రాములమ్మ చూపు అటువైపేనా..?

సినిమాల్లో రాములమ్మగా.. లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లో మాత్రం వెనుకబడ్డారు. పరిస్థితుల ప్రభావంతో అనేక పార్టీలు మారిన ఆమె ఇప్పుడు [more]

Update: 2019-02-06 11:00 GMT

సినిమాల్లో రాములమ్మగా.. లేడీ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి రాజకీయాల్లో మాత్రం వెనుకబడ్డారు. పరిస్థితుల ప్రభావంతో అనేక పార్టీలు మారిన ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. బీజేపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసిన ఆమె తెలంగాణ సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. తర్వాత టీఆర్ఎస్ లో ఆ పార్టీని విలీనం చేశారు. ఓ దశలో టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 అన్నట్లుగా కొనసాగారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుగ్గానే పాల్గొన్నారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ రాగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. తర్వాత చాలాకాలం పార్టీలో ఉన్నారా.. లేరా అన్నట్లుగా వ్యవహరించారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు. చివరకు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెను మళ్లీ కాంగ్రెస్ అధిష్ఠానం తెరపైకి తీసుకువచ్చింది. స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించింది.

అక్కడ పోటీకి ధైర్యం చేస్తారా..?

అయితే, ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికే పరిమితమయ్యారు. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ముందు ఆమె మెదక్ లేదా దుబ్బాక నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా పోటీ చేయలేదు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె శ్రమ ఫలించలేదు. ప్రచారం చేసినా విజయం దక్కలేదు. ఇక, తాజాగా ఆమెకు మరో పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం కట్టబెట్టింది. ఈసారి ఏకంగా ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ గా నియమించింది. అయితే, ప్రచార బాధ్యతలతో అసెంబ్లీ ఎన్నికలకే దూరమైన ఆమె పార్లమెంటు ఎన్నికల్లోనైనా పోటీ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఆమె, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే గతంలో ప్రాతినిథ్యం వహించిన మెదక్ లోక్ సభ నుంచి పోటీ చేయాలి. ఆ సీటుకు కాంగ్రెస్ లో పెద్దగా పోటీ ఏమీ లేదు. అయితే, టీఆర్ఎస్ హవా ఎక్కువగా ఉన్న ఈ స్థానం నుంచి పోటీ చేసే ధైర్యం విజయశాంతి చేసే అవకాశం తక్కువే అంటున్నారు.

భువనగిరిపై కన్నేశారా..?

ఇక, విజయశాంతి కొత్త స్థానంపై కన్నేశారనే ప్రచారమూ జరుగుతోంది. ఆమె ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు మొగ్గుచూపుతున్నారట. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానం పరిధిలో కాంగ్రెస్ మెరుగైన ఓట్లు సాధించింది. ఈ స్థానం పరిధిలోని మునుగోడు, నకిరేకల్ స్థానాలు గెలుచుకుంది. ఇక, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో స్వల్ప తేడాతో ఓడింది. ఇక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కి విజయావకాశాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఆమె ఈ స్థానంపై మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇప్పటికే ఈ సీటును సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డితో పాటు మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నారు. ఇక, నల్గొండ ఎంపీ సీటు ఇవ్వడం కుదరకపోతే భువనగిరి అయినా ఇవ్వాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అడుగుతున్నారట. దీంతో విజయశాంతి ప్లాన్ పక్కాగానే ఉన్నా టిక్కెట్ లభించడం మాత్రం అనుమానమే. మరి, పార్లమెంటు ఎన్నికల్లోనైనా ఆమె పోటీలో ఉంటారా? లేదా ప్రచారానికి పరిమితం అవుతారా అనేది చూడాలి.

Tags:    

Similar News