జగన్ అలా చేసుకుంటూ పోతే ఇక ?

జగన్ రైతు కాదు, ఆ మాటకు వస్తే ఆయన తండ్రి వైఎస్సార్ కూడా రైతు కాదు. కానీ వారిద్దరికీ రైతుల పట్ల వారి సమస్యల పట్ల మాత్రం [more]

Update: 2021-05-05 02:00 GMT

జగన్ రైతు కాదు, ఆ మాటకు వస్తే ఆయన తండ్రి వైఎస్సార్ కూడా రైతు కాదు. కానీ వారిద్దరికీ రైతుల పట్ల వారి సమస్యల పట్ల మాత్రం మంచి అవగాహన, చిత్తశుద్ధి ఉంది. అదే సమయంలో రైతులకు ఏదో మేలు చేయాలన్న తాపత్రయం విషయంలో జగన్ వైఎస్సార్ ఇద్దరూ ఇద్దరే అని చెప్పాలి. ఇక విభజన ఏపీలో ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆదాయం లభిస్తోంది. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నా కూడా అడుగులు ముందుకు పడడంలేదు. అదే సమయంలో సమృద్ధిగా ఉన్న జలవనరులను వాడుకోవడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలన్న కోరిక మాత్రం జగన్ కి ఉంది.

చొరవ తీసుకున్నారే…?

శ్రీకాకుళం జిల్లా ఏపీలోనే చిట్ట చివరిది. వెనకబాటుతనంలో ముందుంటుంది. ఇక్కడ అతి పెద్ద జీవనది వంశధార. ఇది ఒడిషాను కలుపుతూ ఉంటుంది. వంశధారం మీద ఏ ప్రాజెక్ట్ చేపట్టాలన్నా కూడా ఒడిషా అనుమతి కావాలి. సహజంగా పొరుగు రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంటుంది. ఇపుడు వంశధార నీటిని ఒడిసిపట్టాలని జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. ఈ విషయంలో గత ముఖ్యమంత్రుల కంటే కూడా ఒక అడుగు ముందుకేశారు. ఒడిషాతో సమస్యలు ఏమైనా ఉంటే చర్చలకు తాను సిద్ధం అంటూ డైరెక్ట్ గా అక్కడి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కి లేఖ రాశారు. ఇది నిజంగా జగన్ చొరవకు నిదర్శనం అంటున్నారు.

ఒడిషా ఒప్పుకుంటే ..?

మన దేశంలో జీవజలాలు ఉప్పు సముద్రం పాలు అవుతున్నాయి అంటే దానికి పాలకుల నిర్లక్ష్యమే కారణం అని చెప్పుకోవాలి. సిక్కోలు జిల్లా మీదుగా సముద్రంలోకి వృధాగా పోతున్న వంశధార జలాలు అచ్చంగా 112 టీఎంసీలు ఉన్నాయి. ఆ నీటిని అడ్డుకోవాలంటే ఆనకట్ట నిర్మించాలి. అదే జిల్లాలో నేరడి వద్ద నిర్మించాలని గత ప్రభుత్వాలు సంకల్పించాయి. ఆ భూభాగం సేకరణ విషయంలో ఒడిషా అడ్డుపుల్లలు వేస్తోంది. దీని మీద ట్రిబ్యునల్ తీర్పులను కూడా పక్కన పెడుతోంది. అయితే ఏ ముఖ్యమంత్రి కూడా నేరుగా అక్కడి పాలకులతో చర్చలకు ఇంతవరకూ ముందుకు రాలేదు. ఆ పని ఇపుడు జగన్ చేస్తున్నారు.

జిల్లాకు వరమే…?

వంశధార నది నుంచి 112 టీఎంసీల నీటిలో అత్యధిక శాతం శ్రీకాకుళం జిల్లాకు దక్కుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ వెనకబడిన జిల్లా అన్నపూర్ణగా మారుతుంది. అంతే కాదు, సాగు తాగు నీటి కష్టాలు తీరడమే కాదు, పారిశ్రామికంగా కూడా జిల్లా ముందుకు సాగేలా నీటి వనరుల లభ్యత ఉంటుంది. ఇక ఒడిషా ముఖ్యమంత్రితో ఏపీ సీఎం హోదాలో చిట్టచివరి సారిగా చర్చించింది స్వర్గీయ ఎన్టీయార్ మాత్రమే. ఆయన 1986లో నాటి సీఎం బిజూ పట్నాయక్ తో రెండు రాష్ట్రాల సమస్యల మీద ముఖాముఖీ చర్చలు జరిపారు. ఇపుడు జగన్ కూడా ఇన్నేళ్ళ తరువాత నవీన్ పట్నాయక్ తో ముఖాముఖీ చర్చలు జరిపి అన్ని సమస్యలు పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. కాగా నేరడి బ్యారేజ్ నిర్మాణం కనుక చేపడితే జగన్ మరో కాటన్ దొర అవుతారని జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అంటున్నారు. మొత్తానికి జగన్ అడుగులు ఈ దిశగా పడడం శుభ పరిణామమే అని అంతా అంటున్నారు.

Tags:    

Similar News