ఫ్యామిలీతోనే జగన్ ను దర్శించుకోవాలా?

రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్న మాట ఉంది. దేని అయినా తమకు అనువుగా చేసుకుని రాజకీయం పండించుకోవచ్చు. ఇపుడు వైసీపీ నేతలు అదే తెలివిని చూపిస్తున్నారు. ఇదివరకూ [more]

Update: 2021-05-08 02:00 GMT

రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్న మాట ఉంది. దేని అయినా తమకు అనువుగా చేసుకుని రాజకీయం పండించుకోవచ్చు. ఇపుడు వైసీపీ నేతలు అదే తెలివిని చూపిస్తున్నారు. ఇదివరకూ నేతలు ఒక్కరే వెళ్ళి అధినేతను కలసి వచ్చేవారు. ఇపుడు మాత్రం ఏకంగా కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకుని సీఎం వద్దకు వెళ్తున్నారు. పనిలో పనిగా తమ సమస్యలను చెప్పుకోవడమే కాకుండా రాబోయే కాలానికి కాబోయే రాజకీయ వారసులను కూడా పరిచయం చేస్తున్నారు. మొత్తానికి జగన్ కూడా వచ్చిన వారిని ఆశీర్వదిస్తూ ఎవరి ఆశలూ నీరు కారకుండా అప్పటికి తగిన అభయమే ఇస్తున్నారు.

న్యూ ట్రెండే మరి..?

ఇలాంటి ట్రెండ్ ఒకటి ఉందని నాలుగు దశాబ్దాల రాజకీయం చేసిన తెలుగుదేశం తమ్ముళ్ళకు కూడా తెలియదు. వైసీపీ నేతలు మాత్రం అన్నీ నేర్చేశారు. ఇలాంటి విషయాల్లో టీడీపీ తమ్ముళ్ళను కూడా దాటుకుని ముందుకు సాగుతున్నారు. ఆ మధ్యన స్పీకర్ తమ్మినేని సీతారామ్ జగన్ ని తన కుమారుడు చిరంజీవి నాగ్ తో కలసి కొడుకు ఫ్యూచర్ కి హామీ పొందారు. మరో సందర్భంలో సతీమణి వాణిశ్రీని తీసుకుని మరీ జగన్ వద్దకు వెళ్ళి తన సమస్యలు చెప్పుకున్నారు. ఇదే రూట్లో ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ కూడా కుమారుడు క్రిష్ణ చైతన్యతో కలసి సీఎం వద్దకు వెళ్ళి వచ్చారు. అదే విధంగా తమకు కొత్తగా పుట్టిన కుమార్తెతో సహా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి దంపతులు కూడా వైసీపీ అధినేత జగన్ ని కలసి ఆశీస్సులు తీసుకున్నారు.

తూర్పు నేతల క్యూ….

ఇక మేయర్ కావాల్సిన విశాఖ నగర వైసీపీ ప్రెసిడెంట్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ యాదవ్ అది తృటిలో తప్పిపోవడంతో నేరుగా జగన్ వద్దనే పంచాయతీ తేల్చుకుంటానని చెప్పి మరీ వెళ్ళి ఆయన్ని కలిశారు. ఆయన ఒంటరిగా కాకుండా తన సతీమణితో కూడా పెట్టుకుని జగన్ వద్దకు వెళ్ళారు. అప్పట్లో ఓదార్పు యాత్ర వేళ విశాఖ వచ్చిన జగన్ని తన ఇంటికి అహ్వానించి వంశీ సకల మర్యాదలూ చేశారు. ఆనాడు వంశీ సతీమణి జగన్ ని అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచి మరీ రాఖీ కూడా కట్టారు. ఇపుడు తన భర్తకు మేయర్ సీటు దక్కకుండా అన్యాయం జరిగింది అన్నది చెప్పడానికే చెల్లెలు సెంటిమెంట్ పండించడానికీ వంశీ తన భార్యను కూడా వెంటబెట్టుకుని మరీ జగన్ వద్దకు వెళ్ళారని ప్రచారం అయితే సాగింది. మరి జగన్ వంశీకి ఇచ్చిన హామీ ఏంటి అన్నది వెల్లడి కాలేదు కానీ వంశీ వర్గంలో మాత్రం ఒక ధీమా అయితే కనిపిస్తోంది. ఇక వంశీతో పాటు అదే తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి అక్రమాని విజయనిర్మల కూడా పతీ సమేతంగా తాజాగా జగన్ ని కలవడం విశేషం. వీరి వెంట కుమారుడు అవినాష్ కూడా ఉండడం మరో ప్రత్యేకత.

వరాలు అందేనా..?

మరి విజయనిర్మల దంపతులకు జగన్ ఏ హామీ ఇచ్చాడో తెలియదు కానీ వారు కూడా ఇపుడు ఫుల్ హ్యాపీగానే ఉంటున్నారు. సొంత పార్టీలో తమ ప్రత్యర్ధి వంశీ సీఎం ని కలిసి వచ్చిన వెంటనే విజయనిర్మల వెళ్ళడం కూడా ఇపుడు చర్చగా ఉంది. మరో వైపు చూస్తే దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మరీ అప్పట్లో జగన్ ని కలిశారు. ఇక దివంగత నేత ద్రోణం రాజు శ్రీనివాస్ కుమారుడు శ్రీవాత్సవ కూడా తన తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని మరీ జగన్ని ఈ మధ్యనే కలసి వచ్చారు. ఆయన కూడా కరోనాతో తండ్రిని కోల్పోయిన తనకు పార్టీపరంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మొత్తానికి చూస్తే ఇలా కుటుంబ సమేతంగా వచ్చిన వారిని ఏ మాత్రం నిరాశపరచకుండా జగన్ దీవించి పంపుతున్నారు. మరి వారికి ఇచ్చే వరాల వివరాలు మాత్రం బయటకు తెలియడంలేదు. మొత్తం మీద వైసీపీలో ఈ ఫ్యామిలీ పాక్ ఎపిసోడ్ మాత్రం యమ జోరుగా సాగుతోంది. ఈ సెంటిమెంట్ పండితే కనుక మరింతమంది కుటుంబ సమేతంగా జగన్ ని దర్శించుకోవడానికి రెడీ అయిపోతున్నట్లుగా భోగట్టా.

Tags:    

Similar News