టీడీపీ ఫర్ … అవుట్ సోర్సింగ్ ?

తెలుగుదేశం పార్టీ ఘనమైనది. నాలుగు పదుల వయసు కలిగినది. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అలాగే నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో [more]

Update: 2021-06-12 14:30 GMT

తెలుగుదేశం పార్టీ ఘనమైనది. నాలుగు పదుల వయసు కలిగినది. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. అలాగే నాయకులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో తెలుగుదేశం అధినాయకత్వం కొత్త పోకడలు పోతోంది. పార్టీలో ఉన్న వారి కంటే బయట వారికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సేవలో తరిస్తోంది. దానికి ఒక మత్తు డాక్టర్, మరో రఘురామ క్రిష్ణం రాజు ఉదాహరణలుగా చెప్పుకోవాలి. నిజానికి వీరికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ వారిని భుజానికెత్తుకుని టీడీపీ చేస్తున్న రాజకీయ విన్యాసాలతో సొంత పార్టీలోనే కలి పుట్టిస్తోంది.

తమ్ముళ్ళు వద్దా…?

విశాఖలో చూస్తే చంద్రబాబు లోకేష్ అంటే ప్రాణం పెట్టే క్యాడర్ ఉంది. వారిలో చాలా మంది ఈ మధ్య కరోనా కాటుకు బలి అయిపోయారు. వానపల్లి రవికుమార్ అని కొత్తగా టీడీపీ కార్పోరేటర్ గా నెగ్గిన ఆయన కరోనా తో అసువులు బాశారు. ఆయన చంద్రబాబు మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. అలా ఎంతో మంది సీనియర్ నేతలు కరోనా దెబ్బకు ఈ లోకాన్ని వీడారు. ఇక సడెన్ గా విశాఖ టూర్ పెట్టుకున్న లోకేష్ మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని మాత్రమే పరామర్శించి వెళ్ళిపోయారు. మత్తు డాక్టర్ ది సహజ మరణమే. ఆయన గుండె నొప్పితో మృతి చెందారు. కానీ ఆయన దళితుడు, గత ఏడాది జగన్ సర్కార్ మీద విమర్శలు చేశారు. కాబట్టి కుల రాజకీయం చేయడానికి లోకేష్ విశాఖ వచ్చారని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ అంటున్నారు. లోకేష్ కి శవ రాజకీయాలు చేయడమే చేతనవునని, అందుకే చనిపోయిన టీడీపీ నేతల కుటుంబాలను పరామర్శించలేదు అని గుడివాడ గట్టిగానే విమర్శించారు.

ఈయన కోసం అలా :

ఇక వైసీపీకి చెందిన ఎంపీ రఘురామ‌ క్రిష్ణం రాజు విషయంలో కూడా చంద్రబాబు అతి చేశారు అన్న మాట ఉంది. ఆయన పక్షాన నిలిచి కేంద్ర హోం శాఖకు కూడా లేఖలు సంధించారు. అనుకూల మీడియా ద్వారా దన్నుగా నిలిచారు. అదే టైమ్ లో టీడీపీ తరఫున ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. ఇక దూలిపాళ్ళ నరేంద్ర కుమార్ వంటి వారు అయితే నెల రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వీరెవరి విషయంలో చూపించని శ్రద్దాసక్తులు ఒక్క రఘురామ విషయంలో మాత్రం చంద్రబాబు చూపించి సొంత పార్టీ వారి చేత కూడా ఆక్షేపణలకు గురి అవుతున్నారని అంటున్నారు. అసలు టీడీపీకి నేతలు లేరా. వారికి కష్టాలు లేవా అన్న ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఉదయిస్తోంది.

డీ మోరలైజేనా …?

ఫస్ట్ సొంత పార్టీని చక్కదిద్దుకోవాలి. క్యాడర్ కి ధైర్యం ఇవ్వాలి. వారిని ముందుకు నడిపించాలి. ఇది కదా ఏ నాయకుడు అయినా ప్రతి;పక్షాన ఉన్నపుడు చేయాల్సిన పని. కానీ ఎన్నికల్లో పాలుపంచుకోవద్దు అని జిల్లా పరిషత్ ఎన్నికల వేళ బహిష్కరణ పిలుపు ఇచ్చి పిరికి మందు నూరిపోసేది టీడీపీ అధినాయకత్వమే. అసెంబ్లీకి పోవద్దు అని గెలిచిన ఎమ్మెల్యేలను కట్టడి చేసేది వారే. పోనీ టీడీపీ నేతలకు వేరే ఏదైనా దిశా నిర్దేశం చేస్తున్నారా అంటే అదీ లేదు. ఎంతసేపూ జగన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అన్న దాని మీద దృష్టి పెట్టి బయట వారికే టీడీపీ శక్తియుక్తులు అన్నీ ధారపోస్తున్నారు అన్న భావన అయితే సొంత పార్టీలో కనిపిస్తోంది. మరి ఇప్పటికైనా టీడీపీ మా కోసం ఉంది అన్న నిబ్బరం క్యాడర్ లో పెంపొందించేలా చర్యలు తీసుకోకపోతే మాత్రం టీడీపీ ఫర్ అవుట్ సోర్సింగ్ అనేసుకోవచ్చేమో.

Tags:    

Similar News