పెద్దగా పని లేనట్లుందే…?

ఈ ఏడాది ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో వారిద్దరూ విజ‌య‌వాడ ఎంపీ స్థానం నుంచి నువ్వా-నేనా అనే రేంజ్‌లో పోటీ ప‌డ్డారు. ఇద్దరూ కూడా ఒక‌రిని [more]

Update: 2019-07-29 02:00 GMT

ఈ ఏడాది ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో వారిద్దరూ విజ‌య‌వాడ ఎంపీ స్థానం నుంచి నువ్వా-నేనా అనే రేంజ్‌లో పోటీ ప‌డ్డారు. ఇద్దరూ కూడా ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న విధంగా ఖ‌ర్చు కూడా పెట్టారు. ఇక‌, వారిద్దరికీ చెందిన పార్టీలు కూడా ఈ ఇద్దరిపై అనేక ఆశ‌లు పెట్టుకు న్నాయి. ఎవ‌రికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఎన్నిక‌ల‌న్నాక‌.. గెలుపు ఎవ‌రో ఒక‌రి ప‌క్షానే ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇద్దరిలో ఒక‌రే గెలిచారు. ఆయ‌నే విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని. ఈయ‌న‌పై పోటీ చేసిన వైసీపీ నాయ‌కుడు, ప్రముఖ వ్యాపార‌వేత్త‌.. పొట్లూరి వర ప్రసాద్‌. ఉర‌ఫ్ పీవీపీ. ఈ ఇద్దరూ కూడా ఒకే సామాజిక వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో విజ‌య‌వాడ సీటును సొంతం చేసుకునేందుకు ఇద్దరూ బాగానే క‌ష్టప‌డ్డారు.

కేశినేని గెలిచినా….

అయితే, అప్పటికే ఎంపీగా ఉన్న కేశినేని నానికి ప్రజ‌ల్లో పాజిటివ్ టాక్ ఉండ‌డం, పీవీపీ పెద్దగా ప్రజ‌ల‌కు చేరువ కాక‌పోవ‌డంతో కేశినేని నానికి ముందు నుంచి కాస్త సానుకూల వాతావ‌ర‌ణ‌మే ఉంది. అయితే, ఎన్నిక‌ల్లో మాత్రం ఇద్దరూ స‌మ ఉజ్జీలుగానే త‌ల‌ప‌డ్డారు. కేశినేని నాని గెలిచి.. పీవీపీ ఓడిపోయారు. అయితే, వీరికి చెందిన పార్టీలు రివ‌ర్స్ అయ్యాయి. టీడీపీ అధికారం కోల్పోగా, పీవీపీ ప్రాతినిధ్యం వ‌హించిన వైసీపీ ఏపీలో అధికారంలోకి వ‌చ్చింది. ఇక‌, గెలిచిన కేశినేని నాని కానీ, ఓడిన పీవీపీ కానీ.. బెజ‌వాడ గురించి అప్పుడే మ‌రిచిపోయారా? అనే సందేహం వ్యక్తమ‌వుతోంది.

అసలు విషయాన్ని….

కేశినేని నాని విష‌యాన్ని తీసుకుంటే.. ఆయన సొంత పార్టీపైనే గుస్సాగా ఉన్నారు. త‌న‌ను కాద‌ని ఓడిన నేత‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారని కేశినేని నాని లోలోనే ర‌గిలిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న సొంత పార్టీ టీడీపీపైనే ట్విట్టర్ వేదిక‌గా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే స‌మ‌యంలో టీడీపీ నేత‌ల‌ను కూడా వ‌దిలి పెట్టకుండా వాయించేస్తున్నారు. నిజానికి జ‌గ‌న్ సునామీలోనూ కేశినేని నానిని గెలిపించ‌డం వెనుక విజ‌య‌వాడ వాసుల‌కు అనేక ఆశ‌లు ఉన్నాయి. బెంజిస‌ర్కిల్ ఫ్లైవోర్‌, క‌న‌క‌దుర్గ ఫ్లైవోర్‌, ర‌హ‌దారుల విస్తర‌ణ‌, ప‌రిశ్రమ‌ల అభివృద్ధి వంటివి కేశినేని నానితోనే సాధ్యమ‌వుతాయ‌నివారు న‌మ్మారు. అయితే, ఆయ‌న ఈ విష‌యాన్ని ప‌క్కన పెట్టి కేవ‌లం త‌న‌కు పార్టీలో ప్రాధాన్యం ద‌క్కలేద‌నే అక్కసుతో ట్వీట్లతోనే కాలంక్షేపం చేస్తున్నారు.

సమస్యలను వదలి…

ఇక‌, పీవీపీ విష‌యాన్ని తీసుకుంటే.. ఆయ‌న ఓడిపోయినా.. ఆయ‌న పార్టీ మాత్రం ఏపీలో అధికారంలోకి వ‌చ్చింది. దీనిని అడ్డు పెట్టుకుని ఆయ‌న విజ‌య‌వాడ అభివృద్ది, కొండ ప్రాంత వాసుల‌కు ప‌ట్టాలు ఇచ్చేకార్యక్రమం, తాగునీరు వంటి వాటిపై శ్రద్ధ చూపిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తిరుగులేని నాయ‌కుడిగా ఎదిగే అవ‌కాశం ఉంది. అయితే, ఆయ‌న దీనిని మానేసి.. నాని వ‌ర్సెస్ బుద్దా వెంక‌న్నల ట్వీట్ల యుద్ధంలోవేలు పెట్టి కాల్చుకున్నారు. మొత్తానికి అటు గెలిచిన నాని వ‌ల్ల కానీ, ఇటు ఓడిన పీవీపీ వ‌ల్ల కానీ త‌మ‌కు ఎలాంటి ప్రయోజ‌నం లేద‌ని బెజ‌వాడ వాసులు లబోదిబో మంటున్నారు. మ‌రి ఇప్పటికైనా వీరు అభివృద్ధిలో పోటీప‌డ‌తారో లేదో చూడాలి.

Tags:    

Similar News