మూడుతో ముడిపెట్టేశారు

తమ్ముళ్ళూ దేనికైన తగినవారు అనిపించుకుంటారు. వారు చేస్తే సంసారం. వేరొకరు చేస్తే మ‌రోలా అన్నట్లుగా తమ్ముళ్ళ మాటల‌ విన్యాసం ఎపుడూ ఉన్నదే. ఇక ఏపీకి సంబంధించి కేంద్రం [more]

Update: 2020-02-03 06:30 GMT

తమ్ముళ్ళూ దేనికైన తగినవారు అనిపించుకుంటారు. వారు చేస్తే సంసారం. వేరొకరు చేస్తే మ‌రోలా అన్నట్లుగా తమ్ముళ్ళ మాటల‌ విన్యాసం ఎపుడూ ఉన్నదే. ఇక ఏపీకి సంబంధించి కేంద్రం తీరని అన్యాయమే చేసింది. బడ్జెట్లో అసలు ఏపీ ఊసు కూడా తలవలేదు . ఇది బాధాకరమే అయినా మన రాజకీయ పార్టీలు దాని మీద స్పందిస్తున్న తీరు చూస్తూంటే అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా నిధులు ఇవ్వరంటే ఇవ్వరన్నది ఇట్టే చెప్పేయవచ్చు. దానికి కారణం మన రాజకీయాలే మరి.

మూడు రాజధానులట…..

ఏపీకి నిధులు ఎందుకు కేంద్రం ఇవ్వలేదూ అంటే మూడు రాజధానుల కారణంగా అంటున్నారు తలపండిన తెలుగు తమ్ముళ్ళు. ఏపీకి అసలు రాజధాని లేదని, అందుకే నిధులు ఇవ్వలేదని కొత్త భాష్యం చెబుతున్నారు. ఇది నిజమే అనుకున్నా గతంలో అమరావతిని రాజధానిగా చూపించి నాడు టీడీపీ పెద్దలు ఎన్ని లక్షల‌ కోట్ల నిధులు రాబట్టారన్న ప్రశ్నని వైసీపీ నేతలు వేస్తున్నారు. ఆవు కధలా ఏదో విధంగా అమరావతికి ముడి పెట్టేసి సింపతీ కొట్టేద్దామన్న తాపత్రయం తప్ప ఏపీకి మంచి చేసే మాటలేనా ఇవీ అని అంటున్నారు.

పక్కవారి సంగతేంటి…..?

ఇక ఏపీలో అసమర్ధ నాయకత్వం వల్ల నిధులు రాలేదని, జగన్ వి పిచ్చి తుగ్లక్ చర్యలని కూడా తమ్ముళ్ళు ఆడిపోసుకుంటున్నారు. మరి పొరుగున కేసీఆర్ ఉన్నారు. ఆయన బాగానే పాలిస్తున్నారు. హైదరాబాద్ కూడా అద్భుతమైన రాజధానిగా ఉంది. కేంద్రం అక్కడ కూడా నిధులు విదల్చలేదు కదా. మరి కేసీఆర్ కూడా అసమర్ధ పాలకుడేనా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. నిజానికి బీజేపీ తెలుగు రాష్ట్రాలను చిన్న చూపు చూడడం చాలాకాలంగా సాగుతోంది. అది ఇపుడు కూడా ఉందని ఆర్ధిక నిపుణులూ, రాజకీయ మేధావులూ అంటున్నారు.

ఒక్కటి కాలేరా…?

గతంలో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి నిధులు రాకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబుని వైసీపీ నేతలు నిందించేవారు. ఇపుడు అచ్చం డిటోగా వైసీపీ నేతలను, ముఖ్యమంత్రి జగన్ ని టీడీపీ తమ్ముళ్ళు ఓ ఆట ఆడుకుంటున్నారు. అది కేంద్ర బడ్జెట్ అని, ప్రధాని మోడీ నిధులు ఇవ్వాలన్న ధ్యాస నాడూ లేదు, నేడూ లేదు. సంకుచిత రాజకీయ ప్రాంతీయ పార్టీల రాజ్యంలో ఇలా తన్నుకుచస్తూంటే కేంద్రం మాత్రం ప్రతీ ఏటా మొండిచేయి చూపిస్తూ తన రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. మరి కేంద్రంపైన దండెత్తేందుకు అంతా ఒక్కటి కాలేరా. ఆ సన్నివేశాన్ని ఏపీ ప్రజలు ఎప్పటికీ చూడలేరా. ఇదీ కదా ఆంధ్రా జనం అసలైన‌ ఆవేదన.

Tags:    

Similar News