ఆ ఎంపీ రాంగ్ స్టెప్ వేశారా..?

తెలంగాణ ఎన్నికల ముందు పార్టీ ఫిరాయింపులు పెద్దఎత్తున జరిగాయి. ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకి చేరికలు కొనసాగాయి. ఫిరాయింపులు చూస్తే ఓ దశలో కాంగ్రెస్ [more]

Update: 2019-01-08 05:00 GMT

తెలంగాణ ఎన్నికల ముందు పార్టీ ఫిరాయింపులు పెద్దఎత్తున జరిగాయి. ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకి చేరికలు కొనసాగాయి. ఫిరాయింపులు చూస్తే ఓ దశలో కాంగ్రెస్ గాలి వీస్తోందా..? కాంగ్రెస్ గెలవబోతుందా..? అనే చర్చ కూడా జరిగింది. ఎమ్మెల్సీలు పార్టీ మారినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించోకోలేదు కానీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరడం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రంగారెడ్డి జిల్లాలో అప్పటి మంత్రి పట్నం మహేందర్ రెడ్డితో విభేదాలు, పార్టీ పరిష్కరించకపోవడం వంటి కారణాలతో ఆయన టీఆర్ఎస్ కి దూరమయ్యారు. కాంగ్రెస్ లో చేరాక ఆయన ఎన్నికల వేళ చాలా కీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు తీసుకొని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కానీ, ఎన్నికల ఫలితాలు వచ్చాక పరిస్థితి తారుమారైంది. కాంగ్రెస్ పార్టీకి ఘోర ఓటమి ఎదురైంది. దీంతో ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి భవిష్యత్ ఏంటనేది ప్రశ్నగా మారింది.

మహేందర్ రెడ్డితో విభేదాలు…

వాస్తవానికి, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే అయినా విశ్వేశ్వర్ రెడ్డి గత ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ లో చేరారు. ఆయన చేవెళ్ల నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఎదుర్కొని విజయం సాధించారు. బడా వ్యాపారవేత్త అయిన విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారు. టీఆర్ఎస్ లో ఉన్నా పార్లమెంట్ చర్చల్లో తప్ప ఎక్కడా పెద్ద యాక్టీవ్ గా ఉండేవారు కాదు. రంగారెడ్డి జిల్లాకే చెందిన మంత్రి మహేందర్ రెడ్డితో ఆయనకు విభేదాలు వచ్చాయి. పార్టీ మహేందర్ రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఆయన జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎన్నికల వేళ పార్టీని వీడారు. పార్టీ ఓడినా ఒక విషయంలో మాత్రం విశ్వేశ్వర్ రెడ్డి విజయవంతమయ్యారు. ఆయన తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డికి పూర్తిగా సహకరించి శ్రమించారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా మహేందర్ రెడ్డి రోహిత్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో విశ్వేశ్వర్ రెడ్డి పంతం కొంతవరకు నెరవేరిందనే చొప్పొచ్చు.

చేవెళ్ల ఎంపీ టిక్కెట్ దక్కేనా..?

ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత విశ్వేశ్వర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నందున ఆయన భవిష్యత్ ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. చేవెళ్ల ఎంపీ స్థానానికి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీ చేశారు. ఆయన మళ్లీ ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. దీంతో చేవెళ్ల ఎంపీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందనేది స్పష్టత లేదు. సిట్టింగ్ గా ఉన్నందున విశ్వేశ్వర్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. కానీ చేవెళ్ల లోక్ సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను, ఓట్లను సాధించింది. ఇదే పరిస్థితి ఉంటే ఈ స్థానంలో కాంగ్రెస్ విజయం సులువు కాదు. మొత్తానికి టీఆర్ఎస్ లోనే ఆయన ఉండి ఉంటే, మహేందర్ రెడ్డి ఎలాగూ ఓడారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేవారు. ఇప్పుడు బయటకు వచ్చి తాత్కాలికంగా ఆయన రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లయింది.

Tags:    

Similar News