ఇంకోసారి విజయం పెద్ద కష్టమేమీ కాదట..జగన్ కామెంట్స్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో హోప్స్ పెంచాయంటున్నారు. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన ఐదు [more]

Update: 2021-05-05 03:30 GMT

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో హోప్స్ పెంచాయంటున్నారు. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీ తిరిగి విజయం సాధించడాన్ని ఆయన ఉదాహరణగా చెబుతున్నారు. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలోనూ ఈ విషయాన్ని మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.

ప్రజల్లో నమ్మకం తెచ్చుకుంటే…?

ప్రజలకు నమ్మకం కలిగిస్తే విజయం వరిస్తుందని ఈ ఎన్నికల ఫలితాలను జగన్ విశ్లేషించినట్లు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ, అసోంలో బీజేపీ, కేరళలో పినరయి విజయన్ తిరిగి విజయం సాధించడం వెనక అక్కడ వారిపై ప్రజల్లో ఉన్న నమ్మకమే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు తెలిసింది. అందుకే ఎన్ని ఆర్థిక కష్టాలు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపడం లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా జగన్ చెప్పినట్లు తెలిసింది.

విజయన్ ను ఉదహరిస్తూ…..

ముఖ్యంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను జగన్ ఈ సమావేశంలో ఉదహరించినట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోయినా వరదలు, వైరస్ లతో రాష్ట్రం అల్లాడినా ప్రజలు ఆయన వెంట నడవడానికి ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలేనని జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. ఇందుకోసం కేంద్రంతో పిినరయి విజయన్ ఎలాంటి ఘర్షణ వైఖరికి కూడా దిగలేదన్న విషయాన్ని జగన్ గుర్తు చేసినట్లు సమాచారం.

మమత పోరాటాన్ని ….

ఇక మమత బెనర్జీ పోరాటాన్ని కూడా జగన్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిసింది. మమత కు సానుభూతి రావడానికి బీజేపీ చేసిన పనులే కారణమని జగన్ అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో తప్ప కూడదని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే అభివృద్ధిపై దృష్టి పెడితే మరోసారి విజయం పెద్ద కష్టమేమీ కాదని జగన్ మంత్రివర్గ సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జగన్ లో జోష్ ను నింపాయనే చెప్పాలి.

Tags:    

Similar News