జగన్ సైలెంట్ వెనక … ?

మౌనం విషయంలో చాలానే చెబుతారు. అది పదునైన ఆయుధం అంటారు. మౌనంగా ఎవరైనా ఉంటే అది వారి బలం తప్ప మరోటి కాదు అంటారు. ఎక్కువగా మాట్లాడేవారు [more]

Update: 2021-05-16 08:00 GMT

మౌనం విషయంలో చాలానే చెబుతారు. అది పదునైన ఆయుధం అంటారు. మౌనంగా ఎవరైనా ఉంటే అది వారి బలం తప్ప మరోటి కాదు అంటారు. ఎక్కువగా మాట్లాడేవారు బలహీనులే తప్ప ఇంకేమీ కారు. జగన్ విషయానికి వస్తే ఆయన తక్కువగా మాట్లాడుతారు, ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తారు. అది ఆయన బలహీనత అనుకుంటే మాత్రం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ తప్పు అంటోంది. జగన్ మౌనం బద్ధలైతే ఆ బిగ్ సౌండ్ ఏలా ఉంటుందో ఇదొక ఉదాహరణ అంటున్నారు.

వేచి చూసి ….?

నిజానికి గత ఏడాదిన్నరగా వైసీపీ మీద రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఆయన అంతకంతకు మించిపోతున్నారు. అయినా జగన్ సహించారు, భరించారు అని వైసీపీలోనే అంటున్నారు. ఒక దశలో రాజు ని జగన్ ఏమీ చేయలేడు అని కూడా వైసీపీలోనే ఒక విధమైన వాదన వినిపించింది. అలా రచ్చబండ వేదికగా చేసుకుని తన మీద వ్యక్తిగతంగా బండలు వేస్తున్నా కూడా జగన్ వేచి చూశారు తప్ప నోరు మెదపలేదు. కానీ దాని వెనక భారీ వ్యూహమే ఉందని ఈ సడెన్ అరెస్ట్ తో స్పష్టం అయింది.

బిగ్ రిలీఫ్….

సీఐడీ అధికారులు రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయడంతో వైసీపీలో ఒక రకమైన రిలీఫ్ కనిపిస్తోంది. వైసీపీలో జగన్ ముందు కనీసం మాట్లాడానికే ఆలోచించే వారే ఎక్కువ. అలాంటిది అలవోకగా జగన్ మీద విమర్శలు చేస్తూ రెచ్చిపోతున్న రాజుతో ఆ పార్టీలో చాలా అయోమయం గందరగోళం ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నాయకులకు అయితే ఏకంగా మండుతోంది. కానీ వారంతా వైసీపీ హై కమాండ్ మాట మేరకు రాజు మీద తిరిగి విమర్శలు చేయడం మానుకున్నారట. ఇపుడు రాజు అరెస్ట్ తో మంచి పనే జరిగింది అంటున్నారు. మంత్రులు తానేటి వనిత, రంగనాధరాజు లాంటి వారు అయితే ఇది ఎపుడో జరగాల్సింది, జగన్ కి ఓపిక చాలా ఎక్కువ కాబట్టే కధ ఇంతదాకా వచ్చింది అంటున్నారు.

హెచ్చరికే …?

జగన్ ప్రతీ ఒక్క తప్పునూ గమనిస్తున్నారు. ప్రతీ ఒక్క మాటను లెక్క పెడుతున్నారు. సమయం సందర్భం కుదిరినపుడు ఇంతకు ఇంత అన్నట్లుగా చెల్లింపులు ఉంటాయి అన్నదే రాజు అరెస్ట్ వెనక ఉన్న సందేశం అంటున్నారు. జగన్ నిస్సహాయుడని, ఏమీ చేయలేడని భావించే వారికి కూడా ఇది హెచ్చరిక అని చెబుతున్నారు. ఇక స్వపక్షంలో కొందరు మాజీ మంత్రులు కూడా ఆ మధ్య అసమ్మతి గళం వినిపించారు. కొందరు ఎంపీలు కూడా అసంతృప్తితో ఉన్నారని వార్తలు వచ్చాయి. అలాంటి వారందరికీ ఇదొక బలమైన సందేశం అని చెబుతున్నారు. మొత్తానికి ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇటు స్వపక్షానికీ అటు విపక్షానికీ కూడా జగన్ ఒక్కసారిగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేశారు అంటున్నారు.

Tags:    

Similar News