వరస విజయాలు జగన్ కి నష్టమేనా ?
తీపి కూడా ఎక్కువ తింటే చేదుగా మారుతుంది. అలాగే విజయాలు కూడా ఒక మోతాదుని మించితే తలకెక్కి మెదడు బరువెక్కుతుంది. అపుడు మత్తు ఆవహించి సరైన ఆలోచనలు [more]
తీపి కూడా ఎక్కువ తింటే చేదుగా మారుతుంది. అలాగే విజయాలు కూడా ఒక మోతాదుని మించితే తలకెక్కి మెదడు బరువెక్కుతుంది. అపుడు మత్తు ఆవహించి సరైన ఆలోచనలు [more]
తీపి కూడా ఎక్కువ తింటే చేదుగా మారుతుంది. అలాగే విజయాలు కూడా ఒక మోతాదుని మించితే తలకెక్కి మెదడు బరువెక్కుతుంది. అపుడు మత్తు ఆవహించి సరైన ఆలోచనలు మరుగున పడిపోతాయి. ఇపుడు వైసీపీకి దక్కుతున్న విజయాలు కూడా అలాంటి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయా అన్న చర్చ అయితే పార్టీలో జరుగుతోంది. నిజానికి జగన్ దూకుడు తగ్గాలి అంటే ప్రజా తీర్పు కొంత చెక్ పాయింట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు దక్కడం, జగన్ వేవ్ ఏపీలో ఇంకా బలంగా ఉండడం చూసి సొంత పార్టీ నేతలే షాక్ తిన్నారని టాక్.
విపక్షం డల్…
ఇపుడు ఏపీలో విపక్షం గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉందనే చెప్పాలి. వైఎస్సార్ హయాంలో కేవలం 47 సీట్లు వచ్చినా కూడా చంద్రబాబు అల్లల్లాడించారు. అదే సమయంలోలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే పట్టున్న చోట్ల టీడీపీ గెలిచి మరీ సత్తా చాటింది. ఆ విధంగా వైఎస్సార్ తప్పులను ఎప్పటికపుడు ఎండగడుతూ సర్కార్ ని అలెర్ట్ చేస్తూ వచ్చింది. నాడు ఉమ్మడి ఏపీలో టీయారెస్ కూడా వైఎస్సార్ కి చాలెంజ్ చేసే స్థితిలో ఉండేది. వామపక్షాలు కూడా నాడు బలంగా ఉండేవి. ఇక వైఎస్సార్ కూడా మొండిగా కాకుండా తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకునే నైజం కలిగిన వారుగా ఉండేవారు. ఆ కారణంగానే 2009 ఎన్నికల్లో టీడీపీ బాగా పుంజుకున్నా కూడా ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించి సరైన చర్యలతో మరో మారు గట్టెక్కారు వైఎస్సార్.
దూకుడుతో ముప్పే …
ఇక జగన్ చూస్తే దూకుడు తప్ప మరో ఆలోచన ఉండదు అని అంటారు. దానికి తోడు పార్టీకి ప్రభుత్వానికి ఆయనే సారధి. రెండవ మనిషి కానీ నాయకత్వం కానీ ఎక్కడా లేకుండా చేసుకున్నారు. ప్రజా తీర్పులు అందించిన బలంతో మరిన్ని దూకుడు నిర్ణయాలకు జగన్ తెగిస్తారు అన్న మాట కూడా వైసీపీలో వినిపిస్తోంది. ఇక మీదట జగన్ తీసుకునే నిర్ణయాల విషయంలో జోరు తప్ప ఆపేవారు కూడా ఎవరు ఉండరని కూడా అంటున్నారు. ఇప్పటికే పార్టీలో దిగువ స్థాయి నుంచి పై దాకా ఒక మాదిరి అసంతృప్తి అయితే కమ్ముకుని ఉంది. పార్టీకి ఎక్కడైనా ఇబ్బంది వస్తే అపుడు జగన్ తమ వైపు చూస్తారని, తమ గోడు చెప్పుకోవాలని ఇంతకాలం సీనియర్లు సహా అంతా వేచి చూశారు. కానీ వారికి ఆ అవకాశం సమీప భవిష్యత్తులో లేదని తేలిపోతోంది.
ఎన్టీఆర్ మాదిరిగా …?
జగన్ విషయంలో మళ్ళీ ఎన్టీయార్ నే పోలిక తేవాలి అంటున్నారు. 1985లో భారీ విజయం తరువాత లోకల్ బాడీ ఎన్నికల్లోనూ టీడీపీ విజయఢంకా మోగించింది. ఆ తరువాత ఎన్టీఆర్ లో ఒక్కసారిగా అతి ధీమా కనిపించింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది టైమ్ ఉన్న నేపధ్యంలో ఒక్కసారిగా మొత్తం మంత్రివర్గాన్ని ఎన్టీఆర్ తొలగించారు. ఆ తరువాత కొత్త వారిని ఏ మాత్రం అనుభవం లేని వారిని తెచ్చిపెట్టారు. వారితోనే 1989 ఎన్నికలను వెళ్తే దారుణమైన పరాభవం ఎదురైంది. ఇపుడు జగన్ కూడా మంత్రివర్గ ప్రక్షాళన పేరిట మొత్తానికి మొత్తం మంత్రులను తీసేస్తారు అన్న ప్రచారం అపుడే ఊపందుకుంది. అదే కనుక జరిగితే వివిధ జిల్లాల్లో బలమైన నాయకులుగా, సామాజికవర్గం పరంగా వైసీపీకి వెన్నుదన్నుగా ఉన్న బిగ్ షాట్స్ కి గట్టి షాక్ తగులుతుంది. అపుడు వారు రివర్స్ అయితే మాత్రం వైసీపీకి భారీ దెబ్బ పడడం ఖాయమని అంటున్నారు. మరి జగన్ వరస విజయాలను మత్తుగా కాకుండా ఒక హెచ్చరికగా భావించి నడచుకుంటే మాత్రం మరో మారు అధికారం ఆయనదే అన్న మాట కూడా ఉంది.