మంత్రి ఆశ‌… న‌లుగురి జీవితాన్ని రివ‌ర్స్ చేసింది..!

మంత్రి ప‌ద‌వి అనే ఆ ఆశ ఆ న‌లుగురు రాజ‌కీయ నేత‌ల జీవితాన్ని త‌ల‌కిందులు చేసేసింది. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో వారు వేసిన రాంగ్ స్టెప్ [more]

Update: 2021-06-28 00:30 GMT

మంత్రి ప‌ద‌వి అనే ఆ ఆశ ఆ న‌లుగురు రాజ‌కీయ నేత‌ల జీవితాన్ని త‌ల‌కిందులు చేసేసింది. మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో వారు వేసిన రాంగ్ స్టెప్ వారి భ‌విష్యత్తును అగ‌మ్యగోచ‌రంగా మార్చేసింది. ఇప్పుడు క‌క్కలేకి మింగ‌లేక చందంగా వారు మారిపోయారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల‌కు టీడీపీ కండువాలు క‌ప్పేశారు. వీరిలో న‌లుగురు జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. ఆ న‌లుగురు రెండేళ్ల పాటు మంత్రులుగా ఓ రేంజ్‌లో అధికారం వెల‌గ‌బెట్టారు. మంత్రులుగా వారు ఆయా జిల్లాల్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. క‌ట్ చేస్తే రెండేళ్లలో వారు ఎమ్మెల్యేలుగా చిత్తుగా ఓడి చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలో.. సొంత పార్టీలో కూడా ప‌ట్టు నిలుపుకునే ప‌రిస్థితిలో కూడా లేరు.

మంత్రులయ్యాక…?

ఆ మాజీ మంత్రులు ఎవ‌రో కాదు క‌డ‌ప జిల్లాకు చెందిన‌ ఆదినారాయణరెడ్డి, ఆళ్లగ‌డ్డకు చెందిన భూమా అఖిలప్రియ, బొబ్బిలి రాజు సుజయ కృష్ణరంగరావు, చిత్తూరు నేత అమర్నాథ్ రెడ్డి. ఈ నలుగురు 2014లో వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ న‌లుగురిలో భూమా అఖిల‌, అమ‌ర్నాథ్ రెడ్డి పూర్వాశ్రమంలో టీడీపీకి చెందిన వారే. సుజ‌య్‌, ఆది ఇద్దరు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలుగా గెలిచి 2014లో వైసీపీలోకి జంప్ చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో న‌లుగురూ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. వీరు మంత్రులుగా ఉన్నంత కాలం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ వాళ్లను అణ‌గ‌దొక్కడంతో పాటు టీడీపీ కేడ‌ర్‌ను ప‌ట్టించుకోకుండా ఆకాశంలోనే ఉన్నారు.

క్యాడర్ కూడా పట్టించుకోక…..

ఆ ఎఫెక్ట్ ఎన్నిక‌ల్లో తీవ్రంగా ప‌డింది. ఇప్పుడు వీరు క‌నీసం ఎమ్మెల్యేలు కూడా కాదు.. వీరిని సొంత పార్టీ కేడ‌ర్ కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. అందుకే సుజ‌య్‌, అమ‌ర్నాథ్ క‌నీసం నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌కుండా చెన్నై, బెంగ‌ళూరులో వ్యాపారాలు చేసుకుంటున్నారు. అఖిల‌ప్రియ వ‌రుస వివాదాల్లో ఇరుక్కోవ‌డంతో పాటు జైలుకు కూడా వెళ్లివ‌చ్చారు. ఆ టైంలో క‌నీసం ఆమెను పార్టీ నేత‌లు ప‌ట్టించుకున్న పాప‌ాన కూడా పోలేదు. కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆదినారాయణ టీడీపీని వీడి సేఫ్ సైడ్‌గా బీజేపీలోకి వెళ్లారు. ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఏంటో తెలిసిందే. అక్కడ ఆదిని ప‌ట్టించుకునే వాళ్లు, న‌మ్మే వాళ్లు కూడా లేరు.

ఇన్ ఛార్జి పదవిని కూడా…?

బొబ్బిలిలో సుజ‌య్‌ను త‌ప్పించేసిన చంద్రబాబు ఆయ‌న సోద‌రుడు బేబీ నాయ‌నకు టీడీపీ ప‌గ్గాలు అప్ప‌గించేశారు. సుజ‌య్ పొలిటిక‌ల్ లైఫ్‌కు శుభం కార్డే అంటున్నారు. అఖిల ఇదే తీరుతో ఉంటే ఆమె రాజ‌కీయంగా నిల‌దొక్కుకునే ప‌రిస్థితులు లేవు. ఇక ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలో ఇబ్బంది ప‌డుతున్నా… త‌ర్వాత అయినా ఆయ‌న టీడీపీలోకి రాకుండా పోతారా ? అనే వాళ్లే ఎక్కువ‌. ఏదేమైనా నాడు వీళ్లు మంత్రి ఆశ‌తో పార్టీ మార‌కుండా ఉండి ఉండే ఈ రోజు ఐదేళ్ల పాటు అధికారం ఎంజాయ్ చేసేటోళ్లే..!

Tags:    

Similar News