విశాఖను ముట్టుకుంటే షాకేనట… ?

రాజధాని అంటేనే ఆ రాజసం దానంతట అదే వస్తుంది. దాంతో అన్నీ కూడా ఆకాశం వైపే చూస్తాయి. ఏ రాజధాని నగరమైనా బడా బాబులకే అనుకూలం తప్ప [more]

;

Update: 2021-07-22 11:00 GMT

రాజధాని అంటేనే ఆ రాజసం దానంతట అదే వస్తుంది. దాంతో అన్నీ కూడా ఆకాశం వైపే చూస్తాయి. ఏ రాజధాని నగరమైనా బడా బాబులకే అనుకూలం తప్ప సామాన్యులకు నిలువ నీడనీయదు అన్న విమర్శలూ ఉన్నాయి. అమరావతి కొందరి రాజధాని అని వైసీపీ నిన్నటి దాకా విమర్శలు చేస్తూ వచ్చింది. ఇపుడు ఆ ప్రభుత్వం విశాఖను రాజధానిగా ఎంచుకుంటోంది. మరి విశాఖ సీన్ ఎలా ఉంది అంటే ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉంటోంది అంటున్నారు అంతా. అసలే విశాఖలో జీవన వ్యయం చాలా ఎక్కువ అని చెబుతారు. ఇపుడు రాజధాని ట్యాగ్ తో మరింతగా మండుతోంది.

రెక్కలు తొడిగాయ్….

విశాఖ మెట్రో సిటీ నుంచి ప్రతిపాదిత రాజధాని హోదాతో ఉంది. ఇదే అనువుగా భూముల ధరలు బాగా పెరిగిపోయాయి. అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ అని అన్నారు కానీ విశాఖలోనూ దానికి మించి వ్యాపారం సాగుతోంది. ఏకంగా శ్రీకాకుళం దాకా భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఇక విశాఖ వంటి చోట్ల ఎక్కువగా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, వ్యాపారులు ఉంటారు. కాబట్టి మొదటి నుంచి కొంత ఖరీదైన నగరంగానే చెప్పాలి. ఇపుడు రాజధాని పేరిట దానికి కొత్త మెరుగులు దిద్ది అన్ని రేట్లూ పెంచేశారు. ఇందులో వైసీపీ, టీడీపీ రెండూ ఉన్నాయ‌నే చెప్పాలి.

బాదుడేనా…?

వైసీపీకీ పట్టం కట్టాక విశాఖ కార్పోరేషన్ తాజాగా సమావేశమైంది. చేసిన ఉపకారం ఏంటి అంటే చెత్తకు కూడా పన్ను అంటూ కొత్త వింతను చూపించింది. ప్రతీ ఇంటికీ నెలకు చెత్తను తీసుకెళ్ళడానికి యూజర్ చార్జీల కింద 120 రూపాయలను విధిస్తూ కార్పోరేషన్ నిర్ణయం తీసుకోవడంతో సామాన్యుడు హడలుతున్నాడు. ఇంతే కాదు ఆస్తి పన్నును విలువ ఆధారితంగా లెక్క వేస్తూ పెంచడం అంటే విశాఖలో ఏ రేంజిలో పన్నుల బాదుడు ఉంటుందో వేరేగా చెప్పాల్సిన పని లేదు. విశాఖలో ఉంటే చాలు ఏ స్థలానికైనా ఆటోమేటిక్ గా విలువ వచ్చేస్తుంది. దాంతో పన్నులు వీర లెవెల్ లో పెరిగాయ‌ని మధ్యతరగతి వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి.

ఉందిలే ముందుముందునా…..

ఇక విశాఖలో ఇపుడే ఏం చూశారు ముందు ముందు చాలానే తమాషాలు ఉంటాయని విపక్ష నేతలు భయపెడుతున్నారు. వారు అన్నారని కాదు కానీ విశాఖకు నిజంగా రాజధాని వస్తే మధ్యతరగతి, పేదలు నివసించగలరా అన్నదే చర్చగా ఉంది. విశాఖలో ఆస్తిపన్ను పెంచితే అది అద్దెకున్న వారికే బదలాయింపు అవుతుంది. చెత్త పన్నులు, కొత్త పన్నులు ఎన్ని వేసినా కూడా నగరానికి వచ్చి ఉపాధి చూసుకునే వారి మీదనే ఆ భారం పడుతుంది. మరి ఇలాంటి స్థితిలో విశాఖలో ఎవరైనా ఉండగలరా అన్నదే డౌట్ గా ఉంది మరి. ఇక ప్రభుత్వం అనుకుంటున్న ప్రాజెక్టులు అన్నీ విశాఖకు వచ్చి ట్రాఫిక్ పెరిగితే మాత్రం విశాఖలో కోటీశ్వరులు తప్ప ఆ మాత్రం సంపాదన కలిగిన వారు ఉండలేరు అంటున్నారు. మొత్తానికి చూస్తే అమరావతి ఎవరిది అని నాడు దీర్ఘాలు తీసిన వారు ఇపుడు విశాఖ ఎవరిది అని కూడా అనుకోవాలేమో.

Tags:    

Similar News