ఉక్కు కాదు…తుక్కు… .?

రాజకీయాలకు పనికి వస్తేనే ఎంతటి సమస్య అయినా భుజానికి ఎత్తుకునేది. ఇక అవసరం తీరిపోయాక బోడి మల్లన అనేయడం కూడా నేతాశ్రీలకు అలవాటే. సరిగ్గా విశాఖ కార్పోరేషన్ [more]

Update: 2021-06-01 06:30 GMT

రాజకీయాలకు పనికి వస్తేనే ఎంతటి సమస్య అయినా భుజానికి ఎత్తుకునేది. ఇక అవసరం తీరిపోయాక బోడి మల్లన అనేయడం కూడా నేతాశ్రీలకు అలవాటే. సరిగ్గా విశాఖ కార్పోరేషన్ ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం వెలుగు చూసింది కాబట్టే చంద్రబాబు నుంచి అందరూ టీడీపీ పెద్దలూ విశాఖకు హడావుడిగా వచ్చేశారు. ఎన్నికలు అయిపోయాయి. పారిశ్రామిక వాడలో సైకిల్ పార్టీకి కాస్తా గిట్టుబాటు అయింది. అయినా మేయర్ సీటు దక్కలేదు. దాంతో ఎందుకొచ్చిన ఉక్కు పోరాటమని అనుకున్నారో ఏమో తమ్ముళ్ళు ఇపుడు పూర్తిగా కాళ్ళు బారజాపేశారని అంటున్నారు.

ఏదీ తీర్మానం…?

తెలుగుదేశం పార్టీ మహానాడులో అనేక తీర్మానాలు ఆమోదించారు. కానీ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ మీద ఎలాంటి తీర్మానం ఆమోదించకుండానే ముగించారు. దీని మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లంటి వారు అయితే ఉక్కు మీద ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనం పాటించిన తమ్ముళ్ళను గట్టిగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీది ఎన్నికల రాజకీయం, ఓట్లూ సీట్ల ఆరాటం తప్ప ఉక్కు మీద నిజమైన పోరాటం కాదని కూడా వైసీపీ నేతలు తేల్చేశారు.

డిమాండ్ చేసి మరీ …?

ఉక్కు ప్రైవేటీకరణ అంశం రగులుతున్నపుడు విశాఖ వచ్చి మరీ ఉద్యమకారులకు మద్దతు ఇచ్చిన చంద్రబాబు తాము ఎంతవర‌కైనా తెగించి పోరాడుతామని చెప్పుకొచ్చారు. వైసీపీని అసెంబ్లీలో తీర్మానం చేయమని కూడా డిమాండ్ చేశారు. వైసీపీ బడ్జెట్ సమావేశాలో ఉక్కు మీద తీర్మానం ఆమోదించి చిత్తశుద్ధిని చాటుకుంది. మరి టీడీపీ మహానాడులో ఈ అంశాన్ని టేకప్ చేసి ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలంటూ ఎందుకు తీర్మానించలేదు అన్నదే ప్రశ్నగా ఉంది ఉద్యమ‌కారులు కూడా టీడీపీ లాంటి పార్టీ దీని మీద సైలెంట్ అవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.

జాగ్రత్త పడ్డారా…?

కేంద్రంలోని మోడీ సర్కార్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని దూకుడు మీద ఉంది. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అయినా వైసీపీ తన మానాన తాను అసెంబ్లీ తీర్మానం చేసింది. దాన్ని మొక్కుబడి తీర్మానం అంటూ విమర్శించిన టీడీపీ తాము కూడా కనీసం అలాంటి తీర్మానం ఎందుకు ఆమోదించలేకపోయింది అన్నదే చర్చగా ఉంది. ఉక్కు గురించి మాట్లాడితే ఎక్కడ బీజేపీ పెద్దలకు కోపం వస్తుందో అన్న ముందు జాగ్రత్తతోనే ఇలా చేశారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. అదే సమయంలో తెలుగు తమ్ముళ్ళు వైసీపీని మరో కొత్త డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ లో ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం పెడితే అక్కడ మద్దతు ఇస్తారట. దీని మీద టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు విజయసాయిరెడ్డికి సవాల్ చేస్తున్నారు. ముందు మహనాడు లో తీర్మానం చేసి ఉంటే టీడీపీ చిత్తశుద్ధి ఏపాటిదో తెలిసేదని, తాము వెనక ఉండి ఎవరి భుజాల మీద నుంచో తుపాకీ పేల్చాలనుకోవడమేంటి అని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు. మొత్తానికి అటూ ఇటూ ఉక్కు పేరిట మొక్కుబడి పోరాటాలే అని తేలిపోతున్న వేళ ఉక్కు రాజకీయానికి కూడా పనికిరాని తుక్కు అయిపోయిందా అన్నదే కార్మికుల అవేదనట.

Tags:    

Similar News