అధికారులకు రంగు పడుతోంది… ?

అధికారులు అంటే ప్రజా సేవ చేయడానికి ఉన్నారు. రాజకీయ నేతలు ప్రజా ప్రతినిధులుగా అయిదేళ్ళు మాత్రమే పవర్ చలాయిస్తారు. కానీ ఉద్యోగులు రిటైర్ అయ్యేంతవరకూ కూడా సూపర్ [more]

;

Update: 2021-09-21 00:30 GMT

అధికారులు అంటే ప్రజా సేవ చేయడానికి ఉన్నారు. రాజకీయ నేతలు ప్రజా ప్రతినిధులుగా అయిదేళ్ళు మాత్రమే పవర్ చలాయిస్తారు. కానీ ఉద్యోగులు రిటైర్ అయ్యేంతవరకూ కూడా సూపర్ పవర్ గానే ఉంటారు. అయినా సరే ఎవరు అధికారంలో ఉంటే వారి మాట వినాల్సిందే. వారి నిర్ణయాలను ఆమోదించాల్సిందే. అయితే ఇక్కడ కొందరు హద్దులు దాటి మరీ రాజభక్తిని ప్రదర్శించి ఆ గబ్బు తమకు కూడా అంటించుకుంటారు. మరి కొందరు మాత్రమే తమ పరిమితులు పరిధులు తెలుసుకుని మసలుకుంటారు. ఫలితంగా వారు అధికార పార్టీకే కంట్లో నలుసుగా మారుతున్నారు. ఇపుడు విశాఖలో చూసుకుంటే కొందరు ఉన్నతాధికారుల పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉందిట.

ఆమె మీద అలా ముద్ర ..

విశాఖ రాజధానిగా వైసీపీ సర్కార్ ప్రతిపాదించాక సమర్ధులను, సీనియర్ అధికారులను ఎంపిక చేసి మరీ జగన్ కీలక స్థానాలలో నియమించారు. వారు కూడా ముక్కు సూటిగా పనిచేసుకుని పోతున్నారు. అలాంటి వారిలో జీవీఎంసీ కమిషనర్ సృజన ముందు వరసలోకి వస్తారు. ఆమె అధికార పార్టీ అని కూడా చూడకుండా రూల్స్ కే పెద్ద పీట వేస్తారు. అది నచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, ఇతర పెద్దలంతా ఆమెను బదిలీ చేయాలని తమ ప్రభుత్వానికే మొర పెట్టుకుంటున్నారు. ఆమె కనుక పదవిలో ఉంటే తాము రాజీనామాలే చేస్తామని గట్టి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఆమె తెలుగుదేశం మనిషి అంటూ అతి పెద్ద ముద్ర వేసేసారు.

దారుణమేనా…?

ఇక టీడీపీ నేతలు తీరు కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. మాజీ మంత్రి, సీనియర్ మోస్ట్ నేత అయిన బండారు సత్యనారాయణమూర్తి కొందరు అధికారుల పేర్లను కూడా చదివేశారు. వారంతా కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అనుచరులుగా పనిచేస్తున్నారు అంటూ దారుణమైన ఆరోపణ చేశారు. ఆ లిస్ట్ లో సింహాచలం ఈవో సూర్యకుమారి పేరు కూడా ఉంది. ఆమె నిబద్ధత కలిగిన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఈ ఆరోపణల మీద బాధపడుతున్నారు. తాము ప్రభుత్వ నిబంధలన మేరకు విధులను నిర్వహిస్తామని తప్ప ఎవరికీ తాము తలొగ్గమని కూడా అంటున్నారు. మరో వైపు చూస్తే జీవీఎంసీ కమిషనర్ జి సృజన అయితే ఎవరి పేరు ప్రస్థావించకుండా ఒక ట్వీట్ చేసి అందులో తన ఆవేదనను వ్యక్తం చేశారు. వీరులు అన్న వారు ధర్మం వైపే కట్టుబడి ఉంటారని, ఎవరికీ తలొగ్గరని కూడా ఆ ట్వీట్ లో ఆమె పేర్కొనడం ఎవరిని ఉద్దేశించి అన్నది అర్ధం కాక పెద్ద చర్చగా మారింది.

తప్పుడు విధానమే…?

రాజకీయాలు చేసుకునే వారు ఒకరి మీద ఒకరు ఎంత బురద జల్లుకున్నా తప్పులేదు. కానీ మధ్యలో అధికారులను లాగడం తప్పుడు విధానమే అంటున్నారు. అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు బాధ్యులు కానీ రాజకీయ నేతలకు కాదని కూడా అంటున్నారు. ఏపీ రాజకీయం చూస్తే బస్తీ మే సవాల్ అంటూ వైసీపీ టీడీపీల మధ్యనే కేంద్రీకృతం కావ‌డం, ఢీ అంటే ఢీ అంటూ ఇద్దరూ కుస్తీకి రెడీ కావడంతో సమిధలుగా అధికారులు మారుతున్నారు అంటున్నారు. విశాఖ జిల్లాలో ఈ రకమైన ఆరోపణలు పడలేక కొందరు ఉన్నత స్థాయి అధికారులు బదిలీ చేయించుకుంటున్నారు కూడా. మొత్తానికి అధికారులు తమకు ఆయుధమని పవర్ లో ఉన్న వారు ఎవరు అనుకున్నా తప్పే అవుతుంది, వారు వారధులు అని భావిస్తే అందరికీ మేలు జరుగుతుంది. ఈ సూత్రం వంటబట్టించుకోని నాడు రంగు పడుతూనే ఉంటుంది. అపుడు ఆ బురద కడుక్కోవడం మాత్రం అందరికీ కష్టమే అవుతుంది.

Tags:    

Similar News