ప‌శ్చిమ‌లో సైకిల్ తొక్కేవాళ్లేరి ?

ఏపీలో టీడీపీ కాస్త బలంగా ఉండే జిల్లాల్లో గోదావ‌రి జిల్లాలు ఒక‌టి. ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక కూడా గోదారోళ్ల తీర్పు ఎటు ఉంటే [more]

Update: 2021-06-03 06:30 GMT

ఏపీలో టీడీపీ కాస్త బలంగా ఉండే జిల్లాల్లో గోదావ‌రి జిల్లాలు ఒక‌టి. ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగాక కూడా గోదారోళ్ల తీర్పు ఎటు ఉంటే రాష్ట్రంలో తీర్పు కూడా అటు వైపే ఉంటుంద‌న్న నానుడి ఉంది. ఆ నానుడి గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా నిజం అవుతూనే వ‌స్తోంది. కీల‌క‌మైన ప‌శ్చిమ గోదావ‌రి టీడీపీకి బ‌ల‌మైన జిల్లాల్లో ఒక‌టి. పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో మందిని కీల‌క ప‌ద‌వుల్లో కూర్చోపెట్టిన ఈ జిల్లాలో ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాలు సైకిల్‌కు కంచుకోట‌లుగా ఉన్నాయి. అలాంటి కంచుకోట‌లు అన్ని గ‌త ఎన్నిక‌ల్లో కూలిపోయాయి. టీడీపీ కేవ‌లం పాల‌కొల్లు, ఉండి సీట్లతో మాత్రమే స‌రిపెట్టుకుంది. మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఫ్యాన్ పార్టీయే పాగా వేసింది.

ఇన్ చార్జులు లేక…?

ఎంత పార్టీ ఒక్కసారి ఓడిపోతే మాత్రం బ‌ల‌మైన నేత‌లు అనే వారు లేకుండా పోరు. అయితే ప‌శ్చిమ గోదావ‌రిలో అందుకు భిన్నమైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. పార్టీ ఒక్కసారి ఓడిపోయిందో లేదో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో నేతలు పూర్తిగా కాడి కింద ప‌డేశారు. జిల్లాలో 15 నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌లు లేని దుస్థితి. చింత‌ల‌పూడి, కొవ్వూరు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌చార్జ్‌లు లేరు. భీమ‌వ‌రంలో కొత్త ఇన్‌చార్జ్ వెతుకులాట‌లో పార్టీకి ఎవ్వరూ దొర‌క‌ని ప‌రిస్థితి. న‌ర‌సాపురంలో ఉన్న ఇన్‌చార్జ్ మాధ‌వ‌నాయుడు అస‌లు అక్కడ పార్టీని మూడో స్థానంలో ఉంచేస్తారా ? కనీసం రెండో స్థానానికి అయినా తీసుకు వ‌స్తారా ? అన్న డౌట్లు పార్టీ నేత‌ల‌కే ఉన్నాయి.

ఆ కసి ఏదీ?

ఏలూరులో మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి హ‌ఠాన్మర‌ణంతో ఆయ‌న సోద‌రుడు చంటికి బాధ్యత‌లు అప్పగించినా ఆయ‌న మంత్రి ఆళ్ల నానిని ఎంత వ‌ర‌కు ఢీకొటి పార్టీని నిల‌బెడ‌తారో చెప్పలేని ప‌రిస్థితి. మెట్ట ప్రాంతంలో చింత‌ల‌పూడి, పోల‌వ‌రం రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్లలో టీడీపీ ప‌రిస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారిపోతోంది. ఉన్నంత‌లో ఏలూరు పార్లమెంట‌రీ పార్టీ అధ్యక్షులు, ఉంగుటూరు క‌న్వీన‌ర్ గ‌న్ని వీరాంజ‌నేయులు మాత్రం త‌న వ‌ర‌కు బాగా క‌ష్టప‌డుతున్నారు. ఆ క‌సి మిగిలిన నేత‌ల్లో కొర‌వ‌డింది. ఇక కొవ్వూరుకు గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి ఇన్‌చార్జ్ లేరు. అక్కడ ప‌గ్గాలు కోరుతోన్న మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌ను తిరువూరు ఇన్‌చార్జ్‌గానే కంటిన్యూ చేస్తున్నారు. బాబు స్థానిక కేడ‌ర్‌కు భ‌య‌ప‌డుతున్నారా ? అన్న సందేహం క‌లుగుతోంది.

అడపా దడపా…?

ఆచంట‌లో మాజీ మంత్రి పితాని పార్టీలో ఉండ‌నా ? వెళ్లనా ? అనే మీమాంస‌లో ఉన్నారు. ఉన్నంత‌లో పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్థానికంగానే స్టైట్ వైడ్‌గాను గ‌ట్టి పోటీ ఇస్తున్నారు. త‌ణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధా యాక్టివ్‌గానే ఉన్నారు. తాడేప‌ల్లిగూడెంలో కొత్త ఇన్‌చార్జ్ వ‌ల‌వ‌ల బాబ్జీ జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని స్థానిక ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు రాబ‌ట్టి అంద‌రికి షాక్ ఇచ్చారు. దెందులూరులో ప్రభాక‌ర్ గ‌తంలో ఉన్నంత యాక్టివ్‌గా అయితే లేరు. కేసుల భ‌యంతోనే ఆయ‌న స్లో అవుతోన్న ప‌రిస్థితి ఉందంటున్నారు. ఉండిలో టీడీపీ కి ఎమ్మెల్యే ఉన్నా, మాజీ ఎమ్మెల్యే శివ ఉన్నా కూడా కేడ‌ర్లో జోష్ లేదు. గోపాల‌పురంలో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వర‌రావు అడ‌పా ద‌డ‌పా కార్యక్రమాలు చేయ‌డం మిన‌హా పార్టీకి కంచుకోట అయిన ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌తంలో స్థాయి ఊపు తీసుకు రాలేక‌పోతున్నారు. మ‌రి ఇలాంటి నేత‌ల‌తో ప‌శ్చిమ‌లో టీడీపీ ని చంద్రబాబు ఏ తీరాల‌కు చేరుస్తారో ? కాల‌మే నిర్ణయించాలి.

Tags:    

Similar News