జనం చేతనే జవాబు చెప్పించారా?

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఊహించిందే. అధికారంలో ఉండటం, సిట్టింగ్ స్థానం కావడంతో సహజంగా వైసీపీకే అడ్వాంటేజీ ఉంటుంది. కానీ జగన్ ఈ తిరుపతి ఉప [more]

Update: 2021-05-02 13:30 GMT

తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఊహించిందే. అధికారంలో ఉండటం, సిట్టింగ్ స్థానం కావడంతో సహజంగా వైసీపీకే అడ్వాంటేజీ ఉంటుంది. కానీ జగన్ ఈ తిరుపతి ఉప ఎన్నికను తన పాలనపై ఒక అంచనాకు వచ్చేందుకు ఉపయోగించుకున్నారనే చెప్పాలి. మెజారిటీ ఎంతన్నది పక్కన పెడితే ఎక్కడా తమకు ప్రత్యర్థులు పోటీ ఇవ్వలేకపోయారని జగన్ మరోసారి తిరుపతి ఉప ఎన్నిక ద్వారా నిరూపించారు.

పెద్దగా పట్టించుకోనట్లే…?

వరస గెలుపులు జగన్ లో ఉత్సాహాన్ని నింపాయి. తిరుపతి ఉప ఎన్నికను జగన్ తొలినుంచి లైట్ గానే తీసుకున్నారు. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించడంతో ఆయన కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాల్సి ఉన్నా డాక్టర్ గురుమూర్తి పేరును ఖరారు చేశారు. బల్లి దుర్గాప్రసాదరావు తనయుడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక విష‍యంలో జగన్ మొదటి నుంచి గెలుపుపై సందేహం లేకపోయినా భారీ మెజారిటీ సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.

ఓట్ల శాతంలో…

కానీ జగన్ అనుకున్న స్థాయిలో మెజారిటీ రాలేదు. అయినా పోలయిన ఓట్లలో 70 శాతం వరకూ ఓట్లను వైసీపీ సాధించడం విశేషం. కనీసం జగన్ తిరుపతిలో ప్రచారం కూడా చేయలేదు. తిరుపతి ఓటర్లకు లేఖలు రాసి ఊరుకున్నారు. కరోనా వ్యాప్తి చెందుతుందని చివరి నిమిషంలో తన తిరుపతి పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారు. అయినా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు.

రెండేళ్ల తర్వాత…?

ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను ఇన్ ఛార్జులుగా నియమించి గెలుపు బాధ్యతను వారిపైనే పెట్టారు. ఆలయాలపై దాడులు, తిరుమలలో అన్యమత ప్రచారం వంటి విమర్శలకు కూడా జగన్ జవాబు ఇవ్వలేదు. జనం చేతనే జవాబు ఇప్పించాలనుకున్నాడు. అయితే మెజారిటీ ఊహించినంత రాకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజలు తనవైపే ఉన్నారని మాత్రం బలంగా చెప్పగలిగారు జగన్.

Tags:    

Similar News