జగన్ ఆశలన్నీ అక్కడే..!

గత ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటుందనుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. దీంతో ఈ ఎన్నికలను ఆ పార్టీ అధినేత జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేశారు. కచ్చితంగా [more]

Update: 2019-04-30 02:30 GMT

గత ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటుందనుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. దీంతో ఈ ఎన్నికలను ఆ పార్టీ అధినేత జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేశారు. కచ్చితంగా విజయం సాధించాలనే లక్ష్యంగా ఏడాదికి పైగా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. గతానికి భిన్నంగా పక్కా ప్రణాళిక, పోల్ మేనేజ్ మెంట్ తో ఈసారి ఎన్నికల్లో పోరాడింది వైసీపీ. ఇప్పటివరకున్న అంచనాలు, పోలింగ్ సరళిని విశ్లేషిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారంపై ధీమాగా ఉన్న జగన్ ఆరు జిల్లాలపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. పార్టీకి పట్టున్న ఆ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు దక్కించుకుంటే అధికారం తమదే అన్న భావనలో వైసీపీ నేతలు ఉన్నారు.

బలమున్న చోటే ఎక్కువ గెలిస్తే…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ అండగా ఉంది. గత ఎన్నికల్లోనూ అనంతపురం జిల్లా మినహా మిగతా మూడు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ నియోజకవర్గాలు గెలిచింది. రాయలసీమకు ఆనుకొని ఉండే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సీమలో ఉండే రాయకీయ పరిస్థితులే ఉంటాయి. దీంతో 2014లో ఈ రెండు జిల్లాల్లోనూ వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. ఇక్కడ పార్టీ ఫిరాయింపులతో వైసీపీకి కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఇంకా ఆ పార్టీ బలంగా ఉంది. దీంతో ఈసారి కచ్చితంగా ఈ ఆరు జిల్లాల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకుంటామని వైసీపీ నమ్మకంగా ఉంది. ఇక్కడ తమ లెక్క నిజమైతే అధికారం తమదే అని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ ఆరు జిల్లాల్లో కలిసి మొత్తం 74 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో మూడింట రెండొంతుల సీట్లు కచ్చితంగా సాధిస్తామని వైసీపీ బలంగా విశ్వసిస్తోంది. అంటే కచ్చితంగా 50కు పైగానే ఈ ఆరు జిల్లాల నుంచి వస్తాయని లెక్కలేసుకుంటోంది. అదే జరిగితే అధికారం చేపట్టడానికి ఇంకా 38 సీట్ల కావాల్సి ఉన్నందున మిగతా ఏడు జిల్లాల్లో ఈ సీట్లు సులువుగా వస్తాయని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు.

50 సీట్లు ఇక్కడే వస్తే…

రాయలసీమలో కడపలో ఎలాగూ వైసీపీకి ఎక్కువ స్థానాలు రావడం ఖాయం. ఒకటిరెండు స్థానాలు మినహా మిగతావి ఆ పార్టీ గెలుచుకోవచ్చు. కర్నూలులో గత ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లలో 10 గెలుచుకుంది. ఇప్పుడు కూడా ఇక్కడ 10 కచ్చితంగా గెలుస్తామని ఆ పార్టీ లెక్కలేసుకుంటోంది. చిత్తూరులోని 14 సీట్లలో 2014లో వైసీపీ 8 గెలవగా ఇప్పుడు 10 గెలుస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అనంతపురంలో గత ఎన్నికల్లో 14 స్థానాల్లో వైసీపీ కేవలం 2 మాత్రమే గెలిచింది. అయితే ఈసారి తాము బాగా పుంజుకున్నామని, బీసీ కార్డు జిల్లాల్లో సక్సెస్ అయ్యిందని వైసీపీ లెక్కలేస్తోంది. కచ్చితంగా జిల్లాలో 6 – 8 స్థానాలు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక, నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉంది. గత ఎన్నికల కంటే కూడా బలపడింది. గత ఎన్నికల్లో 10 సీట్లలో 7 గెలుచుకోగా ఈసారి ఇంకొకటి ఎక్కువే గెలుచుకుంటామని ఆ పార్టీ నేతలు అంచనాకి వచ్చారు. ప్రకాశం జిల్లాలోనూ వైసీపీ బలం పుంజుకుంది. గత ఎన్నికల్లో 12 సీట్లలో 6 గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 8 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని అంచనా వేసుకుంటున్నారు. ఇలా మొత్తంగా ఈ ఆరు జిల్లాల నుంచి 50కి పైగా సీట్లు కచ్చితంగా వస్తాయని వైసీపీ భావిస్తోంది. వైసీపీ నేతల అంచనాలు నిజమై ఇక్కడ 50 సీట్లు వస్తే ఆ పార్టీకి అధికారం చేపట్టడం పెద్దగా కష్టమేమీ కాకపోవచ్చు.

Tags:    

Similar News