ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద… ?

నిజమైన జంపింగ్ జఫాంగులు అంటే కాకులే అని చెప్పాలి. ఏ ఇంటి కాడ కూడు దొరుకుతుందో అక్కడికి ఎగురుకుంటూ చేరిపోతాయి. రాజకీయాల్లోనూ ఇదే థియరీని ఇపుడు చాలామంది [more]

Update: 2021-06-09 00:30 GMT

నిజమైన జంపింగ్ జఫాంగులు అంటే కాకులే అని చెప్పాలి. ఏ ఇంటి కాడ కూడు దొరుకుతుందో అక్కడికి ఎగురుకుంటూ చేరిపోతాయి. రాజకీయాల్లోనూ ఇదే థియరీని ఇపుడు చాలామంది నాయకులు అమలు చేస్తున్నారు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడికే మకాం మొత్తం ఎత్తేయడమే వారి రాజనీతి. అదిపుడు తప్పు కూడా కాదు. ఒక రకంగా రాజకీయ గడుసుతనం, నేర్పరితనంగా కూడా చెప్పుకుంటున్నారు. విశాఖ సిటీలో మొత్తానికి పట్టు సంపాదించిన వైసీపీ టీడీపీని అక్కడ వీలైనంతవరకూ కుదేల్ చేయాలని చూస్తోంది. దాంతో అందివచ్చిన వారికి కండువాలు కప్పే కార్యక్రమం వైసీపీ నిరంతరాయంగా చేస్తోంది.

ఆయనతో అలా…?

విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో బలమైన నాయకుడిగా ఉన్న కాకి గోవిందరెడ్డి ఇపుడు పక్క చూపులు చూస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. ఆయన ఈ మధ్య జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున నిలిచి గెలిచారు. టీడీపీ మేయర్ అభ్యర్ధుల రేసులో ఆయన పేరు కూడా వినిపించింది. ఇక చంద్రబాబు టైమ్ లో ఆయన ఓబీసీ కార్పోరేషన్ చైర్మన్ గా పనిచేశారు. గాజువాకలో స్ట్రాంగ్ లీడర్ గా ఉన్న కాకి గోవర్ధనరెడ్డి ఇపుడు అర్జంటుగా సైకిల్ దిగిపోవాలని చూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జపం చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో తమ్ముళ్ళను కూడా వైసీపీ చేసే మంచి పనులకు మద్దతుగా నిలవాలంటూ కోరడమూ విశేషమే.

అదే ఆలస్యం…?

ఈ మధ్య వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గాజువాకలో మూడువందల పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. దాని మీద కాకి గోవిందరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. అంతే కాదు విశాఖలోని ముడసర్లోవ వద్ద అద్భుతమైన పార్కుని ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రతిపాదిస్తే దాని మీద ఆదికి ముందే ఈ టీడీపీ కార్పోరేటర్ బేషరతుగా మద్దతు ఇచ్చేశారు. ఇక గాజువాకలో టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు కూడా ఆయన గైర్ హాజర్ కావడంతో ఆయన రూట్ వైసీపీ వైపే అని క్లారిటీ వచ్చేసిందట. మంచి ముహూర్తం చూసుకుని వైసీపీ కండువా కప్పుకోవడమే ఆలస్యం అన్నట్లుగా కాకి వైఖరి ఉందని అంటున్నారు.

మరింత మందితో…?

విశాఖలో 30 మంది దాకా కార్పోరేటర్లను టీడీపీ గెలుచుకుంది. అయితే అందులో 28వ వార్డు కార్పోరేటర్ వానపల్లి రవికుమార్ కరోనాతో చనిపోయారు. అక్కడ ఉప ఎన్నిక జరిగితే కచ్చితంగా వైసీపీ గెలిచేలా సీన్ ఉంది. ఇపుడు కాకి గోవింద రెడ్డి ఫ్యాన్ నీడకు చేరుతున్నారు. ఇదే వరసలో మరింతమంది టీడీపీ కార్పొరేటర్లు కూడా వైసీపీకి టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. లక్షలు ఖర్చు పెట్టి గెలిచిన తరువాత కూడా వార్డుల్లో పనులు జరగకపోతే ఎందుకు ఈ పదవి అని తమ్ముళ్ళు పెదవి విరుస్తున్నారు. అంతే కాకుండా సిటీలో వైసీపీ ప్రభావం గట్టిగా ఉంది. అదే టైమ్ లో నేనున్నాను అంటూ ధైర్యం చెప్పే తమ్ముళ్ళు కూడా టీడీపీలో లేరు. ఇక ఏపీవ్యాప్తంగా చూసినా టీడీపీకి ఆశాజనకమైన వాతావరణం లేదు. దాంతో అధికారంలో ఉన్నదే మన పార్టీ అనుకుంటూ చాలా మంది తమ్ముళ్ళు గోడ దూకడానికి రెడీగా ఉన్నారని టాక్. అదే జరిగితే విశాఖ కార్పోరేషన్ లో టీడీపీకి తొందరలోనే అతి పెద్ద దెబ్బ పడిపోవడం ఖాయమని అంటున్నారు.

Tags:    

Similar News