.

కొత్త నేత అవసరమని?

ఇక నియోజ‌క‌వ‌ర్గానికి నాన్ లోక‌ల్ అయిన ముద్దర‌బోయిన వెంక‌టేశ్వర‌రావు వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోయారు. గ‌తంలో గ‌న్నవ‌రంలో ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచిన ముద్దర‌బోయిన నాయ‌క‌త్వాన్ని టీడీపీలోనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ప‌రిస్థితి.. ఇప్పుడూ అంతే. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నూజివీడు టీడీపీ నాయ‌క‌త్వం మారుతుందా ? చంద్రబాబు ఇక్కడ పార్టీ ప‌టిష్టత‌కు ఎలాంటి చికిత్స చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News