ఏమాత్రం ఓటు బ్యాంకు తగ్గడం లేదుగా?

ఏడారిలో అయినా సరే ఎంత దూరమైనా నడవవచ్చు. అలాగే చీమలు దూరని చిట్టడవిలో సైతం దట్టమైన చీకటిలోనూ అడుగులు వేయవచ్చు. అయితే ఇవన్నీ చేయాలంటే కాలికి బలం [more]

Update: 2021-05-23 14:30 GMT

ఏడారిలో అయినా సరే ఎంత దూరమైనా నడవవచ్చు. అలాగే చీమలు దూరని చిట్టడవిలో సైతం దట్టమైన చీకటిలోనూ అడుగులు వేయవచ్చు. అయితే ఇవన్నీ చేయాలంటే కాలికి బలం ఉంటే మాత్రమే సరిపోదు, రేపటి మీద ఆశ ఉండాలి. ఎంత కష్టపడినా భవిష్యత్తు బాగుంటుంది అన్న భరోసా ఉండాలి. ఏపీలో విపక్షాలకు ఇపుడు అదే కరువు అయింది. జగన్ రెండేళ్ల పాలన పూర్తి అయినా విపక్ష శిబిరం నిండా నిరాశతో కొట్టుమిట్టాడుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తాము అన్న ధీమా ఏ ఒక్క పార్టీకీ కొంచమైనా లేకుండా పోయింది.

కుదేలైనట్లేనా…?

ఏపీలో ఈ రోజున ప్రతిపక్ష శిబిరంలో ఎవరికీ కూడా మిణుకుమిణుకుమనే చిన్నపాటి ఆశ కూడా లేదంటే నమ్మాల్సిందే. ముందుగా చెప్పుకుంటే బీజేపీకి సీన్ కాలిందనే అంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ఝలక్ ఆ పార్టీ ఎక్కడ ఉందో చెప్పేసింది. కాంగ్రెస్ మరింతగా కుదేల్ అయిపోయి ఇక ఆంధ్రా అన్న మాట నోట పలకడం కూడా వేస్ట్ అనుకుంటోంది. జనసేన విషయానికే వస్తే అక్కడంతా వన్ మ్యాన్ షోగా సినిమా నడుస్తోంది. ఒక విధంగా జనసేనాని పూర్తి అయోమయంలో పడిపోయారు అనే అంటున్నారు. ఉన్నంతలో తెలుగుదేశమే బహుమొనగత్తెగా కనిపిస్తోంది.

దిగనారిపోతూ….

అయినా సరే మేమే రేపటి రోజున అధికారంలోకి వస్తామని నిబ్బరంగా పసుపు పార్టీ చెప్పుకోవడానికి అవకాశమే లేదని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 38 శాతం ఓట్లు వస్తే రెండేళ్ల తరువాత జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో అది కాస్తా 32 శాతానికి పడిపోయింది. దాంతో మరో మూడేళ్ళ నాటికి ఎంతలా దిగనారిపోతామో తెలియదన్నదే తమ్ముళ్ళ బాధట. ఇక ప్రజా ఉద్యమాలు అంటున్నా అవేవీ ఫలితాన్ని ఇవ్వడంలేదు. మరో వైపు చూస్తే రెండేళ్ళ పాలన తరువాత కూడా వైసీపీ ఓటు బ్యాంక్ కసికందకుండా ఉండడమూ టీడీపీ శిబిరాన్ని తెగ కలత పెట్టేస్తోంది.

ఇలాగైతే ఎలా…?

సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా రెండేళ్ళ తరువాత మెల్లగా ప్రజా వ్యతిరేకత రావడం ఖాయం. కానీ జగన్ సర్కార్ తీరు అందుకు విరుద్ధంగా ఉంది. జనాలు ఇప్పటికీ జై జగన్ అంటున్నారు. జగన్ కి చూస్తే పాలనానుభవం కొత్తం, ఒకరిద్దరు మంత్రులు తప్ప అంతా కొత్తవారే. పైగా జగన్ సైతం వన్ మ్యాన్ షో గానే కధ నడిపిస్తున్నారు. అయినా సరే వైసీపీని జనం మెచ్చుతున్నారు. పార్టీ కూడా అంతకంతకు పటిష్టం అవుతోంది. ఇదే తీరు కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో విపక్షానికి చుక్కలూ చిక్కులూ తప్పవనే విశ్లేషణలు ఉన్నాయి. ఒక్క చాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్ మరీ ఇంతలా పాతుకుపోతే ఏం చేయాలో తెలియక‌ విపక్ష శిబిరం కకావికలే అవుతోంది.

Tags:    

Similar News