ఏం జాతకం జగన్…?

అవును. జగన్ జాతకం ఎలాంటిది అంటే ప్రతీదీ కష్టపడే అందుకోవాలి. తీరా అందుకున్నాక దాన్ని మనస్పూర్తిగా ఆస్వాదించాలన్నా కూడా కుదిరే పరిస్థితి లేకుండా పోతోంది. ఏపీ సీఎం [more]

Update: 2021-05-09 14:30 GMT

అవును. జగన్ జాతకం ఎలాంటిది అంటే ప్రతీదీ కష్టపడే అందుకోవాలి. తీరా అందుకున్నాక దాన్ని మనస్పూర్తిగా ఆస్వాదించాలన్నా కూడా కుదిరే పరిస్థితి లేకుండా పోతోంది. ఏపీ సీఎం కావల‌న్నది జగన్ కల. దాని కోసం పదేళ్ల పాటు పరితపించారు. ఏకంగా తనను తాను ఒక సమిధను చేసుకుని మరీ సమరం సాగించారు. మొత్తానికి అనుకున్న పీఠం అందుకున్నారు కానీ ఆ సంతృప్తి మాత్రం ఆయనకు లేకుండా పోతోంది. ఒక వైపు అయిదేళ్ల పాలనలో మొత్తానికి మొత్తం ఖజానాను గోకేసి టీడీపీ పెద్దలు చల్లగా జారుకున్నారు. వారు చేసిన పొరపాట్లకు వారసుడిగా జగన్ చేదు ఫలితాలను అనుభవించాల్సి వస్తోంది.

కరోనా దెబ్బతో…?

ఇక గత రెండేళ్ళుగా ఠంచనుగా ఒక సీజనల్ వ్యాధిలా కరోనా వచ్చిపడుతోంది. గత ఏడాది ఇదే సమయాన కరోనా రావడంతో ఏపీలో అన్ని రకాల కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆఖరుకు జగన్ సీఎం గా ప్రమాణం చేసిన తొలి ఏడాది పండుగ కూడా జరుపుకోవడానికి లేకుండా పోయింది. 2019 మే 30న జగన్ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. 2020 మే నెలలో ఏడాది వేడుకలకు ఆస్కారమే లేకుండా కరోనా మహమ్మారి నాడు ఏపీని అతలకుతలం చేసింది. దాంతో ఆ ఊసే లేకుండా పోయింది.

ఈసారి అంతేనా…?

ఇక చూస్తే ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఈ ఏడాది కూడా దారుణంగా ఉంది. గత ఏడాదే నయం అన్నట్లుగా కూడా సెకండ్ వేవ్ జోరు ఉంది. ఈ దెబ్బతో ఎటువంటి యాక్టివిటీ అన్నదే లేకుండా పోయింది. దాంతో అద్వితీయంగా ద్వితీయ వార్షికోత్సవాన్ని చేద్దామనుకున్న వైసీపీకి కరోనా షాక్ ఇచ్చేసింది అంటున్నారు. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటి అంటే లోకల్ బాడీస్ తో సహా అన్ని ఎన్నికల్లోనూ జగన్ పార్టీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా విజయ విహారమే చేసింది. అయినా సరే ఆ ఆనందాన్ని పంచుకోవడానికి కరోనా అసలు చాన్స్ ఇవ్వడంలేదు అని క్యాడర్ తో పాటు లీడర్లు కూడా తెగ బాధపడుతున్నారు.

అప్పటికి ఏమవుతుందో …?

ఇక జగన్ సీఎం గా గద్దెనెక్కి రెండేళ్ళు అవుతున్న వేళ పండుగకు కూడా మమ అనిపించాల్సిందే. మరి ఈ ముచ్చట్లు అన్నీ మరో ఏడాదికి వాయిదా వేసుకోవాల్సిందే అంటున్నారు. అయితే 2022 నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో. ఆ ఏడాది రాజకీయం ఏ తీరున సాగుతుందో అన్న చర్చ కూడా వైసీపీలో ఉంది. ఆనాటికి వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు పూర్తి అవుతాయి. అంటే మెజారిటీ పాలన ముగిసి యాంటీ ఇంకెంబెన్సీ కూడా మెల్లగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాంతో అలాంటి వేళ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నా అవి చివరికి నెగిటివిటీనే పెంచుతాయేమో అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి చూస్తూంటే జగన్ సీఎం గా ప్రమాణం చేశారు అన్న మాటే కానీ ఏ అచ్చటా ముచ్చటా లేకుండానే పాలన ఒడుదుడుకుల మధ్యనే సాగుతోందని వైసీపీలో గట్టిగా నిట్టూర్పులు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News